చంద్రన్న విలేజ్ మాల్స్ ఎందుకు...?

20:17 - December 14, 2017

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చంద్రన్నా ఎవరికోసమన్నా?రేషన్ షాపులను మరింత బలోపేతం చేసి సామాన్యుడి కడుపు నింపాల్సింది వదిలేసి.... మాల్స్ ఎందుకన్నా? గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు కాదన్నా..బియ్యం,కందిపప్పు, నూనె, కావాలన్నా..!! రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లను..కాదు..మా బాగోగులు పట్టించుకో అన్నా..చంద్రన్నా .. అంటున్నాడు సామాన్యుడు..

మాల్స్ భాగస్వాములుగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపునెలా ఎంపిక చేస్తారు?ప్రజలకవసరమైన సరుకులు సరఫరా చేయలేనంత చేతకానిదా ఏపీ సర్కారు?ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... దాని ద్వారా కార్పొరేట్లకు ఆదాయాన్ని పంచుతున్నారా? ఎవరికోసం ఈ మాల్స్? ఎవరికి లాభం? చంద్రన్నమాల్స్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశమంతా జీఎస్టీ ఉంటే ఏపీలో సీఎస్టీ ఉందని, హెరిటేజ్ రిలయన్స్ లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయమని వైసీపీమండిపడుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నడ్డి విరిచి సామాన్యుడిని దోపిడీ చేసి కార్పొరేట్లకు దోడిపెట్టే ప్రయత్నం ఇదని సీపీఎం విమర్శిస్తోంది..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజలకోసం చేస్తున్నామని చెప్పే పనుల అసలు గుట్టు తేల్చాలి.. కాకులను కొట్టి గద్దలకు వేసే కుట్రలను వ్యతిరేకించాలి..సామాన్యుడిని వినిమయ సంస్కృతికి తరలించి సొమ్ము చేసుకునే కుట్రలను తిప్పి కొట్టాలి.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తూ, చౌక దుకాణాలను నాశనం చేసే మాల్స్ ను వ్యతిరేకించాలనే వాదనలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.


 

Don't Miss