పొలిటికల్‌ పిక్చర్‌ : పెదకూరపాడులో జనసేనకు ఎదురుదెబ్బ!

Submitted on 9 May 2019
Political Picture In Pedakurapadu

ఎన్నికలు ముగిసినా గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపునకు అనుకూలించే అంశాలను బేరీజు వేసుకుంటూ విజయం తమదంటే తమదంటూ ధీమాగా ఉన్నారు. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాల విశ్లేషణ చేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి పెదకూరపాడు నియోజకర్గంలో గెలుపెవరిది.. టీడీపీ అభ్యర్ధి ఈసారి కూడా గెలిచి హాట్రిక్ సాధిస్తాడా. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వైసీపీ అభ్యర్ధి చట్టసభల్లో అడుగుపెడతారా. గెలుపుపై ఎవరి వాదన ఎలా ఉంది. 

గుంటూరు జిల్లాలో రాజకీయంగా డిమాండ్ ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. ఈ నియోజకవర్గం పూర్తిగా కృష్ణా నదీ తీరంలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటంతో ఎన్నికలు నిర్వహించాలంటే కత్తిమీద సాములా ఉండేది. కానీ 2014, 2019లో ఎన్నికలు ప్రశాంతగా జరిగాయి. ఈ నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ఏ పార్టీ గెలుస్తుంది.. పెదకూరపాడులో పాగావేసే ఎమ్మెల్యే ఎవరు.. అనేది ఇప్పుడు అంతా చర్చానీయాంశంగా మారింది. 

ఈ నియోజకవర్గంలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ అభ్యర్ధుల మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ తరపున కొమ్మాలపాటి శ్రీధర్ బరిలో దిగగా, వైసీపీ తరపున నంబూరి శంకర్రావు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్ధి కొమ్మాలపాటి ఈసారి కూడా తనదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పధకాలు తనకు శ్రీరామ రక్ష అంటున్నారు. మహిళా ఓటింగ్ తనకు భారీ మెజారిటీ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్ధి నంబూరి శంకర్‌రావు పెదకూరపాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టేది నేనేనంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ నవరత్నాల ఫార్ములా ప్రజలను వైసీపీ ఆకట్టుకుందని.. పెదకూరపాడులో పార్టీ జెండా ఎగరటం ఖాయమని చెబుతున్నారు. 

టీడీపీ, వైసీపీ హోరాహోరీగా సాగుతుండటంతో ఓటరు నాడి తెలుసుకోవటం కష్టంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరు ఉంది. అందుకే వరుసగా రెండు సార్లు ఆయన్ని ఇక్కడి ప్రజలు గెలిపించారు. ఈ టికెట్ కోసం టీడీపీ నేతలు చాలామంది ప్రయత్నించారు. ఒకానొక సమయంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు లోకేష్‌ని పెదకూరపాడు నుంచి బరిలోకి దించాలనే ఆలోచన కూడా జరిగింది. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే తిరిగి సీటిచ్చారు. 2009లో గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారంటూ శ్రీధర్‌కు మంచి పేరు వచ్చింది. 

2014 తరువాత అభివృద్ది, సంక్షేమ పధకాల అమలు సజావుగానే సాగినా.. ఆయన సొంత రియల్ ఎస్టేట్  వ్యాపారంలో ఎక్కువ సమయం నిమగ్నమయ్యారని, పార్టీ వ్యవహారాలు కొద్దిమంది టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ఆ ప్రభావం కొంత ప్రతికూలంగా మారిందనే వాదన వినిపిస్తుంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. వరుసగా 5 సార్లు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే 2009, 2014లో టీడీపీ గెలుపొందింది. మరోవైపు సామాజికవర్గాల పరంగా ఈసారి వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.

వర్గీకరణ డిమాండ్ నెరవేరకపోవటంతో.. మాదిగలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే వాదన ఉంది. ఎస్టీ, మాలలు, ముస్లింలు వైసీపీకి సంప్రదాయక ఓటర్లు. అటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు తక్కువే ఉన్నా .. పార్టీ కోసం ఇతర కులాల ఓట్లు కూడా వైసీపీకే పడేలా ప్రభావితం చేశారని అంచనాల్లో తెలుస్తోంది. వైశ్యులు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీసీ సబ్ ప్లాన్ వల్ల యాదవ సామాజిక వర్గంలో కొంత మేరకు మినహా బీసీల్లోని ఉపకులాలన్నీ వైసీపీకే అనుకూలమనే అంచనాలు ఉన్నాయి.

ఇక్కడ కాపు ఓటర్లు గతంలో పవన్ కళ్యాణ్ ప్రభావంతో టీడీపీకే వేశారని.. ఈ సారి జనసేన కూడా బరిలో ఉండటంతో.. కాపులంతా జనసేనకు ఓట్లు వేశారంటున్నారు. దీనివల్ల టీడీపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు మహిళా ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నా అందరూ టీడీపీకే ఓట్లు వేయలేదనే వాదన వినిపిస్తోంది. వైసీపీ అభ్యర్ధి నంబూరి శంకర్ రావు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందటంతో .. టీడీపీలో అసంతృప్త నేతలు, కార్యకర్తలు.. శంకర్ రావుకు అనుకూలంగా వ్యవహరించటం.. ఆయన గెలుపుకు అనుకూల అంశంగా చెబుతున్నారు. ఇక్కడ జనసేన పోటీ చేసినప్పటికి పార్టీ పరంగానూ కుల పరంగానూ ప్రయోజనం తక్కువగానే ఉందని చెప్పాలి. టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు గెలుపు మాదంటే మాదంటూ ధీమాగా ఉన్నారు. అయితే పెదకూరపాడులో గెలుపు ఎవరి సొంతం కాబోతుందో వేచి చూడాల్సిందే.

Political Picture
pedakurapadu
janasena
Ysrcp
Guntur Dist

మరిన్ని వార్తలు