టాలీవుడ్ 2017

21:53 - December 29, 2017

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వచ్చాయి. ఒకటి మెగాస్టార్ 150 వ చిత్రం.. మరొకటి బాహుబలి2. కట్టప్పను చంపిందెవరో తెలుసుకోటానికి ప్రేక్షకులు ఆరాటపడ్డారు. ఫలితం మెగా హిట్ గా నిలిచింది బాహుబలి. ఇక పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు... ఆ తర్వాత. ఆద్యంతం వివాదాస్పదంగా నిలిచిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఏడాది సత్తా చాటిన మరో భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టు కథా కథనాలు సాగటంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

టాక్ తో సంబంధం లేదు.. టాక్ ఫ్లాప్ అంటుంది. కలెక్షన్లు మాత్రం రివర్స్ లో ఉంటాయి. అవును.. 2017లో టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై కనకవర్షం కురిపించారు. సినిమాలకు ఫ్లాప్ టాక్.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.. ఈ ఏడాది చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చాయి. అదే సమయంలో చాలా కాలంగా హిట్ చూడని హీరోలు కొందరికి 2017 బంపర్ హిట్ లను అందించింది. ఓ పక్క రొటీన్ సినిమాలు వెల్లువెత్తుతున్నా, మంచి సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆదరించటం సహజంగా జరిగే విషయం. 2017లోనూ అదే జరిగింది. కొన్ని అంచనాలు మించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. కొన్ని ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం సాధించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు లైఫ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ ఉత్సాహంతో ఇండస్ట్రీ 2018వైపు ఆశావహంగా అడుగులు వేస్తోంది.

 

Don't Miss