నన్నెవ్వరూ టచ్ చేయలేరు..ఏ కోర్టు ప్రాసిక్యూట్ చేయలేదు : నిత్యానంద

Submitted on 7 December 2019
Nobody can touch, no court can prosecute - Nithyananda..

రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానంద...తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో నిత్యానంద తన ఎదురుగా కూర్చున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ...నన్నుఎవ్వరూ టచ్ చేయలేరు. ఏ స్టూపిడ్ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు. నేను పరమశివుడిని. నేను నిజం చెప్పగలను. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను అంటూ ఆయన మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈక్వెడార్‌ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి​ చేస్తోందని అందులో తెలిపారు. 

అయితే ఈక్వెడార్‌ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలపై భారత్ లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్‌ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. 

మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్‌ రద్దు చేసినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం(డిసెంబర్-6,2019) తెలిపింది. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు పోలీసు క్లియరెన్స్ పొందకపోవడంతో పెండింగ్‌లో ఉందన్నారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. నిత్యానంద గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని విదేశీ ప్రభుత్వాలను కోరినట్లు రవీష్ తెలిపారు.

nityanada
touch
nobody
PROSECUTE
Court
Viral Video

మరిన్ని వార్తలు