నిర్భయ దోషులకు ఉరి రెడీ : తలారి లేడట!

Submitted on 3 December 2019
Nirbhaya Execution nears, but Tihar has no hangman

నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2012లో ఈ దారుణం జరిగింది. ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష పడలేదు. ఇంకా జైల్లో పెట్టి వారిని మేపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నిర్భయ కేసులో నిందితులకు ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష విధించగా.. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం సైతం నిందితులకు ఉరే సరైందని ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో దోషులు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి విన్నవించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది.

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతంతో నిర్బయ దోషుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తక్షణమే వారికి ఉరిశిక్ష అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరో నెల రోజుల్లో దోషులకు ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వారి క్షమాభిక్ష వినతిని రాష్ట్రపతి తిరస్కరించే అవకాశం ఉందని... ఆ తర్వాత కోర్టు వెంటనే బ్లాక్ వారెంట్ జారీ చేయనుందని తెలుస్తోంది. కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏ క్షణమైనా వారిని ఉరి తీస్తారు. బహుశా డిసెంబర్ లోనే ఉరి తీయొచ్చని సమాచారం.

ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఉన్న ఫళంగా ఉరిశిక్ష అమలు చేయాలంటే ఎలా అని జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారట. వారి టెన్షన్ కి కారణం దోషులను ఉరి తీసే వ్యక్తి లేకపోవడమే. అవును.. ఉరి శిక్ష వేస్తే వారిని ఉరి తీసే వ్యక్తి మాత్రం లేడట. దీంతో తీహార్ జైలు అధికారులు వర్రీ అవుతున్నారు. ఉరి తీసే వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

ఆఖరి సారిగా పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిని అఫ్జల్ గురును ఉరితీశారు. అయితే, ఆఫ్జల్ గురును ఉరితీసేటప్పుడు చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో తీహార్ జైలు అధికారులే లీవర్‌ను లాగినట్టు వార్తలొచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తీహార్ జైలు అధికారులు ఉరి లాగే వ్యక్తి కోసం అనధికారికంగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఉత్తరప్రదేశ్ లోని పలు గ్రామాల్లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.

దేశంలో ఉరిశిక్షలు అమలు చేయకపోవడంతో ఉరితీసేవారిని జైల్లో నియమించలేదని, ఇప్పుడు అవసరం రావడంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారట. అత్యంత అరుదైన కేసుల్లో తప్ప ఉరిశిక్ష విధించకపోవడంతో పూర్తిస్థాయిలో ఉరి తీయడానికి ఉద్యోగిని నియమించే అవసరం ఏర్పడ లేదని...ఈ విభాగంలో పూర్తిస్థాయి ఉద్యోగి ఎంపిక కూడా ఎంతో కష్టమైందని జైలు అధికారులు వివరించారు.

Nirbhaya
Execution
TIHAR
hangman
Jail
disha
Court

మరిన్ని వార్తలు