ఊరంతా సంక్రాంతి: సిక్కోలులో కనపడని పండుగ

Submitted on 12 January 2019
No Pongal Effect in Srikakulam District

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగతో ఊరు, వాడ కళకళ లాడుతుంటే ఉత్తరాంధలోని సిక్కోలులో మాత్రం ఆకళ తగ్గినట్టు కనిపిస్తోంది. ప్ర‌తి ఏటా సంతోషాల‌ను తెచ్చే  సంక్రాంతి ఈసారి శ్రీ‌కాకుళం జిల్లాలో మాత్రం స‌ర్దుకుపోమ‌ని చెప్పింది. స‌రిగ్గా మూడు నెల‌ల క్రితం వచ్చిన తిత్లీ తుఫాన్ దెబ్బ‌కు కుదేల‌యిన జిల్లా వాసుల‌కు ఈఏడు సంక్రాంతి నిరాశ ప‌రుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండి, సంస్కృతీ, సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేసే సిక్కోలులో పెద్ద పండ‌గ ఎఫెక్ట్ క‌న‌బ‌డ‌డం లేదు.
శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి నిరాశ నిస్పృహ‌ల మ‌ధ్య కొన‌సాగుతోంది. ముఖ్యంగా వ్య‌వ‌సాయాధారిత ప్రాంత‌మైన ఈజిల్లాలో పండ‌గ ఎంత‌గానో ప్ర‌భావం చూపేది. రైతుల‌, మ‌హిళ‌లు, యువ‌త‌, పిల్లలు స‌ర‌దాగా జ‌రుపుకునే సంక్రాంతి ఈసారి మాత్రం నిట్టూర్పుల మ‌ధ్య ఉత్సాహం లేక పేలవంగా సాగుతోంది. ఇప్ప‌టికే సెల‌వులు ఇవ్వ‌డంతో ప‌ల్లెల్లో బంధువులు వ‌చ్చారు. అయితే గతేడాది అక్టోబ‌రు 11న సంభవించిన తిత్లీ తుఫాన్ దాటికి జిల్లాలో వేల కోట్ల రూపాయ‌లు న‌ష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతం, తీర ప్రాంతంలోని మ‌త్స్య‌కార గ్రామాలు, వ‌ర‌ద ముంపుతో పాల‌కొండ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాలు తిత్లీ దెబ్బ‌కు కుదేల‌యిపోయాయి. రైతుల ప‌రిస్థ‌ితి ద‌య‌నీయంగా ఉంది. మూడు నెల‌ల‌వుతున్నా వేలాది మందికి ఇంకా నష్ట ప‌రిహారం అంద‌లేదు. తుఫాన్ దాటికి నేలకొరిగిన చెట్ల‌ను సైతం  నేటికీ చాలా ప్రాంతాల్లో తొల‌గించ‌ని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి సంద‌ర్భంలో సంక్రాంతి వ‌చ్చింది. ప‌ల్లెల్లో స‌ర‌దాగా జ‌రుపుకోవాల్సిన ఈ పండ‌గ నిరాశ నిస్పృహ‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.
మ‌రో వైపు తిత్లీ దెబ్బ కార‌ణంగా వ్యాపారాలు సైతం మంద‌గించాయి. వ‌స్త్రాల కొనుగోళ్ళు, నిత్యావ‌స‌ర స‌రుకుల, కొత్త వ‌స్తువులు ఇలా క్ర‌య విక్ర‌యాలు 50 శాతం ప‌డిపోయాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ న‌ష్టం ఆరువేలు కోట్ల రూపాయ‌లుగా అంచ‌నాలున్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో జిల్లాలో మెజారిటీ ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌ట్ట‌ణాలు నుంచి ప‌ల్లెల‌కు బంధువులు, సొంతూర్ల‌కు స్థానికులు వ‌చ్చిన‌ప్ప‌టికీ తిత్లీ బాధితులు మాత్రం గ‌తంలో మాదిరి ఖ‌ర్చు పెట్టుకొని స‌ర‌దాగా సంక్రాంతిని చేసుకోలేని దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేసే శ్రీ‌కాకుళం జిల్లా వాసుల‌కు సంక్రాంతి ప‌ట్టింపులు ఎక్కువ‌. ఇలాంటి త‌రుణంలోనే తూతూ మంత్రంగా పండ‌గ‌ను కానిచ్చేస్తుండ‌డం జిల్లాలోని ద‌య‌నీయమైన ప‌రిస్థితుల‌ను తేటతెల్లం చేస్తున్నాయి.

Srikakulam
Pongal Festival
Cyclone Titli
Titli Effect
No Festival
 

మరిన్ని వార్తలు