ఎంపీగారు ఎక్కడ? కార్యకర్తల్లో అయోమయం!

Submitted on 21 January 2020
Peddapally MP Borlakunta Venkatesh not active in party activities after he became MP

పెద్డపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఆయన. ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్‌కు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడంతో ఎంపీగా విజయం సాధించారు. ప్రజా సేవే పరమావధిగా భావించి రాజకీయల్లో వచ్చానని మొదట్లో చెప్పుకొచ్చిన ఆయన.. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత అసలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పార్టీ కార్యకర్తలే అంటున్నారు.

ఎంపీగా విజయం సాధించడం కంటే ముందు వెంకటేశ్‌ నేత మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి... టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న బాల్క సుమన్ శాసనసభకు పోటీ చేసి గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వెంకటేశ్‌.. లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. ఆయన గెలుపు కోసం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలంతా శాయశక్తుల కృషి చేశారు. ఎంపీ అయిన తర్వాత వెంకటేశ్‌ వ్యవహర శైలిలో మార్పు వచ్చిందంటూ పార్టీ శ్రేణులు గుసగుస లాడుతున్నాయి.

బలమైన క్యాడర్‌తో సుమన్ :
గతంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో విజయం సాధించిన ఎంపీలంతా నిత్యం ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునే వారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న బాల్క సుమన్ సైతం విస్తృతంగా పర్యటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీగా మొదటి సారి పోటీ చేసి విజయం సాధించిన సుమన్ అనతి కాలంలోనే ప్రజలకు దగ్గరవడమే కాదు... పార్టీ క్యాడర్‌కు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు.

తనకంటూ బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత ఎంపీ వెంకటేశ్‌ తీరు ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు టీఆర్ఎస్‌ కార్యకర్తలు. ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, తనకంటూ కేడర్‌ను ఏర్పాటుచేసుకోలేకపోవడం, ఇప్పటికీ లోకల్ ఎమ్మెల్యేల పైనే ఆధార పడడంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.

మైక్ దోరికితే అనర్గళంగా మాట్లాడే ఎంపీ వెంకటేశ్‌కు మాటలు తప్ప చేతల్లో ఏమీ చేయరని ఓ వర్గం వారు సెటైర్లు వేస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలు పిలిస్తే అతిథిగా వచ్చి వెళ్లడం తప్ప మరో కార్యక్రమంలో పాల్గొనరనే విమర్శలున్నాయి. అతిథిగా హాజరై ఆవేశంలో ఏమి మాట్లాడుతారో? ఎక్కడ నోరు జారుతాడో అనే టెన్షన్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఉందంటున్నారు. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీని స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పిలవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.

ప్రచారానికి దూరంగా వెంకటేశ్ :
మరో వైపు టీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పట్టు కోసం ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఇదే లోక్‌సభ స్థానం నుంచి వివేక్ ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయల్లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న వివేక్ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, అధికార పార్టీ ఎంపీ వెంకటేశ్‌ ప్రచారానికి దూరంగా ఉంటున్నారట. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే... ప్రత్యర్థి భవిష్యత్‌లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి బలమైన రాజకీయ పునాది వేసుకొనేందుకు పావులు కదుపుతుంటే... వెంకటేశ్‌ ఇంత ప్లాన్‌ లేకుండా ఉండడం ఏంటని అనుకుంటున్నారు.

ఎంపీ అయిన తర్వాత రాజకీయంగా ఎదిగానని భావించే వెంకటేశ్‌కు భవిష్యత్‌లో రాజకీయంగా పోటీ తప్పదని అంటున్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని అనుకుంటున్నట్టుగా ఉందని సొంత పార్టీలోనే అనుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుత రాజకీయాల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాజకీయ జీవితానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంలో ఎంపీ జాగ్రత్తగా లేకపోతే దెబ్బయిపోవడం ఖాయమని అంటున్నారు. రాజకీయల్లో ఏదైనా జరగవచ్చన్న దానికి ఎంపీ వెంకటేశ్‌ ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నప్పుడు ఆయనే ఆ విషయాన్ని తెలుసుకోలేక పోవడం పట్ల పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారట.

peddapally
MP Borlakunta Venkatesh
party activities
MP
Balka Suman

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు