విజయసాయిరెడ్డిని పలకరించి, కరచాలనం చేసిన ప్రధాని మోడీ

Submitted on 19 June 2019
pm modi wishes to mp vijaya sai reddy

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అఖిలపక్షం సమావేశం ముగిసిన తర్వాత కేంద్రమంత్రులతో కలిసి ప్రధాని మోడీ బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ఒక్కసారిగా మోడీ ఆగారు. విజయ్ గారూ అంటూ ఆయన్ను ప్రత్యేకంగా పిలిచి అప్యాయంగా పలకరించారు. ప్రధాని మోడీ చేయిచాచి పిలవగానే.. విజయసాయిరెడ్డి వెళ్లి ఆయనకు కరచాలనం చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మోడీకి నమస్కారం చేసి వెళ్లిపోయారు. 

ఢిల్లీలో బుధవారం (జూన్ 19,2019) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. జమిలి ఎన్నికలపై కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కమిటీలో అన్ని రాజకీయ పక్షాలు, ఈసీ సభ్యులు ఉంటారని చెప్పారు. అధ్యయనం, చర్చల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జమిలి ఎన్నికలపై అఖిలపక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానిస్తే.. 24 పార్టీలు మాత్రమే పాల్గొన్నాయని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదని దేశ ఎజెండా అని.. ఇది అన్ని పార్టీలు దృష్టిలో ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 

ఈ భేటీకి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్.. జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. జ‌మిలి ఎన్నిక‌ల విధానానికి ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ సైతం ఓకే చెప్పేశారు. వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ విధానాన్ని స‌మ‌ర్థించారు. రాజ్యాంగంలో అహింసను కూడా జోడించాల‌ని ప‌ట్నాయ‌క్ సూచించారు. పార్ల‌మెంటుతో పాటు అసెంబ్లీలో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒడిశాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాలన్నారు.

ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 
 

pm modi
wishes
YCP
Mp Vijaya Sai Reddy
Delhi


మరిన్ని వార్తలు