National News

ఫ్రాన్స్: ప్యారిస్‌లో ఓ గన్‌మెన్‌ కలకలం రేపాడు. ప్రిమార్క్ అనే బట్టల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న పదిమందిని బందీలుగా చేశాడు. ఏం జరుగుతుందో తెలీక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గన్‌మెన్‌ చెరనుంచి...బాధితులను విడిపించేందుకు పోలీసులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఇద్దరు లేదా ముగ్గురు ఆగంతకులు షాపు లోపలకు ప్రవేశించి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రిమార్క్‌ దుకాణం చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు... బందీలుగా చేసుకున్న ఆగంతకులు... ఏ క్షణం ఎలా రియాక్టవుతారో అన్న ఆందోళన... సర్వత్రా వ్యక్తమవుతోంది. 

బీహార్ : త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌పై రాజకీయ పార్టీల ఫోకస్ మొదలైంది. యుద్దానికి సన్నద్దం అయ్యేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారీ అక్కడ కులరాజకీయాలే రాజ్యమేలేలా కనిపిస్తున్నాయి. వ్యూహాలు పన్నటంలో దిట్టగా పేరొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్‌లో అపుడే వ్యూహాల అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా వున్న వెనకబడిన తరగతుల ఓట్లు కొల్లగొట్టడానికి ఓబీసీ మంత్రం జపిస్తున్నారు. దేశంలోనే తొలి ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీ అని... బీజేపీ హయాంలోనే వెనకబడిన వర్గాలకు మేలు జరిగిందని ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రత్యర్థి వర్గం..
బీజేపీ ప్రచారాన్ని ప్రత్యర్థి వర్గమైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి తిప్పికొట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే మోడీ బీసీ కార్డును బీజేపీ తెరపైకి తెస్తోందని విమర్శించింది. గతంలో ప్రధానులుగా పనిచేసిన చౌదరి చరణ్‌సింగ్, దేవెగౌడ వెనకబడిన తరగతులకు చెందినవారేనని గుర్తు చేసింది. సమాజంలో మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం కమలనాథులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేసింది. సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్టును కేంద్రం ఎందుకు బహిర్గతం చేయలేకపోయిందని ప్రశ్నించింది.
మొత్తానికి రెండు వర్గాలూ కుల రాజకీయాలనే టార్గెట్ చేశాయి. మరి వారి పాచికలు పారుతాయా? ప్రజలు ఎవరికి జైకొడతారు? ఎవరిని అందలం ఎక్కిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే... ఇంకొంత కాలం వేచి వుండాల్సిందే.

తుర్కెమెనిస్థాన్ : మధ్య ఆసియా దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. తుర్కెమెనిస్థాన్ పర్యటన ముగించుకున్న మోడీ ఆదివారం ఉదయం కిర్గిజిస్థాన్ చేరుకున్నారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తర్వాత కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పర్యాటకం, మానవ వనరులు సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని, ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత ఇరు దేశాలకు చెందిన ఉత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించింది. కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రులను మోడీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఆస్పత్రులకు వైద్య పరికరాలు అందజేశారు.

ఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణ వేగవంతం చేయాలని భారత్‌, పాక్‌ ప్రధానుల నిర్ణయించి రెండు రోజులైనా గడవలేదు. అప్పుడే విచారణకు బ్రేకులు వేసే పని అడ్డదారిలో మొదలైంది. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు జకీర్ రెహ్మాన్‌ లఖ్వీ తన వాయిస్ శాంపిల్స్ భారత్‌కు ఇవ్వడని... అతని తరపు న్యాయవాది ప్రకటించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరని స్పష్టం చేశారు. గతంలోనే వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు లఖ్వీ తిరస్కరించాడని... ఇప్పుడు మరోసారి వ్యతిరేకించినట్లు వెల్లడించారు.

 

ఛత్తీస్‌గఢ్‌: విద్యా బుద్ధులు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది గురువులు. పైగా వారి నడక, నడత అన్నీ విద్యార్థులను ఇన్‌స్పైర్‌ చేసే అంశాలే. ఇంతగొప్ప గురుతర బాధ్యతల్లో వున్న ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి తరగతి గదిలో ప్రవేశించాడు. అంతటితో ఆగక పిల్లలకు పాఠాలు బోధించాడు. అవి ఏ.. పాఠాలు అనుకుంటున్నారు... మందు పాఠాలే. డి ఫర్ డాగ్‌, డాల్‌.... పి ఫర్‌ పీకాక్, ప్యారెట్‌ అని అందరూ చెబితే... కానీ ఆ టీచర్ మాత్రం డి ఫర్ దారు... పి ఫర్ పీయో అంటూ తాగుబోతు అర్థాలు బోధించారు. దారు అంటే ఆల్కహాల్, పీయో అంటే డ్రింక్‌ అని అర్థం. ఇదంతా ఛత్తీష్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఢిల్లీ: ఇస్రో వెబ్ సైట్ హ్యాక్ గురైంది. వాణిజ్య విభాగానికి యాంత్రిక్ సైట్ హ్యాక్ అయింది. ఇస్రో.. 2 రోజుల క్రితమే 5 కమర్షియల్ రాకెట్స్ ప్రయోగించింది. ఇస్రో వెబ్ సైట్ ను చైనా ప్రభుత్వం హ్యాక్ చేసినట్లు ఇస్రో అధికారులు అనుమానిస్తున్నారు. హ్యాక్ గురైన వెబ్ సైట్ ను తిరిగి తమ అధీనంలోకి తీసుకరావడానికి ఇస్రో అధికారులు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. 

భోపాల్ : వ్యాపం స్కాం విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించాక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కుంభకోణంపై దర్యాప్తును కావాలనే ఆలస్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధాన సభ రికార్డులే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వ్యాపం స్కాంపై 2009లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాచారం సేకరిస్తున్నట్లు సర్కార్ సమాధానం చెప్పింది. అప్పటికే స్కాంలో సీఎం భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెడికల్ అడ్మిషన్ వ్యవహారంప నిజనిజాలు తేల్చేందుకు ఓ కమిటీ వేశారు. మరొకసారి 2007, 2010 సంవత్సరాల మధ్య డెంటల్, మెడికల్ కాలేజీలో జరిగిన అడ్మిషన్ల తీరుపై ప్రశ్నించారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించలేదని సీఎం చౌహాన్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు విధాన సభలో మరోసారి 2011 నవంబర్ 29వ తేదీన ఈ ప్రశ్ననే మరోసారి అడిగారు. అప్పుడు మాత్రం సీఎం చౌహాన్ సమాధానాన్ని మార్చారు. 114 మంది విద్యార్థుల అడ్మిషన్ లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈవ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ప్రభుత్వం ఈ స్కాంపై ఉద్ధేశ్యపూర్వకంగానే వ్యవహరించినట్లు అర్థమౌతోందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు వద్ద మళ్లీ అలజడి చెలరేగింది. భారత్ లోకి ప్రవేశించేందుకు చొరబాటు దారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంఇ. జమ్మూ కాశ్మీర్ లో తీరాన్ సెక్టార్ వాస్తవాధీన రేఖ గుండా ముగ్గురు తీవ్రవాదులు ప్రయత్నించారు. దీనిని గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు చొరబాటు దారులు అక్కడికక్కడనే మృతి చెందారు. వీరి వద్ద నుండి మూడు ఏకే 47 రైఫిళ్లు, గ్రానైడ్లు, 300 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

తుర్కెమెనిస్తాన్ : టెర్రరిజం, వాతావరణంలో మార్పులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కానికి గాంధీ జీవితం, బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రధాని అన్నారు. తుర్కెమెనిస్తాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన అష్‌గాబిట్‌లో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. తుర్కెమెనిస్తాన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోది ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. తుర్కెమెనిస్తాన్‌తో భారత్‌ ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోడీ తుర్కెమెనిస్తాన్‌లో పర్యటిస్తున్నారు.

 

ఇంగ్లండ్: అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆరోసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ నెగ్గి తనకు తానే సాటిగా నిలిచింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ లో ముగిసిన ఫైనల్స్ లో టాప్ సీడ్ సెరెనా వరుస సెట్లలో 20వ సీడ్ గార్బిన్ మురుగుజాను చిత్తు చేసింది. 33 ఏళ్ల సెరెనా అపారఅనుభవం ముందు..19 ఏళ్ల మురుగుజా తేలిపోయింది. తొలిసెట్లో గట్టిపోటీ ఎదుర్కొన్న సెరెనా 6-4తో నెగ్గి శుభారంభం చేసింది. రెండో సెట్లో దూకుడు పెంచిన సెరెనా 6-3తో సునాయాసంగా నెగ్గి..ట్రోఫీతో పాటు 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకొంది. సెరెనా కెరియర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టైటిల్స్ సాధించిన సెరెనా..వచ్చేనెలలో జరిగే అమెరికన్ ఓపెన్ సైతం నెగ్గితే..రెండోసారి కెరియర్ స్లామ్ పూర్తి చేయగలుగుతుంది.

 

కైరో: హాలీవుడ్‌లో తొలితరం మేటి నటుడు ఒమర్ షరీఫ్‌ ఇకలేరు. చివరి రోజుల్లో గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడ్డ ఆయన.. మంగళవారం ఈజిప్టు రాజధాని కైరోలోని ఆస్పత్రిలో తీవ్రమైన గుండెపోటుతో మరణించారు.
1932లో ఒమర్ షరీఫ్‌ జననం..
ఈజిప్టులో తుక్కు వ్యాపారం చేసే వారి ఇంట 1932లో ఒమర్ షరీఫ్‌ జన్మించారు. కళల పట్ల కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు లండన్‌కు పంపించారు. షరీఫ్ అక్కడి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమిటిక్ ఆర్ట్ సంస్థలో శిక్షణ పొందారు. హాలీవుడ్‌లో అడుగు పెట్టిన షరీఫ్‌కు తొలి అవకాశం మాత్రం ఈజిప్టు చిత్ర పరిశ్రమే ఇచ్చింది.
సిర్రా ఫిల్-వాడి చిత్రంతో ఒమర్ తెరంగేట్రం
సిర్రా ఫిల్-వాడి చిత్రంతో 1954లో తెరంగేట్రం చేసిన ఒమర్ షరీఫ్.. అనతికాలంలోనే ఈజిప్టు నటనవర్గంలో అగ్రతారగా ఎదిగారు. ఆ తర్వాత డేవిడ్ లీన్‌ దర్శకత్వంలో 1962లో షరీఫ్.. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటించారు. నిప్పులు చెరుగుతున్న ఎడారుల్లో ఒంటెపై దౌడు తీస్తుండగా షరీఫ్‌పై తొలి షాట్స్ తీశారు. తన నట విశ్వరూపంతో ఈ చిత్రానికి రెండు గోల్డెన్ గ్లోబ్‌లను సొంతం చేసుకున్నారు. ఇదే సమయంలో ఒమర్ షరీఫ్‌ పేరు ఆస్కార్‌ అవార్డు గడప దాకా వెళ్లింది.
వీరులకు మరోసారి జీవం పోసిన ఒమర్
ఎడారుల్లోంచి వెండితెరపైకి వెళ్లిన ఒమర్ షరీఫ్‌.. మరో మూడేళ్ల తర్వాత డాక్టర్ జివాగోతో మరోసారి సంచలనం సృష్టించారు. రష్యన్ విప్లవంలో చిక్కుకుపోయిన వైద్యుని పాత్రలో ఒమర్ జీవించి ముచ్చటగా మూడోసారి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్నారు. ఇక చంఘిజ్‌ ఖాన్, చేగువెరా చిత్రాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేవని సినీ ప్రేమికులు అంటారు. ఈ రెండు సినిమాలలో ఒమర్ షరీఫ్ నటించి.. చరిత్రలో జీవించిన వీరులకు మరోసారి జీవం పోశారు. అయితే అగ్రనటుడిగా ఉండగానే.. నటన పట్ల విముఖత పెంచుకున్న ఆయన.. చివరిగా 2003లో ఫ్రెంచి సినిమా మొన్సేర్ ఇబ్రహీంలో నటించారు.

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. గత రెండురోజులుగా ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, నైనిటాల్ తదితర ప్రాంతాలో కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. హరిద్వార్‌లో గంగానది డేంజర్‌ మార్క్‌ దాటి ప్రవహిస్తోంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. గత రాత్రి నుంచి ఢిల్లీలో వర్షాలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలో 90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 

మధ్యప్రదేశ్: వ్యాపం స్కాంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. భోపాల్‌లో కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అవినీతిపై మాట్లాడే ప్రధాని నరేంద్రమోది శివరాజ్‌సింగ్‌ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

 

యుపి: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌ హజ్రత్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ములాయంసింగ్‌ ఫోన్‌లో హెచ్చరికలు చేశారని అమితాబ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ములాయంతో రెండు నిముషాలపాటు మాట్లాడిన ఆడియో రికార్డును అమితాబ్‌ ఠాకూర్‌ భార్య నూతన్‌ ఠాకూర్‌ విడుదల చేశారు. తాను ఫిర్యాదు చేసినా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, తనకు ములాయం నుంచి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని ఐపిఎస్‌ అధికారి మీడియా ముందు పేర్కొన్నారు.  

చెన్నై : ఆత్యాచార బాధితురాలు మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి ప్రయత్నించాలంటూ వివాదస్పదమైన ఆదేశం ఇచ్చిన మద్రాసు హైకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.దోషికి మంజూరు చేసిన బెయిల్ ను కూడా రద్దు చేసింది. రేప్ కేసులో బాధితురాలు ముద్దాయి మధ్య రాజీ ప్రయత్నం పెద్ద తప్పిదమని...ఇలాంటి రాజీ సూచనలు మహిళల ఆత్మగౌరవానికి భంగకరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడంతో మద్రాసు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాసు హైకోర్టు జడ్జి మహిళా సంఘాలు, మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరకు అలాంటి దుర్మార్గుడిని వివాహం చేసుకోవడం ఏంటనీ బాధితురాలు ప్రశ్నించింది. 

రష్యా : భారత- పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయా? ఇరుదేశాల ప్రధానులు రష్యాలో జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. సరిహద్దు వివాదం, ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పాకిస్తాన్‌లో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని నవాజ్‌షరీఫ్‌ ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ రష్యాలోని ఉఫా నగరంలో సమావేశమయ్యారు. గంటకు పైగా సాగిన సమావేశంలో సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, తదితర అంశాలపై వీరివురు చర్చించారు. సరిహద్దులో ఉద్రిక్తతలను సడలించడానికి భారత, పాక్‌లకు చెందిన ఉన్నతస్థాయి ఆర్మీ అధికారుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించి విచారణను వేగవంతం చేయడానికి ఇరుదేశాల ప్రధానులు అంగీకరించారు. కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకుండానే టెర్రరిజంపై ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
మత్స్యకారుల విడుదలకు అంగీకారం..
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి లఖ్వీని పాక్‌ విడుదల చేసిన విషయాన్ని మోడీ షరీఫ్‌తో ప్రస్తావించారు. భారత్‌ సరైన ఆధారాలు చూపకపోవడం వల్లే లఖ్వీని విడుదల చేసినట్టు షరీఫ్‌ పేర్కొన్నారు. ఇరుదేశాల్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను 15 రోజుల్లోగా విడుదల చేయాలని భారత్‌- పాక్‌లు నిర్ణయించాయి.
2016లో పాకిస్తాన్‌లో పర్యటించనున్న మోడీ..
పాకిస్తాన్‌లో జరిగే సార్క్‌ సదస్సుకు హాజరుకావాలని నవాజ్‌ షరీఫ్ ప్రధాని మోడీని ఆహ్వానించారు. షరీఫ్‌ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోడీ 2016లో పాకిస్తాన్‌లో పర్యటించడానికి అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన డిన్నర్‌లో భారత పాక్‌ ల ప్రధానులు హాజకు కావడం ద్వారా వీరి మధ్య చర్చలకు మార్గం సుగమమైంది. గత ఏడాది ఖాట్మండులో జరిగిన సార్క్‌ సమావేశంలో మోడీ, నవాజ్ షరీఫ్‌ కలుసుకున్నారు. కానీ అధికారికంగా సమావేశం కాలేదు... ద్వైపాక్షిక చర్చలు జరపలేదు.
ఓ వైపు చర్చలు, మరోవైపు కవ్వింపు చర్యలు...ఇది పాకిస్తాన్‌ నైజం. ఇరు దేశాల నేతలు చర్చలు జరపడానికి ఒకరోజు ముందు కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌- ఓ బిఎస్‌ఎఫ్‌ జవాను కాల్చి చంపింది. రష్యా వేదికగా జరిగిన చర్చలపై పాకిస్తాన్‌ నిజాయితీగా కట్టుబడి ఉంటుందా? లేదా అన్నది కాలమే చెబుతుంది.

నెల్లూరు : ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. ఇప్పటి వరకూ సొంత ప్రయోగాలతోనే సత్తాచాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తాజాగా విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన ఘనత సాధించింది. తన ప్రస్థానంలోనే భారీ వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. మరో భారీ వాణిజ్య ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో దాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-28 రాకెట్‌.. దిగ్విజయంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో బుధవారం ఉదయం 7 గంటలా 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌ డౌన్‌.. శుక్రవారం రాత్రి 9 గంటలా 58 నిమిషాలకు ముగిసింది. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్‌ఎల్వీ రాకెట్‌.
5 ఉపగ్రహాలు..
పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 30వ ప్రయోగం చేపట్టిన ఇస్రో బ్రిటన్‌కు చెందిన 5 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన డీఎంసీ-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌ సెయిల్‌ ఉపగ్రహాల మొత్తం బరువు 1440 కిలోలు. డీఎంసీ-3లో ఉన్న ఒక్కొక్క ఉపగ్రహం బరువు 447 కిలోలు. ఇక, సీబీఎన్‌టీ-1 బరువు 91 కిలోలు కాగా.. డి-ఆర్బిట్‌ సెయిల్‌ ఉపగ్రహం బరువు 7 కిలోలు. వీటిని నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌.. భూమికి 647 కిలోమీటర్ల ఎత్తులో ధృవ కక్ష్యలో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
ఆనందంలో శాస్త్రవేత్తలు..
ఇదిలా ఉంటే.. ఇంత బరువు కలిగిన వాణిజ్య ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి. ఇదో వినూత్న ప్రయత్నమని, ఈ ప్రయోగం ద్వారా.. భారత్‌కు 180 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. భవిష్యత్‌ ప్రయోగాలకు ఈ విజయం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు.

ఢిల్లీ: జపాన్ పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని ఎసి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతామని జపాన్ పారిశ్రామకవేత్తలు అన్నారని ఆయన చెప్పారు. పలు రాంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు అంగీకారించారని వెల్లడించారు. తిరుపతిని సేఫ్ సిటీగా చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. రాజధాని పౌండేషన్ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతోపాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించనున్నట్లు వివరించారు.

 

జింబాబ్వే: భారత్-జింబాబ్వే తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 255 పరుగుల చేసింది. అంబటి రాయుడు సెంచరీతో చెలరేగాడు. 10 బౌండరీలు, ఒక సిక్సర్ తో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్ లో రాయుడుకు ఇది రెండో సెంచరీ. స్టూవర్ట్ బిన్నీతో కలిసి... ఆరో వికెట్ కు రాయుడు సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ లో బిన్నీ తొలి హాఫ్ సెంచరీ చేశారు. భారత్ బ్యాటింగ్: రాయుడు (124) నాటౌట్, బిన్నీ (77), కేదార్ జాదవ్ (5), అక్షర్ పటేల్ (2), ఊతప్ప(0).

 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి నిర్మాణానికి జాతీయ ప్రాధాన్యత ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అటవీ భూములు డీనోటిఫై చేయడానికి కేంద్రం అంగకరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమమయ్యారు. రాజధాని నిర్మాణానికి అటవీ భూములు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలోనూ అటవీ భూములివ్వాలని ఉందన్న చంద్రబాబు...ఇదే విషయాన్ని ప్రకాశ్‌ జవదేకర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో ఆ.. భూములను డీనోటిఫై చేయడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారని చంద్రాబాబు వెల్లడించారు.

 

మాస్కో: రష్యాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇరువురు నేతల మధ్య ఉగ్రవాదం, కాశ్మీర్‌ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరుదేశాలకు చెందిన మత్స్యకారులను విడుదల చేసేందుకు ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. ఉగ్రవాది లఖ్వి విడుదలను నిరసిస్తూ ప్రధాని మోదీ పాక్‌ ముందు ప్రస్తావించారు. పాకిస్తాన్‌లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు కావాలని నవాజ్‌షరీఫ్‌ మోడీని ఆహ్వానించారు. వచ్చే ఏడాది ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. 

హైదరాబాద్:రష్యాలోని యుఫాలో ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీయ్యారు.. రెండు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు... వివిధ అంశాలపై చర్చించారు.. దాదాపు 50 నిమిషాలపాటు చర్చలు కొనసాగాయి.. దాదాపు ఏడాదితర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు.. శిఖరాగ్ర సమావేశాలకోసం ఇద్దరు ప్రధానులు రష్యావచ్చారు..

హైదరాబాద్:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి రాత్రి పీఎస్ ఎల్వీ సి -28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ 5 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. బుధవారం ఉదయం 7గంటల 28నిమిషాలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 62 గంటల 30 నిమిషాలు నిరంతరాయంగా కొనసాగి, నింగిలోకి దూసుకెళ్లనుంది.
నెల 10 రాత్రి 9 గంటల 28 నిమిషాలకు....
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో మరో అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నెల 10న రాత్రి 09గంటల 28నిముషాలకు పీఎస్ ఎల్వీ సి-28 నింగిలోకి పయనమవుతుంది.
భారీ ఆదాయాన్ని సమకూర్చనున్న పీఎస్ ఎల్వీ సి-28....
ఇప్పటి వరకు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షానికి మోసుకెళ్లిన పీఎస్ ఎల్వీ ప్రస్తుతం జరగబోయే ప్రయోగంతో ఇస్రోకు భారీ ఆదాయాన్ని సమకూర్చనుంది. ఈ ప్రయోగం లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ లాంచింగ్ ద్వారా ఇస్రోకు దాదాపు 14వేల 44 కోట్ల ఆదాయన్ని సమకూర్చే ఈ భారీ వాణిజ్య ప్రయోగానికి గత రెండు నెలలుగా ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.
బుధవారం 7 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్.....
బుధవారం ఉదయం 7గంటల 28 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైన 62 గంటల 30 నిమిషాల తర్వాత అంటే రాకెట్ ఈ నెల 10న రాత్రి 09 గంటల 58 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన అరగంటకు అంటే 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల 55 నిమిషాల వరకు రాకెట్‌కు నాలుగోదశ ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. నేడు రాకెట్‌కు అనుసంధానమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తారు. అనంతరం 10వ తేదీ తెల్లవారుజామున 4గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11గంటల 20 నిమిషాల దాకా రాకెట్‌లోని లోని రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఆ ప్రక్రియతో ఇంధనం నింపే పని పూర్తవుతుంది. ఆ తర్వాత తుది విడత తనిఖీలు నిర్వహించి రాకెట్‌లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థను అప్రమత్తం చేయడం, నైట్రోజిన్, హీలియమ్ గ్యాస్ నింపడం లాంటి పనులు చేసి ప్రయోగానికి సన్నద్ధం చేస్తారు. అనంతరం రాత్రి 9 గంటల 58నిమిషాలకు పీఎస్ ఎల్వీ సి-28ను నింగిలోకి పంపుతారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ పీఎస్ ఎల్వీ సి-28 రాకెట్ ఎత్తు 49 మీటర్లు. బరువు 395 టన్నులు.
కెనడాకు చెందిన 14 వేల40 కిలోల ఐదు ఉపగ్రహాలు...
భారీ వాణిజ్య ప్రయోగంగా ఉన్న పీఎస్ ఎల్వీ సి-28 ఉపగ్రహ వాహక నౌకలో కెనడాకు చెందిన 14వేల 40 కిలోల బరువున్న ఐదు ఉపగ్రహాలను భూమికి 647 కిలో మీటర్ల ఎత్తులో సూర్యానవర్తన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. డిఎమ్‌సీ-3 అనే మూడు శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఒక్కో శాటిలైట్ బరువు 447 కిలోల వరకు ఉంటుంది. వీటితో పాటు 97 కిలోల బరువున్న సిబిటిఎన్ -1 అనే ఉపగ్రహాన్ని, 7 కిలోల బరువున్న డి-ఆర్బిట్ శైల్ అను ఎక్స్ పెరిమెంటల్ శాటిలైట్‌ను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్ వి సిరీస్ లో 30వ ప్రయోగంగా పిఎస్ ఎల్ విసి-28 రాకెట్ ను ప్రయోగించనున్నారు. మొదటి ప్రయోగం మినహా ఈ సిరీస్ లో మిగిలిన అన్ని ప్రయోగాలు విజయవంతం కావడంతో పిఎస్ ఎల్ వి రాకెట్ ఇస్రోకు తిరుగులేని విజయాలను అందించిన బ్రహ్మాస్త్రంగా పేరు తెచ్చింది.
భవిష్యత్తులో భారత్ మరిన్ని దేశాల ఉపగ్రహాలను...
ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్తులో భారత్ మరిన్ని దేశాల ఉపగ్రహాలను ఇక్కడ నుంచి పంపించేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది. తద్వారా ఇస్రోకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం ప్రయోగించే కెనెడా ఉపగ్రహాల ద్వారా ఆ దేశ సమాచార, సాంకేతిక వ్యవస్థకు ఎనలేని ప్రయోజనం సమకూరనుంది. ఇప్పటి వరకు ఇస్రో ఇలాంటివి 40కి పైగా వాణిజ్య ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. దీంతో ఈ సంఖ్య 45కు చేరనుంది.

ఢిల్లీ : ఆమాద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఎమ్మెల్యే కొండ్లి మనోజ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు అయ్యారు. భూ ఆక్రమణకు సంబంధించి రెండు నెలల క్రితం ఇతనిపై కేసు నమోదైంది. ఎలాంటి సమన్లు అందచయకుండా అరెస్టు చేశారని మనోజ్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మనోజ్ కుమార్ తన వ్యార భాగస్వామిని రూ.6 లక్షల మేర మోసం చేశారని ఆయనపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

రష్యా : భారత ప్రధాన మంత్రి రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తో మోడీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన వీరు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. మోడీ బంగ్లాదేశ్ పర్యటన అనంతరం మయన్మార్ లో సైనిక చర్య చేపట్టింది. ఈ సమయంలో ఆక్రమిత కాశ్మీర్ లో ఇదే తరహా చర్యలు చేపట్టాలని దేశంలో వినిపించింది. అయితే మయన్మార్ చర్యను పాక్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక పాక్ పార్మమెంట్ లో దీనిపై వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు ప్రధానుల మధ్య జరిగే భేటీలో టెర్రరిజంపైనే చర్చ ఉంటుందని తెలుస్తోంది. 

ఢిల్లీ: వ్యాపం స్కాం కేసు విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిపించాలని కోరింది. ఐతే ఈ కేసులో గవర్నర్ రామ్‌నరేష్‌ యాదవ్‌ను... బీజేపీ ఎందుకు ప్రొటెక్ట్‌ చేస్తుందో వెల్లడించాలని... ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఆశిష్‌ కేతన్‌ డిమాండ్ చేశారు.

 

Pages

Don't Miss