సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారికి ఫాస్టాగ్ కష్టాలు

Submitted on 12 January 2020
people who go to the Sankranti festival, Fastag Difficulties

సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. తెల్లవారు జాము నుంచే రహదారులపై రద్దీ మొదలైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర వాహనాలు బారు లు తీరాయి. టోల్‌గేట్ సిబ్బంది విజయవాడ వైపు 4క్యాష్ అండ్ క్యారీ, 5ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వందల సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో.. ట్రాఫిక్ తగ్గడం లేదు. టోల్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు వేగంగా వాహనాలను పంపడానికి చర్యలు చేపట్టారు.

సంక్రాంతి సంబరాలేమో గాని.. ప్రయాణం పేరు చెబితేనే వణుకు పుట్టేలా ఉంది. ముందు ఛార్జీల వంతు అయితే.. రెండోది ట్రాఫిక్‌ జామ్‌ గురించి. టోల్‌ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర.. గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ రూట్‌లో ప్రయాణికులు, వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. అటు మహబూబ్‌నగర్‌ రూట్‌లో కూడా వాహనాల రద్దీ భారీగా ఉంది. 

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. నల్లగొండ జిల్లాలోని పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద విజయవాడ మార్గంలో కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రెండు వైపులా 16 గేట్లు ఉండగా విజయవాడ వైపు పది గేట్లు తెరిచారు. కొర్లపహాడ్‌ వద్ద 8 బూత్‌లు తెరిచారు. 

ఈ సారి ఫాస్టాగ్‌ను అమల్లోకి తీసుకురావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ గేట్ల పనితీరు అస్సలు బాగోలేదు. ఫాస్టాగ్‌ను గుర్తించే పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులకు టోల్‌ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు.  


సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళుతున్న నగరవాసులకు ఫాస్టాగ్ ఇక్కట్లు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా జడ్చర్ల ఎక్స్‌ప్రెస్ హైవే  టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు  తీరాయి. ఫాస్టాగ్ లేకుండా క్యాష్‌తో టోల్ గేట్‌ ట్యాక్స్ చెల్లించాలనుకునేవారికి..టోల్‌ సిబ్బంది కేవలం రెండు లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. 

అటు ఛార్జీల బాదుడు కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విజయవాడకు 950 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖకు ఏకంగా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వేరే ఆప్షన్‌ లేకపోవడంతో రేటు ఎక్కువైనా సరే.. సొంతూళ్లకు వెళ్తున్నారు. 
 

people
sankranti festival
FASTag
difficulties
Hyderabad
toll plaza
Traffic Jam

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు