ఆగిన చక్రాలు : ఐదో రోజు..ప్రయాణీకుల ఇక్కట్లు

Submitted on 9 October 2019
 The ongoing TS RTC strike

అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు... ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల ఇబ్బందుల నడుమ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదవ రోజుకు చేరింది. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురవుతున్నారు. తమ సమస్యలపై కార్మికులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

అక్టోబర్ 09వ తేదీ బుధవారం కూడా పలుచోట్ల బస్సులు రోడ్డెక్కుకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. తాము సమ్మెలో ఉంటే బస్సులు ఎలా నడుపుతారంటూ అధికారులతో పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. వినూత్నంగా నిరసనలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రోజురోజుకు రోడ్డెక్కే బస్సుల సంఖ్యను పెంచుతోంది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు ఎవరికి వారే సమ్మెపై పట్టుదలగా ఉండడంతో పండుగకు వెళ్లిన ప్రజలు మాత్రం ఇబ్బందిపడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె 5వ రోజు కొనసాగుతోంది. దీంతో ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నిరూట్లకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. దసరా పండగ ముగించుకున్న ప్రజలు.. వారి గమ్య స్థానాలకు చేరేందుకు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. అయితే రద్దీ కూడా పెరిగి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకుంటున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె..నెక్ట్స్‌ ఏంటి? : పట్టువీడని కార్మికులు, మెట్టుదిగని ప్రభుత్వం

Ongoing
TS RTC
Strike
48 hour long strike

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు