National News

మహారాష్ట్ర : సాధారణంగా అత్యంత రద్దీగా ఉండే పుణెను పరిశుభ్రంగా ఉంచడానికి పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) సరికొత్త పద్ధతి తీసుకొచ్చింది. స్వచ్ఛ పుణెగా మార్చేక్రమంలో ఇప్పటికే కొన్ని నిబంధనలు విధించింది. రోడ్లపై ఉమ్మేసేవారికి ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి 1,000 వరకు జరిమానా విధిస్తోంది.

అయితే జరిమానా విధించినప్పటికీ ప్రజల నుంచి సరైన స్పందన రాకపోగా, రోడ్లమీద ఉమ్మేస్తూ రోడ్లను అపరిశుభ్రంగా చేస్తున్నారు. దీంతో పీఎంసీ మరో కఠిన నిబంధనతో ముందకు వచ్చింది. రోడ్లపై ఎవరైతే ఉమ్మేస్తారో వారితోనే శుభ్రం చేయిస్తోంది. అంతేకాకుండా 150 రూపాయల జరిమానా కూడా విధిస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 156 మంది రోడ్లపై ఉమ్మేస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.  
గతవారమే ఈ పద్ధతి అమల్లోకి వచ్చిందని..ఇప్పటికి దీన్ని అత్యంత రద్దీగా ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నామని వేస్ట్ మేనేజ్‌మెంట్ అధికారి ధ్యానేశ్వర్ మోలక్ తెలిపారు. ఈ నిబంధనలు బిబ్వేవాడి, ఆంధ్, ఎర్వాడ, కస్బా, ఘోల్ రోడ్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉన్నాయని తెలిపారు.

 

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో నేడు తొలి దశ పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు. 
దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డుపై ఇవాళా ఉదయం 5.30గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చి వేశారు. పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు.

 
కాగా, నిన్న కూడా మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల దృష్ట్యా గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కాంకేర్‌ జిల్లాలో ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఓ ఎస్సై ప్రాణాలు కోల్పోయారు.

 

ఢిల్లీ : రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ముందస్తు విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి కొట్టివేసింది. అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జనవరి మాసంలో ధర్మాసనం ముందు కేసుకు సంబంధించిన పలు పిటిషన్‌లు రానున్నాయని..ముందస్తు విచారణ చేపట్టలేమని వ్యాఖ్యానించింది. వచ్చే జనవరి మొదటి వారంలో ధర్మాసనం పరిశీలిస్తుందని..విచారణ తేదీలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని కక్షిదారులైన సున్నీ వక్ప్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా పక్షాలు సమానంతో తలో భాగం పంచుకోవాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు పోటీగా ఛాయ్ వాలా ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాజ్‌నందగావ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీపక్ యాదవ్.. టీ అమ్ముకుని జీవిస్తుంటారు. గతంలో కూలీగా కూడా పని చేసి రోజుకి రూ.175 సంపాదించేవారు. ఆయన ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌కు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజ్‌నందగావ్‌ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇటీవలే దీపక్ యాదవ్... మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగికి చెందిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు. చిరు వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగించే ఆయన.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదిగారు. అయినప్పటికీ, మరోవైపు ఛాయ్‌వాలాగా తన వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

గతంలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన దీపక్‌ యాదవ్, మున్సిపల్ కార్పొరేటర్‌ అయ్యారు. ఆ రాష్ట్ర సీఎం రమణ్‌ సింగ్‌ కూడా మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. ఈ నియోజక వర్గం నుంచి తమ అభ్యర్థిగా దీపక్‌ పోటీ చేస్తారని అజిత్‌ జోగి ప్రకటన చేసి ఇటీవల అందరినీ ఆశ్చర్యపర్చారు. తన తండ్రితో కలిసి తాను ఇప్పటికీ టీ అమ్ముతుంటానని ఆయన తాజాగా మీడియాకు తెలిపారు. నవంబరు 12న జరుగుతున్న ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నాకు తొలిసారిగా 2005లో కలిగింది. 2000వ సంవత్సరంలో నేను కాంగ్రెస్‌ పార్టీలో పని చేశాను. ఆ తరువాత ఆ పార్టీలో నాయకుడిగా ఎదిగాను. అయినప్పటికీ మాది పేద కుటుంబం కావడంతో నాన్నతో పాటు టీ అమ్ముతూనే, కూలీగా పనిచేశాను’ అని తెలిపారు. 

తాను జేసీసీ పార్టీలో 2016లో చేరానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఊహించలేదని అన్నారు. నామినేషన్ల దాఖలు చివరి గడువుకి ఒక్క రోజు ముందు (అక్టోబరు 25న) సాయంత్రం తమ పార్టీ అధినేత అజిత్‌ జోగి కార్యాలయం నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఊహించలేదని, తనకు పిలుపురావడంతో వెంటనే కార్యాలయానికి వెళ్లానని అన్నారు. అనంతరం కొన్ని చర్చలు జరిగాక, తననే ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారని తెలిపారు. వార్డు కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి (రమణ్‌ సింగ్‌) ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఎందుకు కాలేను’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

రాయ్‌పూర్‌: 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఈఉదయం ప్రారంభమయ్యింది. తొలిదశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 18 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈప్రాంతాల్లో ఉదయం పది గంటల సమయానికి 14శాతం  గానూ, 11 గంటలకు 16.24  పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు  తెలిపారు.
గత ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడని భేజ్జి, గోర్ఖా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లోకూడా ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు  లక్ష మందితో  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాంకేర్‌, బీజాపూర్‌ జిల్లాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచి పోయింది.  బందా అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రం సమీపంలో మూడు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు  గుర్తించాయి.  సీఆర్‌పీఎఫ్‌ బాంబు స్క్వాడ్ వచ్చి  వాటిని నిర్వీర్యం చేస్తుండడంతో ‌ పోలింగ్‌ కేంద్రాన్ని తాత్కాలికంగా ఓ చెట్టు కిందకు మార్చి  అక్కడ పోలింగ్‌ కొనసాగిస్తున్నారు. చత్తీస్ ఘడ్ లో 2వ విడతపోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది.  డిసెంబర్ 11 న ఓట్ల లెక్కింపు జరుపుతారు. 

తమిళనాడు : మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన ఆ యువతి తమ్ముడిపై కూడా దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తిరునెల్వేలి కళ్లకాడుకి చెందిన ప్రియ (20) కళాశాల చదువు పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం తిరునెల్వేలిలో శిక్షణ పొందుతోంది. ఆమె తండ్రి మృతి చెందడంతో తల్లి మాలతి, తమ్ముడుతో కలిసి ఉంటోంది. అదే ప్రాంతానికి  చెందిన ఇసక్కిముత్తు (21) కూలీ పని చేస్తున్నాడు.

ప్రేమిస్తున్నానంటూ ఇసక్కిముత్తు.. ప్రియను వేధించేవాడు. ఈ విషయంలోనే జనవరిలో ప్రియపై దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అనంతరం చెన్నైలో పని చేశాడు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల్లో తిరునెల్వేలికి వచ్చాడు. తనను ప్రేమించమని ప్రియను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. శనివారం తెల్లవారుజామున ప్రియ తల్లి మాలతి పాల కోసం బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఇసక్కిముత్తు.. ఇంట్లోకి చొరబడి కత్తితో నిద్రపోతున్న ప్రియపై దాడి చేశాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో కాపాడేందుకు తమ్ముడు ప్రయత్నించాడు. అతడిపైనా కూడా అతను దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇసక్కిముత్తు కోసం గాలిస్తున్నారు.

 

ఉత్తర్ ప్రదేశ్ : అయోధ్యలో మద్యం..మాంసం విక్రయించవద్దనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీలోని ఫజియాబాద్ జిల్లా పేరు ఇక నుంచి అయోధ్యగా పిలుస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య అనేది ప్రముఖ పుణ్యక్షేత్రమని...ఇక్కడ మందు..మాంసం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అచార్య సత్యేంద్ర దాస్ జాతీయ ఛానెల్‌కు తెలిపారు. దీనిపై నిషేధం విధించడం వల్ల ప్రజల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. 
నిషేధం విధిస్తే అక్కడ వ్యాపారులపై ప్రభావం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. తాము మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటామని, నిషేధం విధిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని మాంస విక్రయేతలు పేర్కొంటున్నారు. మరి మద్యం..మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

మధురై: ఒక వ్యాపారవేత్తకు చెందిన బీఎమ్‌డబ్ల్యూ కారులో పాము దూరింది. ఈ నాగుపామును బయటకు తీయడానికి మొత్తం కారు పార్ట్‌‌లు అన్నీ విప్పాల్సివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యాపారవేత్త తమిళనాడులోని తిర్పూర్ నుంచి మధురై వెళుతండగా మార్గమధ్యంలో పాము కారులో దూరటం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి కారంతా వెతికించారు అయినా పాము జాడ కనిపించకపోవడంతో బీఎమ్‌డబ్ల్యూ సర్వీసు సెంటర్ నుంచి నిపుణులను పిలిపించారు. అయినా పాము జాడలేదు. మళ్లీ డ్రైవింగ్ మెదలుపెట్టాక పాము కనపడటంతో కారును సర్వీస్ సెంటర్‌కు తరలించాలని నిర్ణయించారు.  
చివరికి పాములు పట్టేవారిని పిలిచి,.. ముందుగా కారు టైర్లను ఊడతీసారు. కారు ఫ్రంట్ బంపర్ ఇతర పార్టలన్నీ పీకేశారు. బంపర్‌కు దగ్గరలో పాము ఇరుక్కొని పోయింది. చివరకు కారు ముందుభాగాన ఉన్న పార్ట్‌లు అన్నీటినీ విడదీయటంతో పాము కిందకు జారిపోయింది. స్నేక్ లవర్స్ సిబ్బంది పామును పట్టుకొని బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత సేఫ్‌గా పామును సమీపంలోని అడవుల్లో వదిలేశారు. అయితే ఉద్యోగులు కొట్టడంతో పాము ఎముకలు దెబ్బతిన్నాయని గాలి ఊదిన తర్వాత కోలుకొని పడగ విప్పిందని.. స్నేక్ లవర్స్ తెలిపారు. 
 

మహారాష్ట్ర : మగవాళ్లను ‘నపుంసకుడు’ అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పదం మగవాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇలాంటివి ఉపయోగిస్తే పరువు నష్టం కేసుల్లో చర్యలు ఎదుర్కొనక తప్పదని కోర్టు తెలిపింది. ఒక విడాకుల కేసుకు సంబంధించి ఈ తీర్పు చెప్పింది. 

2016లో నాగ్‌పుర్‌కు చెందిన దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు కోరుతూ సదరు మహిళ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కుమార్తె సంరక్షణ బాధ్యతలను కోర్టు  తాత్కాలికంగా భర్తకే అప్పగించింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె బొంబాయి హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనంలో పిటిషన్ వేశారు. తన భర్త నపుంసకుడని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. దీంతో ఆమెతోపాటు ఆమె బంధువులపైనా భర్త పరువు నష్టం కేసు వేశారు. దీన్ని కొట్టివేయాలని ఆమె నాగ్‌పుర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ‘‘అగౌరవ పరిచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదు. మా పాప కూడా అధునాతన సంతాన చికిత్స ద్వారా జన్మించింది.’’ అని అభ్యర్థనలో ఆమె వివరించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్‌ సునిల్‌ శుక్రే విచారణ చేపట్టారు.  వైద్య స్థితిని తెలియజేసేందుకే ఆ పదాన్ని ఉపయోగించినప్పటికీ.. దాంతో జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేకుండా ఉండలేమని ఆయన స్పష్టీకరించారు.

 

ఢిల్లీ : పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈసారి చాలా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలుపై 17 పైసలు తగ్గింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ.77.56కు చేరుకుంది. డీజిల్‌పై లీటరుకు 15 పైసలు తగ్గి రూ.72.31కి చేరుకుంది. ముంబైలో లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్‌పై 16 పైసలు తగ్గింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ. 83.07, లీటరు డీజిల్ ధర రూ.75.76కు చేరుకుంది.

ఇటీవల దేశంలో ఎన్నడూ లేనంత విధంగా పెట్రోలు ధరలు పెరగడంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడ్డాయి. అంతేకాకుండా పెట్రోలు ధరల పెంపు ప్రభావంతో నిత్యవసరాల ధరలు పెరగంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. 

 

రాయ్ పూర్: 90 అసెంబ్లీ స్ధానాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్ సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభ మయ్యింది. మావోయిస్టు  ప్రభావిత ప్రాంతాలైన ..... బీజాపూర్,నారాయణపూర్,కాంకేర్, బస్తర్, సుక్మా,రాజనందగావ్,దంతేవాడ జిల్లాల్లోని 18 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టులు ఎన్నికలను  బహిష్కరించమని  పిలుపునిచ్చిన నేపధ్యంలో  సుమారు  లక్ష మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు గడచిన  15 రోజుల్లో ఆరు సార్లు  దాడులు జరిపారు. ఈ దాడుల్లో 13 మంది మరణించారు.తొలిదశ పోలింగ్ లో దాదాపు 32 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో  కాంకెర్‌, కేష్కాల్‌, కొండగాన్‌, నారాయణ్‌పూర్‌, దంతెవాడ, మోహ్లా మాన్పూర్‌, అంతగఢ్‌, భానుప్రతాప్పూర్‌, బిజాపూర్‌, కోంటా 10 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా 8 స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో 72 స్థానాలకు ఎన్నికలు నవంబరు 20న జరుగనున్నాయి. 
650 పోలింగ్ బూత్‌లకు చెందిన సిబ్బందిలో కొందరు హెలికాప్టర్ల ద్వారా శనివారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకోగా,  మరి కొందరు రోడ్డు మార్గాల ద్వారా ఆదివారం వచ్చారు. ఈ ఎన్నికల అవసరాల దృష్ట్యా భారతీయ నావికా దళ చాపర్లను కూడా వినియోగిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వైపునకు వెళ్లే అన్ని రోడ్డు మార్గాల్లో  భద్రతా దళాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు.

ఢిల్లీ : భారతదేశంపై 4.36లక్షల సైబర్‌దాడులు జరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో భారతదేశంపై 4.36లక్షల సైబర్‌దాడులు జరిగినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎఫ్‌-సెక్యూర్‌ వెల్లడించింది. అమెరికా, చైనా, నెదర్లాండ్స్‌ దేశాల నుంచే ఎక్కువ మంది సైబర్‌నేరగాళ్లు భారత్‌పై దాడి చేశారని తెలిపింది. మరో విషయమేటంటే ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, యూకే, జపాన్‌, ఉక్రెయిన్‌ దేశాలపై దాడి చేసిన వారు భారత్‌కు చెందిన వారుకావడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా దాడులను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్‌ 21వ స్థానంలో ఉంది. మన నెటిజన్లను 6,95,396 మంది హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. దాడులు చేస్తున్న జాబితాలో మన దేశం 13వ స్థానంలో ఉంది. మొత్తంగా 73,482 మంది హ్యాకర్లు ఇక్కడి నుంచే దాడులు చేశారు. ఇక అమెరికా లక్ష్యంగా 1,10,10,212 దాడులు జరగ్గా, యూకేపై 97,680,746 సైబర్‌దాడులు చోటు చేసుకున్నాయి.
ఎఫ్‌-సెక్యూర్‌ ఈ గణాంకాలన్నింటినీ ‘హనీపాట్స్‌’ నుంచి సేకరించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 41 హనీపాట్స్‌ ఉన్నాయి. ఇవి సైబర్‌నేరగాళ్ల చర్యలను పసిగడుతూ వారు విడుదల చేసే మాల్వేర్‌ శాంపిళ్లను, స్క్రిప్ట్‌లను, హ్యాకింగ్‌ టెక్నిక్‌లను సేకరించి విశ్లేషిస్తుంది. రష్యా (2,55,589) నుంచి అత్యధికమంది సైబర్‌ నేరగాళ్లు భారత్‌పై దాడి చేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా(1,03,458), చైనా(42,544), నెదర్లాండ్స్‌(19,169), జర్మనీ(15,330) దేశాలు ఉన్నాయి. 

 

బెంగళూరు : బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అనంతకుమార్ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నారు.

1959 జులై 22న బెంగళూరులో అనంత్ కుమార్ జన్మించారు. మైసూరు యూనివర్సిటీ నుంచి న్యాయశాఖలో పట్టా అందుకున్నారు. 1996లో తొలిసారి ఎంపీగా గెలిచారు. వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. తొలిసారి ఎంపీగా గెలిచిన వెంటనే పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. 1998లో వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ, పర్యాటక శాఖల మంత్రిగా కూడా పని చేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

 

ఢిల్లీ : బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకతాటిపైకి తెచ్చేయత్నం చేస్తున్నామని తెలిపారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్లు చీలడంతో బీజేపీకి లాభం చేకూరిందన్నారు. అందుకే ఓట్లు చీలి పోవద్దని తాము తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి పడ్డ ఓట్లు 32 శాతమే...69 శాతం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా వేశారని తెలిపారు. 

 

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్షాల నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ నటి, బీజేపీ నేత లాకెట్‌ ఛటర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోతున్న రథయాత్రను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారి తలలు రథ చక్రాల కింద నలిగిపోతాయని హెచ్చరించారు. డిసెంబర్‌ 5,6,7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఈ యాత్రను ప్రారంభించనుండగా.. చివరిరోజున కోల్‌కతాలో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్ బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలైన ఛటర్జీ మాల్దా జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అయితే ఈ యాత్రను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. 
బీజేపీ నేత వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముంబై: అసలే ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మన దేశంలో నెంబర్ 1 సంపన్నుడు. అలాంటి ప్రముఖుడి ఇంట్లో పెళ్లి అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌తో ఈశా వివాహం డిసెంబర్ 12న ముంబైలోని అంబానీ నివాసంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముకేశ్ అంబానీ ప్రత్యేకంగా తయారు చేయించిన పెళ్లి శుభలేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వీరి వెడ్డింగ్ కార్డుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాక్సు రూపంలో, బంగారంతో తయారు చేసిన ఈ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ శుభలేఖ ధర అక్షరాల మూడు లక్షల రూపాయలు. బాక్స్‌పైన వధూవరుల ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ఐఎ’ అని రాయించారు. బాక్స్‌ను తెరిచిన వెంటనే అందమైన శుభలేఖ కనిపిస్తుంది. ఆ తర్వాత గాయత్రీ మంత్రం వినిపిస్తుంది. వెడ్డింగ్ కార్డు ధర తెలుసుకుని అంతా విస్తుపోతున్నారు. అంబానీ కూతురు శుభలేఖ ఖర్చుతో పేదింట్లో 2-3 పెళ్లిళ్లు జరిగిపోతాయని కామెంట్లు చేస్తున్నారు. 
ఇక పెళ్లి పత్రికను రెండంచెల పెట్టెల్లో అమర్చారు. మొదటి పెట్టె లోపల డైరీ రూపంలో వివాహ పత్రిక ఉంటుంది. బంగారు పూతతో డిజైన్ చేసిన ఈ డైరీని తెరవగానే గాయత్రి మంత్రం వినిపిస్తుంది. తర్వాతి పేజీలో శ్రీకృష్ణుడి ప్రతిమ ఓ వైపు ఈశా, ఆనంద్ రాసిన లేఖ ఓవైపు ఉంటుంది. నాలుగో పేజీలో ‘శుభ్ అభినందన్’ పేరుతో ఆహ్వాన పత్రిక, మిగిలిన పేజీల్లో వధూవరుల కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు, హిందూ దేవుళ్ల మంత్రాలను పొందు పరిచారు. ఇక రెండో బాక్సులో నాలుగు చిన్న ఆభరణాల పెట్టెలుంటాయి. ఆ పెట్టెల్లో బంగారు ఫ్రేములతో తయారు చేసిన హిందూ దేవతల ప్రతిమలతో పాటు చిన్న సంచుల్లో అత్యంత విలువైన రాళ్లతో తయారు చేయించిన నెక్లెస్‌లుంటాయి. ఈ బాక్స్ విలువే రూ.3లక్షలు.

తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయ్యప్ప ఆలయానికి వచ్చే 10 నుంచి 50ఏళ్ల వయసు మధ్య మహిళలను అయ్యప్ప భక్తులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సన్నిధానానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను వెనక్కి పంపేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు రక్షణగా నిలిచినా మహిళలు సన్నిధానం చేరుకోలేకపోతున్నారు. దీంతో కేరళ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. మహిళల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. కోచి, తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లలో మహిళలను శబరిమలకు తరలిస్తే ఎలా ఉంటుందని కేరళ పోలీసులు ఆలోచిస్తున్నారట. ఈ నెల 17 నుంచి మండలం పూజలకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండడంతో పోలీసులు ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. 
ఆలయంలోకి అన్నివయసుల మహిళలనూ అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై రెండు రివ్యూ పిటిషన్లు ఈ నెల 13న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. వాటిపై వచ్చే తీర్పునకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని కేరళ పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును సమర్థించుకుంటే మహిళలు ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తే హెలిప్యాడ్‌ కోసం అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. 
అయితే హెలికాప్టర్ల వినియోగం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అత్యవసర సమయాల్లో భక్తులను తరలించేందుకు మాత్రమే హెలికాప్లర్లను వినియోగిస్తారని పేర్కొంటున్నారు. చూడాలి మరి.. పోలీసులు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

ఢిల్లీ : తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ చెప్పిన ప్యారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని.. ప్యారాచూట్ అభ్యర్థులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

 

బెంగళూరు : ఆంబిడెంట్ కంపెనీపై నమోదైన పోంజీ స్కామ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయిన జనార్ధన్ రెడ్డిని ఇవాళ తెల్లవారుజాము వరకు ఈ కేసుకు సంబంధించి ఆయన పాత్రపై పోలీసులు ప్రశ్నించారు. అయితే వారు అడిగిన ప్రశ్నలకు గాలి సరిగ్గా సహకరించడం లేదని వినిపించింది. అందుకే పూర్తి ఎంక్వైరీ కోసం అరెస్టు చేశారని అంటున్నారు.

ఆంబిటెండ్ కంపెనీ కర్నాటకలో రూ.950 కోట్లకు పైగా జనాల నుంచి వసూలు చేసి, తిరిగి చెల్లించడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ ఏడాదిలోనే ఆంబిడెంట్ కంపెనీపై ఈడీ కేసు రిజిస్ట్రర్ చేసింది. తర్వాత ఇదే కేసులో ఆ కంపెనీ ఓనర్ ఫరీద్‌ను అరెస్టు చేసింది. అతన్ని బయటపడేసేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ఈడీలోని కొంతమంది అధికారులతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు బ్రిజేష్ అనే ఈడీ అధికారిని అదుపులోకి తీసుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి కోసం వేట సాగించగా ఆయన నాలుగు రోజులపాటు కనిపించకుండా దోబూచులాడుతూనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే బెయిల్ దక్కక పోవడంతో జనార్ధన్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విక్టోరియా ఆస్పత్రిలో గాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

విశాఖపట్నం: మరో తుఫాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతోంది. ఈ తుఫానుకు శ్రీలంక సూచించిన ''గజ''గా నామకరణం చేశారు. పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 400 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 1050 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడుకు 900 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రకృతమైంది. ఈ నెల 15న పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను తీరం సమీపించే కొద్దీ గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం ఓడరేవుల్లో ప్రమాద సూచికను జారీ చేశారు. తుఫాను ప్రభావంతో 13వ తేదీ నుంచి దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయ్‌పూర్: సోమవారం మొదటి విడత పోలింగ్ జరగునున్న చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతోభద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాంకేర్‌ జిల్లాలోని కోయలబేడలో వరుసగా పేర్చిన 6 ఐఈడీలను ఒకేసారి పేల్చివేయడంతో ఆ మార్గంలో కూంబింగ్ జరుపుతున్న బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. రాయపూర్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని కాంకేర్ జిల్లాలో ఈఘటన జరిగింది. గాయపడ్డ జవాన్ ఏఎస్ఐ మహేంద్ర సింగ్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పేలుడు తర్వాత భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. 
మరోవైపు బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించగా,మరోక మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. కొందరు తప్పించుకు పారిపోయారు. ఘటనా స్ధలంనుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, పారిపోయిన మావోయిస్టులను గాలించేందుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు నిచ్చిననేపధ్యంలో... సోమవారం మొదటి విడత పోలింగ్ జరగనున్నబస్తర్ డివిజన్ లోని 7 జిల్లాలు, రాజనందగాఁవ్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతగా జరగటానికి సుమారు లక్షమంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. 

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఐటీ రైడ్స్ జరుపుతూ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకుంటూ... రాజకీయ లబ్ధి పొందే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఎన్డీఏ హయాంలో నోట్లరద్దుతో ఏటిఎంలు ఖాళీ అయ్యాయని విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. డిమానిటైజేషన్ స్వార్థంతో చేశారని...దీని వల్ల అందరూ ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఏటీఎంలు, బ్యాంకులలో డబ్బులు లేవని, ఎక్కడికక్కడ సమస్యలు వచ్చాయన్నారు. ’మన డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం, బ్యాంకుల చుట్టూ క్యూ కట్టే పరిస్థితి వచ్చింది’ అని పేర్కొన్నారు. నోట్లరద్దు వల్ల దుష్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శించారు. గ్రోత్ రేట్ పడిపోయిందన్నారు. రూపాయి విలువ పతనం అయిందని, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ఫెర్టిలైజర్ ధరలు విపరీతంగా పోయాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల నిరుద్యోగం పెరిగిందన్నారు. వ్యవసాయ సంక్షోభం తలెత్తిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 

ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. మీడియా, కంపెనీలు, రాజకీయ పార్టీల నాయకులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. తనకు స్వలాభం లేదని చెప్పారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలని సురక్షితంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ అమరావతి పర్యటనపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. యాంటీ బీజేపీ వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

 

విజయవాడ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రానున్నారా? ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొంటారా? చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరవుతారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 23న ఏపీ రాజధాని అమరావతికి రాహుల్‌గాంధీ రానున్నారని, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందు కార్యక్రమానికి రాహుల్ హాజరవుతారని సమాచారం. రాహుల్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్యనేతలు విందులో పాల్గొననున్నారని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, మరో పది మంది జాతీయ నాయకులు తరలిరానున్నారని వార్తలొస్తున్నాయి. అదే రోజు అమరావతిలో ప్రత్యేక హోదా కోసం జరిగే చివరి ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీతో పాటు నాయకులందరూ పాల్గొంటారని తెలుస్తోంది.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఢిల్లీ వెళ్లి పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వారికి వివరించారు. ఈ క్రమంలోనే జాతీయపార్టీల నాయకులు, ముఖ్యమంత్రులను చంద్రబాబు అమరావతికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

గుంటూరు : దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలైందని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తొలిసారిగా కూటమి ప్రారంభమైందని తెలిపారు. ఈ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబుతో చర్చలు జరుపుతామని చెప్పారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలే కాకుండే ఇతర పార్టీలను స్వాగతిస్తామన్నారు. యూపీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలే కాకుండా టీడీపీలా ఇతర పార్టీలు తమ కూటమిలోకి వస్తే సంతోషిస్తామని చెప్పారు. ఏదైతే లక్షాన్ని ఎంచుకున్నామో..దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇక్కడికి వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి భవిష్యత్తులో కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.  

 

విజయవాడ: దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని ఏపీ సీఎం, టీడీజీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలతో విభేదించిన టీడీపీ... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఆ పార్టీతో చేతులు కలిపిందని వివరించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మహాకూటమి చాలా అవసరమని.. ఇప్పటికే కొన్ని పార్టీల అధినేతలతో మాట్లాడానని... త్వరలోనే ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తానని చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అశోక్ గెహ్లాట్‌తో జాతీయ రాజకీయాలు, జాతీయ అజెండాపై చర్చించానని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి అజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ఇద్దరం చర్చించామన్నారు.

Image result for chandrababu naidu rahul gandhiఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరు ఏది చెప్పినా మోడీ వినరని... ఏది అనుకుంటే అది చేస్తారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా ఇద్దరూ కలసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, దేశంలోని కీలక వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ సొంత వ్యక్తుల కోసం నిబంధనలను కూడా మార్చుతున్నారని, దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చంద్రబాబు వాపోయారు. మోడీ వైఖరితో దేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయన్నారు. నోట్ల రద్దుతో మోడీ ఏం సాధించారని చంద్రబాబు నిలదీశారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి విలువ పతనమైందని, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శించారు.

Image result for chandrababu ashok gehlotప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతి పార్టీ మహాకూటమి గురించి ఆలోచించాలని కోరారు. నేతలతో సమావేశాలు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అన్ని పార్టీలతో కలసి సమావేశం నిర్వహిస్తామని, ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడమే తమ లక్ష్యం అన్న చంద్రబాబు ఈ నెల 22న బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ, కాంగ్రెస్ కలవాల్సిన అవసరం ఉందన్నారాయన.

ఉత్తరప్రదేశ్: రైల్లో సిగరెట్ తాగొద్దని చెప్పడమే ఆమె పాలిట పాపమైంది. సిగరెట్ తాగొద్దన్న పాపానికి ఆమె ప్రాణమే పోయింది. నాకే అడ్డు చెబుతావా? అంటూ కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి గర్భవతి అని కూడా చూడకుండా కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్-బీహార్ జలియన్ వాలా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో చినత్‌దేవి (45) అనే గర్భవతి తన కుటుంబసభ్యులతో కలసి ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ తోటి ప్రయాణికుడు బోగీలోనే సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ పొగ వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని... ఆపేయాలని ఆమె కోరింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన ఆ దుండగుడు ఆమెపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఈ ధాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. చనిపోయిన మహిళ తన కుటుంబంతో కలసి చాత్ పూజ కోసం బీహార్ వెళుతోందని పోలీసులు తెలిపారు. దుండగుడు సోనూ యాదవ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామన్నారు.

బెంగళూరు: ఒక లంచం కేసులో గత మూడురోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని అజ్ఞాతంలో ఉన్న మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసుల ముందు శనివారం సాయంత్రం లొంగిపోయారు. 
జనార్ధన రెడ్డిపై పలు అవినీతి కేసులు ఉన్నాయి. మూడేళ్లు జైలు జీవితం గడిపి 2015లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. రూ 18 కోట్ల లంచం కేసుకు సంబంధించి బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచి పోలీసులు జనార్ధనరెడ్డి కోసం వెతుకుతున్నారు. తమ కంపెనీ నుండి అప్పటి యడ్యూరప్ప కేబినెట్ లో మంత్రిగా ఉన్న జనార్ధన రెడ్డి ఓ కేసు నుంచి బయట పడేసేందుకు రూ 18కోట్లు డిమాండ్ చేశాడని యాంబిడెంట్ అనే ప్రయివేటు సంస్థ కేసు నమోదు చేసింది. నగదును మంత్రి సన్నిహితుడికి ఇచ్చినట్టుగా ఆరోపణలు చేశారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే యాంబియంట్ గ్రూపు దాదాపు రూ 600 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన సందర్భంగా ఆ కేసు నుంచి కంపెనీని తప్పించేందుకు ఈ సొమ్ము చెల్లించినట్టు కంపెనీ ఆరోపించింది. ఈ సందర్భంగా రమేష్ కోఠారి అనే బులియన్ మర్చంట్ కు 57 కిలోల బంగారం ఇచ్చినట్టు గ్రూపు అధినేత సయ్యద్ అహ్మద్ ఫరీద్  వెల్లడించాడు.

Pages

Don't Miss