పాటకు సలాం....

20:57 - December 13, 2017

పాట కదిలిస్తుంది.. పరుగులు పెట్టిస్తుంది.. ప్రవహించేలా చేస్తుంది...భాషలో మాటకెంత ప్రాధాన్యం ఉందో.. పాటకు అంతకంటే ఎక్కువే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు గడ్డపై జరిగిన అనేకానేక ఉద్యమాల్లో ప్రజల కోసం గొంతెత్తిన పాట సాధించిన విజయం అసామాన్యం. అది తెలంగాణ సాయుధ పోరాటమైనా, విప్లవోద్యమమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా ఏ సందర్భంలో అయినా తెలుగు పాట దగద్ధగమంటూ వెలిగింది. ఉద్యమ స్ఫూర్తిని రెప రెపలాడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాటకు మనిషికి ఉన్నంత చరిత్ర ఉంది. అందులో తెలుగు ప్రజాపాటది త్యాగపూరితమైన చరిత్ర. వీరోచితమైన చరిత్ర.. అందుకే పాటకు సలాం...చెప్తూ.. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు పోరాట పాటపై ప్రత్యేక కథనం.. తిరుగుబాటు చేయనిదే మార్పు రాదు.. పాలకులతో కొట్లాడందే మార్పు రాదు. మరి ఆ ఉద్యమాలను వెలిగించటానికి నాయకత్వం ఒక్కటే సరిపోదు.. దారి చూపే కళా రూపాలు కావాలి. దానికి పాటను మించింది మరొకటి లేదు. అందుకే తెలుగు ప్రజల ఉద్యమ పాటల చరిత్ర ఎంతో ఘనమైనది..

పోరాటం ఉదయించాలంటే పాట కావాలి..ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నిండాలంటే పాట కావాలి..సమాజాన్ని ఏక తాటిపై నిలబెట్టి ఒకే దిశలో పరిగెత్తించాలంటే పాటను మించిన సాధనం మరొకటి ఉంటుందా? అందుకే తెలుగు నేలపై జరిగిన ప్రతి ఉద్యమంలో పాట ప్రధాన భాగం.. మోగే డప్పు, చిర్రా చిటికెన పుల్లా....ఆకాశాన్ని సవాల్ చేసే స్వరం.. ఇంత కంటే ఉద్యమాన్ని వెలిగించటానికి మరే ఆయుధమైనా బలాదూరే.. తీయనైన తెలుగు భాషలో ఎన్నో సృజన స్వరూపాలు.. కథ, నవల, కవిత ఇలా ఎన్నున్నా.. పాటకున్న ప్రాధాన్యత అంతులేనిది. అందుకే తెలుగు గడ్డమీద పాటలేని ఉద్యమాన్ని, పాట వినిపించని పోరాటాన్ని ఊహించలేం. ప్రతి ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలబడింది.. అవును పాటకు సలాం.. పెను నిద్దుర వదిలించిన పాటకు సలాం.. పాలకులను ప్రశ్నించిన పాటకు సలాం.. ఉద్యమ పతాకను రెపరెపలాండించిన పాటకు సలాం.. తెలుగు పాటకు సలాం. తెలుగు భాషకు సలాం..  

Don't Miss