ఉద్యోగాలు ఎక్కడా....?

20:26 - December 4, 2017

మన ఉద్యోగాలు..మనవే..నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..అంకె భారీగా ఊరిస్తూనే ఉంది.. అమలుపైనే అసలు సందేహాలు..ఓ పక్క సమర్ధింపులు.. మరోపక్క కొట్లాటలు..మూడున్నరేళ్లు గడుస్తుంది.. ఇంకెప్పుడని రోడ్డెక్కుతున్నారు.. ఆందోళనకు దిగుతున్నారు.. తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెప్పేది కాకి లెక్కలేనా? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెపుడు? కొలువుల కొట్లాట ఏ దారిలో నడవనుంది? కొలువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు దేనికీ పనికి రానివిగా మారిపోతున్నాయి. కోచింగ్ సెంటర్లలో ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆశలు తీరవు..హామీలు ఆగవు.. బతుకుపోరు నానాటికీ బరువుగా మారుతున్న దృశ్యం..

 

అసలు తెలంగాణలో ఎందరు నిరుద్యోగులున్నారు? ఎన్ని ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? సర్కారు గతంలో ఏం చెప్పింది.. ఇప్పుడేం చెప్తోంది?తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించింది? ప్రైవేటురంగం ఎన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఇచ్చింది? అంకెలు స్పష్టంగా కనపడుతున్నాయి.. నిరుద్యోగుల సంఖ్య స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు దాటవేతలూ స్పష్టమౌతున్నాయి.. ఉపాధి కల్పన సర్కారు బాధ్యత కాదా? ఉద్యోగాలు జనరేట్ అయ్యే పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఒప్పందాల ఆడంబరాలకే పరిమితమౌతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమేనా?దేశంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోతున్నాయి. సర్కారు తన బాధ్యతలను వదుల్చుకుంటున్న తరుణంలో, పబ్లిక్ సెక్టార్ నుంచి చాలా బాధ్యతలు ప్రైవేటు పరం అవుతున్నాయి.. కానీ, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయని ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని కూడా అంతే నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.. చిన్నా చితకా పని దొరకటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఆ మధ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వారు కూడా రావటం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది.

 

ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఉపాధి అవకాశాలు పెరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ రంగ ఖాళీలను భర్తీ చేయాల్సిన పని సర్కారుదే.. కానీ, సరళీకరణ విధానాల పరుగులో ప్రభుత్వాలు పెట్టుబడులు, లాభాలు అంటూ నేలవిడిచి సాము చేస్తూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదులుతున్నాయి. మాటలకే పరిమితమౌతూ కార్పొరేట్ పెద్దలకు అనుకూల నిర్ణయాలతో నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి.. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే … తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ లోకానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించటమే మార్గం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

 

 


 

 

Don't Miss