ఉద్యోగాలే ఉద్యోగాలు : సచివాలయం పోస్టులకు నేడే నోటిఫికేషన్

Submitted on 22 July 2019
notification for ap grama sachivalayam jobs

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాత పరీక్షలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. సెప్టెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ట్రైనింగ్ ఇస్తారు. 30వ తేదీన ఉద్యోగాలను కేటాయిస్తారు. అక్టోబర్‌ 2 నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

ప్రతీ గ్రామంలో సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఒక్కో గ్రామ సచివాలయంలో 10మంది ఉద్యోగులను నియమిస్తారు. పంచాయతీకి ఒకటి చొప్పున 13వేల 65 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వేల కంటే అదనపు జనాభా కలిగిన పంచాయతీల్లో అనుంబంధ సచివాలయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో అదనంగా 1,800 అనుబంధ సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి.

గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.. వార్డు సచివాలయాల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి 4వేల జనాభా ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వార్డు సచివాలయాల్లో పోస్టులకు డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించింది ప్రభుత్వం. ఒక్కో వార్డు సచివాలయంలో 10 పోస్టుల చొప్పున 37వేల 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి ఆరుగురు.. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నలుగురు బాధ్యతల నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో వార్డు కార్యదర్శి పోస్టుతోపాటు.. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్య, ప్రణాళిక-క్రమబద్ధీకరణ, వెల్ఫేర్ డెవలప్‌‌మెంట్, ఇంధన, ఆరోగ్య, రెవెన్యూ, మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టులు ఉన్నాయి.

అవసరాన్ని బట్టి జనాభా 3 వేల నుంచి 5 వేల వరకు వార్డు సచివాలయాల ఏర్పాటు కూడా ఉండొచ్చు. ప్రత్యేకించి డివిజన్లలో అత్యధిక జనాభా కలిగిన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి పెద్ద నగరాల్లో వార్డు సచివాలయాలు అదనంగా వస్తాయి. వార్డు సచివాలయాల కోసం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి 21,756 ఉద్యోగులను, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి మరో 12,600 ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా ఎంపికయ్యే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల ప్రొబేషన్‌ కాలంలో నెలకు రూ.15 వేలు జీతంగా చెల్లిస్తారు. ఆ తర్వాత సర్వీసు నిబంధనల ప్రకారం వారికి వేతనాలను ఖరారు చేస్తారు.

Jobs

notification
AP Grama Sachivalayam
jobs
cm jagan
ward sachivalayam

మరిన్ని వార్తలు