National News

విజయవాడ : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక సీఎం కుమారస్వామి ప్రతిపాదించారు. ఈ విషయంలో ప్రాథమిక స్థాయిలో ఉన్న చర్చలకు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా కాకుండా చూసే లక్ష్యంతో పనిచేయాలని విజయవాడలో జరిపిన భేటీలో చంద్రబాబు, కుమారస్వామి ప్రతిపాదించారు.

దుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి..
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్వాగతం పలికారు. విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో బసచేసిన కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిపిన భేటీలో రాజకీయపరమైన అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

కర్నాటక వరద నష్టానికి సహాయం చేయని కేంద్రం
వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, కుమారస్వామి భేటీకి రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చినట్టు సమాచారం. నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షచూపుతోందన్న అంశం ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నాటకలో వరద ప్రభావిత జిల్లాలకు సాయం అందిచేవిషయంలో కేంద్ర అనుసరిస్తున్న విపక్షపై చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు కూడా ఏపీ వరదల అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

ఏపీకి సాయం చేయడంలో మోదీ విఫలం -బాబు
కర్నాటక ప్రభుత్వ రైతు రుణమాఫీ పథకానికి కేంద్రం చేయూత ఇవ్వడం లేదని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేస్తే.... విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోవడంలో మోదీ విఫలమయ్యారన్న అంశాన్నిచంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏపీకి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉందని కాగ్‌ తేల్చినా... అరకొర సాయంతో సరిపెట్టారని ఏపీ సీఎం ప్రస్తావించినట్టు సమాచారం. వ్యవసాయ రుణమాఫీని కూడా లోటుగా చూపారంటూ కేంద్రం సహాయ నిరాకరణ పాటించడంతో ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. అమరావతి నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలతో సరిపెట్టడం, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇబ్బంది పెట్టడం, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ మంజూరు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు 600 కోట్ల రూపాయల అరకొర నిధులతో సరిపెట్టిన ప్రధాని మోదీ... మరోసారి అధికారంలోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆందోళన వ్యక్తం చేశారని చర్చ జరుగుతోంది. ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయే అంశంపై చంద్రబాబు, కుమారస్వామి చర్చించారు.

మరోసారి భేటీ అయ్యేందుకు ఇరువురు నిర్ణయం..
ప్రస్తుతం ప్రాథమిక దశంలో ఉన్న ఈ చర్చలకు భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, కుమారస్వామి నిర్ణయించారు. కర్నాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్‌, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా కుమారస్వామి, చంద్రబాబు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో ఉంటూనే కాంగ్రెస్‌ నేతలు ముప్పతిప్పలు పెడుతున్న అంశంపై కుమారస్వామి ఆవేదన వెలిబుచ్చారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో భేటీ తర్వాత కుమారస్వామి కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కుమారస్వామికి వేదపండితులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కర్నాటక సీఎం కుమారస్వామికి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరి వెళ్లారు. 

మధ్యప్రదేశ్‌ : ఎన్నికలు సమీపిస్తుండంతో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య డిజిటల్‌ వార్‌ మొదలైంది. తాజాగా ఎంపీ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బాహుబలిగా చూపుతూ బిజెపి కార్యకర్తలు రూపొందించిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మహా శివలింగాన్ని భుజానికి ఎత్తుతుంటే జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ కళ్లు అప్పగించి ఆశ్చర్యంతో చూస్తుంటారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కట్టప్పగా, భల్లాలదేవునిగా జ్యోతిరాదిత్య సింధియాను చూపారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అనే నేను మధ్యప్రదేశ్ ప్రజల గౌరవాన్ని, సంపదను కాపాడుతాను...అవసరమైతే నా ప్రాణాలు ఒడ్డుతాను.. నా మాటే శాసనం అంటూ ప్రతిజ్ఞ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై కాంగ్రెస్‌ మండిపడింది. అసలు బాహుబలి ఎవరో ఎన్నికల్లో తేలిపోతుందని పేర్కొంది. ఈ వీడియోకు తమకూ ఎలాంటి సంబంధం లేదని బిజెపి చెబుతోంది. 

ఢిల్లీ : 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ పరమ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆధారాలతోనే పౌర హక్కుల నేతలను అరెస్ట్‌ చేసినట్లు మీడియా సమావేశంలో ఎడిజి స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నారని, మావోయిస్టులు వేసిన ప్రణాళికలకు పౌర హక్కుల నేతలు సహకరించారని ఎడిజి వెల్లడించారు. ఈ కుట్రలో ఓ ఉగ్రవాద సంస్థకు కూడా ప్రమేయం ఉందని చెప్పారు. మానవ హక్కుల నేతలు మావోలతో సంభాషణలు జరిపిన కొన్ని లేఖలను ఏడీజి మీడియా ముందు ప్రదర్శించారు. గ్రనేడ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఉంది. భీమా-కోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పౌర హక్కుల నేతలు వరవరరావు, సుదా భరద్వాజ్, గౌతమ్ నవలక, అరుణ్ ఫెరిరా, వెర్నన్ గొంజాలెజ్‌లను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్లను గృహనిర్బంధంలో ఉంచారు.

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ టీమ్‌ ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితమైంది. గేమ్స్‌లో 13వ రోజైన శుక్రవారం జపాన్‌తో ఫైనల్లో తలపడిన భారత్ జట్టు 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు అవకాశాన్ని కూడా భారత్ చేజార్చుకుంది. ఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా గేమ్స్‌లో పసిడి పతకం గెలుపొందిన భారత మహిళల హాకీ టీమ్.. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత అంటే 20 ఏళ్ల తరువాత ఫైనల్‌కి చేరింది. అయితే.. తుది మెట్టుపై అనూహ్యంగా తడబడి స్వర్ణ పతకంతో పాటు ఒలింపిక్స్‌ బెర్తుని కూడా చేజార్చుకుంది. గురువారం భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. తాజా రజత పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 65కి చేరింది. ఇందులో 13 స్వర్ణాలు, 23 రజతాలతో పాటు 29 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అంచనాలు అందుకుంటూ.. జోరు కొనసాగిస్తున్న మహిళల టీమ్ ఈరోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి తుది పోరు‌కి అర్హత సాధించింది. ఆసియా గేమ్స్‌లో 1998 తర్వాత భారత మహిళల హాకీ టీమ్ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. జపాన్‌తో శుక్రవారం భారత్ జట్టు పసిడి పతకం కోసం ఫైనల్ ఆడనుంది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ జట్టు దూకుడైన ఆటతో చైనాతో ఆడుకుంది. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో మ్యాచ్ 52వ నిమిషం వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదవలేదు. అయితే.. ఈ దశలో గుర్జీత్ కళ్లు చెదిరే గోల్‌తో భారత్‌కి 1-0తో ఆధిక్యం అందించగా.. ఆ తర్వాత ఆధిక్యాన్ని సమం చేసేందుకు చివరి వరకూ చైనా ప్రయత్నించింది. కానీ.. ఫలితం లేకపోయింది. 1982 ఆసియా గేమ్స్‌లో పసిడి పతకం గెలుపొందిన భారత మహిళల హాకీ టీమ్.. ఆ తర్వాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో భారత్ మహిళల టీమ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో సామాన్యుడు ఎంతగా మెత్తుకున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గత కొంతకాలం నుండి వరుసగా పెరుగతునే వున్నాయి. ముంబైలో రై.85.78 పైసలుగా వుంటే హైదరాబాద్ లో రూ.83.02 పైసలుగా వుంది. రికార్డులో స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా అంతకంతకు దిగజారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణతో..

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం జఠిలమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి. మొన్నటివరకు జమిలి ఎన్నికలకు సై అన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు సడెన్‌గా యూటర్న్‌ తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించినట్లు తెలిపారు. 

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడిచమురు ధరల్లో పెరుగుదల వెరసి రూపాయి పతనం కొనసాగుతోంది. తాజాగా డాలరుకు రూపాయి మారకం విలువ రూ.71కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. ట్రేడింగ్ సెషన్ లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ తాజాగా మరో 26 పైసలు కోల్పోయి తొలిసారిగా రూ.71కు దిగజారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. చమురు సెగకు తోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భయం, దేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్న వేళ రూపాయి పతనం ఈ రోజు కూడా కొనసాగింది. కాగా ప్రస్తుతం రూపాయి విలువ అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు రూ.70.94 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డ్‌ స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై అత్యంత కనిష్ట స్థాయి 71 రూపాయలకి చేరింది. క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కేరళ : భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రస్ రిలీఫ్ ఫండ్‌కు 1,027 కోట్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. వరదల బారినపడిన కేరళకు 4.76 లక్షల మంది ఆన్‌లైన్‌లో విరాళాలిచ్చారు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా 145.17 కోట్లు, యూపీఐ ద్వారా 46 కోట్లు, డైరెక్ట్ డిపాజిట్లు, చెక్కుల రూపేణా 835.86 కోట్లు వచ్చాయి. వందేళ్ల కేరళ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 20 వేల కోట్లకు పైగా నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం కేరళకు 600 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళి ప్రజలను కలుసుకుని విరాళాలు అందజేయాలని కోరనున్నట్లు కేరళ సిఎం పినరయి విజయన్‌ తెలిపారు. ఈ విపత్తులో సుమారు 483 మంది ప్రాణాలు కోల్పోగా, 14.50 లక్షల మంది 3,000కు పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

జమ్ముకశ్మీర్‌ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 35 ఏ అధికరణపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 35ఏ అధికరణ రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తరపున ఏఎస్‌జి తుషార్‌ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భద్రతా సంస్థలు ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ జనవరి 19, 2019కు వాయిదా వేసింది. ఆర్టికల్‌ 35 ఏ అధికరణం రద్దు చేయొద్దని కోరుతూ వేర్పాటు వాదులు జమ్ముకశ్మీర్‌లో గురు, శుక్రవారాల్లో బంద్‌ పాటించారు. 1954లో రాష్ట్రపతి ఆదేశాలతో ఆర్టికల్‌ 35 ఏ చట్టబద్దమైంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. భూములు, ఉద్యోగాల్లో కేవలం కశ్మీరీలకు మాత్రమే హక్కు ఉంటుంది. 

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

కొచ్చి  : కేరళ వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ఈ భారీ వరదల్లో 370 మంది ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవగా... 3 వేల పైచిలుకు పునరావాస కేంద్రాలను ఏర్పాలు చేశారు. 54 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 3 లక్షల మంది రైతులు భారీగా నష్టపోయారు. 537 కొండచెరియలు విరగిపడినట్లు గుర్తించారు. 221 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనాలు తెలుపుతున్నాయి. 

అయితే ఈ మహాప్రళయానికి జాతి యావత్తు కదిలి వచ్చింది. వేలాది మంది స్వచ్చందంగా కదిలి కేరళ వరద బాధితులకు బాసటగా నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు వెయ్య కోట్లు దాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

సీఎమ్ డీఆర్ ఎఫ్ వెబ్ సైట్ లెక్కల ప్రకారం ఎలక్ట్రానిక్ విధానం ద్వారా రూ. 145 కోట్ల విరాళాలు రాగా.. రూ. 46 కోట్లు యూపీఐ, క్యూఆర్, వీపీఏ పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చింది. ఇక నగదు, చెక్కులు, ఆర్టీజీఎస్ ద్వారా రూ. 835 కోట్ల విరాళాలు వచ్చాయి. 

కాగా భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 483 మంది మరణించినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు.

విజయవాడ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కుమారస్వామికి ఘన స్వాగతం పలికారు. కుమారస్వామిని సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీతో తమది సోదర బంధం అన్నారు కుమారస్వామి. ఎన్డీఏ ఓటమే తమ ముందున్న ప్రధాన అజెండా అన్నారు. 

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక వైఫల్యమని విమర్శించారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇప్పటికీ రద్దు భారం ప్రజలు మోస్తున్నారని తెలిపారు. ఒక్క వ్యక్తిని హత్య చేస్తే యావజ్జీవ శిక్ష లేదా ఉరి వేస్తారని అలాంటిది 150 మంది చనిపోవడానికి కారణమైన ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్‌ చేశారు.

బీహార్ : ఐఆర్‌సిటిసి అవినీతి కేసులో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వియాదవ్‌కు ఊరట లభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కేసులో రబ్రీదేవి, తేజస్వీతో పాటు నిందితులందరికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రబ్రీదేవి, తేజస్వియాదవ్‌లకు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో అక్టోబర్ 6న హాజరు కావాలని లాలూ ప్రసాద్‌కు కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. లాలు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రయివేట్‌ హోటళ్లకు కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. దాణా స్కాం కేసుల్లో శిక్ష పడిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ పెరోల్‌ ముగియడంతో గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.

కేరళ : మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం భావాలను కించపరిచేలా పాట ఉందన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పాటలో ప్రియ కన్నుకొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 'ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పని లేదా?' అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విజయవాడ : కర్నాటక సీఎం కుమార స్వామి విజయవాడకు వచ్చారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి కుమార స్వామి కుటుంబసమేతంగా విజయవాడకు వచ్చారు. గేట్ వై హోటల్ బస చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆంజనేయులు కుమార స్వామిని కలిశారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కేంద్రంపై అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని, ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే విధంగా అన్ని ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకెళుతామన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కలవాల్సినవసరం ఉందన్నారు. 

కర్నూలు : నేటి నుండి మూడు రోజుల పాటు మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు మంత్రాలయానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ నేతలు పాల్గొననున్నారు. సమావేశం జరిగే ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సబూదేంద్ర తీర్థుల ఆశ్వీరాదం తీసుకున్నారు. 

ఢిల్లీ : భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్‌ మొదటి రోజు ఆటలో ఇండియా పైచేయి సాధించింది. తొలిరోజు 80.4 ఓవర్ల ఆట జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ను.. భారత బౌలర్లు 76.4 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ నాలుగు ఓవర్లలో వికెటేమీ నష్టపోకుండా 19 పరుగుల చేసింది. క్రీజులో ధావన్‌, రాహుల్‌ ఉన్నారు. టీమ్‌ ఇండియా బౌలర్లలో బుమ్రా, ఇషాంత్‌, షమి నిప్పులు చెరిగారు. ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు. పిచ్‌ నుంచి వచ్చిన సహకారంతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. బుమ్రా 3, ఇషాంత్‌ శర్మ 2, షమి 2, అశ్విన్‌ 2, పాండ్య ఒక వికెట్‌ పడగొట్టారు.

ఢిల్లీ : 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదిపై ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలోని 15-20 మంది క్రోని కాపిటలిస్టుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే మోది కావాలనే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీసి... అమెజాన్‌ లాంటి పెద్ద కార్పోరేట్‌ సంస్థలకు ఊతమిచ్చేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. మోదిని టీవీల్లో మార్కెటింగ్‌ చేసేందుకు కార్పోరేట్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని....ఆ డబ్బును ప్రజల నుంచి తీసుకుని వారి జేబుల్లో వేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. 

బీహార్ : 2019 లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. ఇందుకోసం బిజెపి ఓ ఫార్మూలాను తయారు చేసింది. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపి 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జెడియూ 12, ఎల్జేపి 5 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. జెడియుకు జార్ఖండ్‌లో 1, యూపీలో రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో బిజెపికి 22 మంది ఎంపీలు ఉండగా...జెడియుకు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపికి ప్రస్తుతం ఆరు స్థానాలుండగా...ఒక స్థానంపై కోత విధించే అవకాశం ఉంది. ఉపేంద్ర కుశ్వాకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్పీ ఎన్డీయేతో ఉంటే ఆ పార్టీకి 2 స్థానాలు కేటాయించనున్నారు. బిజెపి చీఫ్‌ అమిత్‌ షా, బిహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొనకూడదని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సలహా ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ విషమన్న విషయం అందరికీ తెలిసిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే- రాహుల్‌తో అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందుత్వ వాదాన్ని వ్యాపింపజేస్తోందని...అందులో మనం ఎందుకు భాగస్వాములం కావాలని ప్రశ్నించారు. వాళ్లు రాజ్యాంగం కన్నా మనుస్మృతినే నమ్ముతారని ఖర్గే అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీకు చెందిన ఏ నేత కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వచ్చే నెల జరిపే ఓ కార్యక్రమంలో రాహుల్‌గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : భీమా కొరెగావ్ విచారణ కేసుతో సంబంధం ఉందంటూ విరసం నేత వరవరరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌ అక్రమం అంటూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అరెస్ట్‌ను నిలిపివేయాలంటూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలీసులు వీరిని గృహా నిర్భందంలో ఉంచారు. గృహా నిర్భందంలో ఉన్నవారిని కలవటానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించటం లేదు. ఈ నేపథ్యంలో అడ్వకేట్‌ ప్యానల్‌ తరపున జలిల్‌ లింగయ్య యాదవ్‌, మరికొందరు అడ్వకేట్స్‌ వరవరరావును కలిశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

ఢిల్లీ : సోషల్ మీడియాలో చెడును ప్రచారం చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. వారణాసి స్వచ్చంద సేవకులతో, బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారం పోస్టు చేయవద్దని, ఏ రాజకీయ పార్టీకో...భావజాలానికి చెందిందో కాదని 125 కోట్ల భారతీయులకు చెందిన అంశమన్నారు. సోషల్ మీడియాలో చెడు భాషను వాడుతూ తప్పుడు అంశాలు పెడుతున్నారని, వాటిని ఇతరులకు పంపుతున్నారని...సమాజానికి ఎంత చెడు జరుగుతుందో నెటిజన్లు గుర్తించ లేకపోతున్నారని తెలిపారు. సానుకూల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాను ఉపయోగించాలన్నారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వచ్చ సేవా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

జోన్ల వివరాలు: కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి. బాసర జోన్ : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. రాజన్న జోన్ : కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్. భద్రాద్రి జోన్ : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ. చార్మినార్ జోన్ : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. జోగులాంబ జోన్ : మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్.
మల్టీ జోన్లు : కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ.

హైదరాబాద్ : నందమూరి తారకరావు తగ్గ తనయుడు హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ మృతి బాధిస్తోందని తెలిపారు. హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళర్పించేందుకు ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. నివాళుర్పించిన అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఆయన తెలుగులో ప్రసంగించారని, తెలుగులో ప్రసంగించవద్దని డిప్యూటి ఛైర్మన్ కోరినా ఆయన వినిపించుకోలేదన్నారు. తాను తర్జూమా చేస్తానని చెప్పడం జరిగిందని, మాటకు విలువనిచ్చే వ్యక్తి అని తెలిపారు. ఆయన మృతి తీరని లోటని వెంకయ్య తెలిపారు. 

ఢిల్లీ : నేటి నుంచి భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ రెండు టెస్టులను గెలుచుకోగా.. భారత్‌ ఒకమ్యాచ్‌లో నెగ్గింది. వరుసగా రెండు పరాజయాలు... అందులోనూ లార్డ్స్‌లో దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ స్థితిలో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. మరో ఓటమి ఖాయమని, సిరీస్‌పై ఆశలు నిలిచే అవకాశమే లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటిస్థితిలో కోహ్లీసేన అద్భుతం చేసింది. నాటింగ్‌హామ్‌ టెస్టులో గొప్పగా పుంజుకుంది. అన్ని రంగాల్లో రాణిస్తూ... ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఇంగ్లాండును చిత్తుగా ఓడించి.. అభిమానుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో మరో విజయం సాధించి.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న పట్టుదలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. భారత్‌ గత మ్యాచ్‌ జట్టునే సౌథాంప్టన్‌లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

 

జమ్ము కశ్మీర్‌ : లోని షోపియన్ జిల్లాలోని అర్హామా గ్రామం వద్ద ఉగ్రవాదులు పోలీసులపై మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు అమరులయ్యారు. ఓ పోలీసు వాహనానికి మరమ్మతులు చేయడానికి డీఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన ఎస్కార్ట్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం ఆయుధాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నలుగురు జవాన్లను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానిస్టేబుళ్లు ఇశ్వాక్‌ అహమద్‌ మీర్, జావేద్‌ అహమద్‌ భట్, మొహమ్మద్‌ ఇక్బాల్ మీర్, ఎస్‌పిఓ ఆదిల్‌ మంజూర్‌ భట్‌ మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

Pages

Don't Miss