National News

కేరళ : పెళ్లి..జీవితాంతం గుర్తిండిపోయేలా పలువురు వినూత్నంగా వివాహం చేసుకుంటుంటారు. కొందరు అత్యంత ఆర్భాటంగా చేసుకొంటూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. మరికొందరు మాత్రం ఎలాంటి హంగు..ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకుంటుంటారు. పలువురి పెళ్లిళ్ల సమయంలో తీసుకునే ఫొటోలు..వీడియోలు ఆకట్టుకొనే విధంగా ఉంటుంటాయి. కేరళలో పెళ్లి వేడుకలు వినూత్నంగా చేసుకుంటుంటారు. ఓ జంట మాత్రం తీసుకున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
కేరళ..లోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందుకు వివాహం ఇటీవలే జరిగింది. వీరి వివాహ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్ లో సిద్ధహస్తుడైన సిద్దార్థ్ తన సామాగ్రీతో వివాహ వేదిక వద్దకు వెళ్లాడు. 
పెరట్లోని ఓ చిన్న నీటి కుంటను ఏర్పాటు చేశాడు. ఉరిలిగా పిలిచే తట్టంలో అభిముఖంగా దంపతులను ఒరిగారు. అనంతరం పక్కనే ఓ పైపుతో నీటి జల్లులు వారిపై పడుతుండగా ఓ నిచ్చెన పైకి ఎక్కిన సిద్ధార్థ్ వారి ఫొటో తీశాడు. ఆ సమయంలో వారు తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్టుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటో తీయడానికి సుమారు ఆరు గంటల సమయం పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫొటో వైరల్ అవుతోంది. 

Photographer Shine Sidhardh and his team at an outdoor wedding shoot. Photo credit: Shine Sidhardh.

 

చెన్నై: తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ప్రారంభించిన కొత్త న్యూస్ ఛానల్ "న్యూస్ జె" ప్రసారాలు నేటినుంచి ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు  బుధవారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఛానల్ ప్రసారాలు ప్రారంభించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించేంతవరకు అన్నాడీఎంకేకు "జయటీవీ", "నమదు" పేపరు పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయటంలో అగ్రస్ధానంలో ఉండేవి. పేపరు, టీవీ ఛానల్ రెండూ శశికళ కుటుంబ సభ్యులవే కావటంతో  తర్వాత జరిగిన పరిణామాల్లో అవి వారి స్వంతమయ్యాయి. పార్టీ కార్యకలాపాలు ప్రచారం కోసం స్వంత ప్రసార మాధ్యమం ఉండాలనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరిలో "నమదు పురచ్చితలైవి అమ్మ" పత్రికను ప్రారంభించారు. అప్పటి నుంచి పత్రికను మంత్రుల బంధువులు కొందరు నిర్వహిస్తున్నారు. ఇక టీవీ ఛానల్ ఏర్పాటులో భాగంగా గత సెప్టెంబరులో ఛానల్ లోగోను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుత ఛానళ్లు ప్రభుత్వ పధకాల గురించి పెద్దగా ప్రచారం చేయడంలేదని, ప్రభుత్వానికి పార్టీకి ప్రచారం కల్పించటానకి ఛానల్ ప్రారంభిస్తున్నామని పళనిస్వామి చెప్పారు. బుధవారం నుంచి ఛానల్ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. 

మహారాష్ట్ర : ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్తే..పులి వెంటబడింది. ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. ఒకానొక దశలో వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని మీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో వైరల్‌‌ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా-అంధారీ టైగర్‌ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తడోబా-అంధారీ టైగర్‌ రిజర్వ్‌కు వెళ్లారు. అయితే ఒక్కసారిగా పులి పర్యాటకుల వాహనం వెంటపడింది. పులి వెంటపడుతోన్న విషయాన్ని గ్రహించిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురై, కేకలు వేస్తున్నట్లు ఆ వీడియోలో వెల్లడవుతోంది. ఈ ఘటనపై రేంజ్‌ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర స్పందించారు. పర్యాటకులు వాహనం దగ్గరగా రావడంతో మూడున్నర సంవత్సరాలున్న ‘ఛోటీ మధు’ ఆందోళన చెంది వారి వాహనాన్ని వెంబడించి ఉంటుందని వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిట్లు ఆయన తెలిపారు. దీంతో వెంటనే టూరిస్టు గైడ్లు, డ్రైవర్లకు అధికారులు కొన్ని హెచ్చరికలు చేశారు. పులులు ఉండే ప్రదేశానికి తగినంత దూరం పాటించాలని సూచించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన రహదారిని ఒక వారం పాటు మూసివేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ: ప్రజల్లో దేశభక్తి, జాతీయవాదం భావనను పెంపొందించే దిశగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శన ఇందులో భాగంగా తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడు అలాంటి మరో నిర్ణయంతో కేంద్రం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. రైల్వే స్టేషన్లలో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం.
అవును అత్యంత రద్దీగా ఉండే 75 రైల్వే స్టేషన్లలో 100 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దానికి సంబంధించి రైల్వే బోర్డు గత నెల ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. వార్షిక ఆదాయం రూ.50 కోట్లు పైబడిన(ఏ1 కేటగిరీ) రైల్వే స్టేషన్లలో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. మువ్వన్నెల జెండాల ఏర్పాటుకు కేంద్రం డిసెంబర్ 31,2018ని చివరి తేదీగా నిర్ణయించింది. 
అయితే జెండాలు లైట్ల వెలుతురులో ఉండాలని, వాటి రక్షణకు ఒక గార్డును నియమించాలని సర్క్యులర్‌లో సూచించారు. లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో కలిపి జెండా ఏర్పాటుకు సుమారు రూ.9లక్షలు ఖర్చు చేయాలనుకుంటున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కేరళ : శివకేశవుల ముద్దుల బిడ్డడు వివాదంలో చిక్కుకున్నాడు. మనుషులు సృష్టించిన వివాదం నుండి బైటకు రాలేక..మనుషుల అజ్నానానికి, అహంకారానికి మధ్య అయ్యప్ప నలిగిపోతున్నాడు. స్వామియే శరణం అయ్యప్పా అని భక్తులు పిలిస్తే శబరిమల ఇలవేలుపు పలుకుతాడని భక్తుల విశ్వాసం. మరి అటువంటి శివశంకరుల ముద్దుల బిడ్డడిని వివాదంలోపడేశారు ఆ భక్తులే. 
let us leave sabarimala to tigers, says environmentalistశబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనుకూల, వ్యతిరేక వర్గాలు పలు వివాదాలకు కేంద్రంగా శబరిమల ఆలయాన్ని మార్చవిశాయి. ఈ నేపథ్యంలో అచ్యుతన్ అనే పర్యవరణ వేత్త ఘాటుగా స్పందించారు. శబరిమల ఆలయానికి మగవాళ్లు వద్దు, ఆడవాళ్లు వద్దు, అది పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దాం అని కొత్తప్రతిపాదన ముందుకు తెచ్చారు.  వరదలతో కేరళ అతలాకుతలమైపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కేరళ పునర్నిర్మాణం గురించే  కానీ శబరిమల ఆలయం గురించి కాదని తేల్చి చెప్పారు. 

రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఆధ్వరంలో వరదల అనంతరం కేరళ పునర్నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో అచ్యుతన్ ప్రసంగించారు. ఓవైపు ప్రకృతి ఉత్పాతంతో కేరళ కుదేలైంది. పర్యావరణం ప్రమాదంలో పడింది. అడవులను విస్తరించలేకపోయినా కనీసం ఉన్నవి కాపాడుకుంటే మంచిదని ఆయన చెప్పారు. శబరిమలపై గతంలో జరిపించిన సర్వేలో అచ్యుతన్ పాల్గొన్నారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ అభివద్ధి పేరిట మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. మూర్ఖత్వంతో అందరు అందరూ ఓ చిన్న విషయంపై సమయాన్ని, శక్తిని, వనరులను వృథా చేసుకుంటున్నారని పర్యవారణవేత్త అచ్యుతన్ అభిప్రాయపడ్డారు.
 

ఆమె పేరు సంగీత. వయస్సు 40 ఏళ్లు. మహారాష్ట్ర షిర్డి నివాసి. మొన్నటి వరకు మాములుగా ఉండేది.. ఇటీవలే కొంచెం తేడాగా కనిపిస్తోంది. గాలి సోకిందని ఇంట్లో వాళ్లు వదిలేశారు. లోకల్ గానే వైద్యం చేయించారు. అయినా నయం కాలేదు. 2018, అక్టోబర్ 30వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురైంది. కడుపునొప్పితో బాధపడుతుంది. భయపడిన కుటుంబ సభ్యులు ముంబై తీసుకొచ్చారు. గవర్నమెంట్ సివిల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 
అది కడుపేనా?
ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగీతకు పరీక్షలు చేశారు. ఎక్స్ రేలు తీశారు. కడుపులో ఏవేవో ఉన్నట్లు గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో మెటల్ వస్తువులు గమనించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ధియేటర్ లోనే షాక్ అయ్యారు డాక్టర్లు. కడుపులో ఉన్న పిన్నీసులు, నట్లు, బోల్టులు, హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్, బ్రాస్ లెట్లు, గాజులు, ఓ మంగళసూత్రం, మెడలో వేసుకునే చైన్లు ఇలా తీసేకొద్దీ వచ్చాయి. ఆ కడుపును క్లీన్ చేయటానికి మూడు గంటల సమయం పట్టింది డాక్టర్లు. మొత్తంగా తూకం వేస్తే కిలోన్నర వచ్చింది. డాక్టర్ నితిన్ పర్మార్ ఆధ్వర్యంలో ఆ ఆపరేషన్ జరిగింది.
ఇదో రకం జబ్బు :
ఇదో రకం జబ్బు అంటున్నారు డాక్టర్లు. మతిస్థిమితం కోల్పోయే సమయంలో మెటల్, ఐరన్ వస్తువులను తింటారని.. రేర్ గా ఇలాంటి జబ్బు వస్తుందని చెబుతున్నారు. వీరికి నొప్పి ఉన్నా తెలియదని.. పరిస్థితి విషమించినప్పుడే ఆ నొప్పి బాధ అర్థం అవుతుందని చెబుతున్నారు డాక్టర్ ఆర్పాన్ నాయక్. మామూలు మనుషులు అయితే ఓ పిన్నీస్ మింగినా నొప్పికి భరించలేరని.. అకుపాజియ అనే డిజీస్ ఉన్నవాళ్లు మాత్రం అలాగే తింటూ ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం సంగీత కోలుకుంటుందని వివరించారు. 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానం నడిపే ముందు జరిపిన ఆల్కాహాల్ టెస్టులో అడ్డంగా దొరికిపోయిన ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్‌ను ఉద్యోగంలోంచి తొలగించారు. కేప్టన్ అరవింద్ కథాపాలియా అనే పైలట్ ఆపరేషన్స్ డైరక్టర్‌గా ఎయిర్ ఇండియాలో సేవలందిస్తున్నాడు. అరవింద్ విమానం నడిపే ముందు జరిపిన మద్యం టెస్టులో దొరికిపోవడంతో అంతకుముందే అతన్ని మూడేళ్లపాటు విమానం నడపకుండా ఆంక్షలు విధించారు. 
విమాన ప్రయాణీకల భద్రతను పణంగా పెట్టి పదే పదే మద్యాన్ని సేవిస్తున్న అరవింద్‌ను తొలగించాలని భారతీయ కమర్షియల్ పైలట్స్ సంఘం డిమాండ్ చేసింది. దీనికితోడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు సైతం కెప్టన్ అరవింద్‌ను విధుల్లోంచి తప్పించాల్సిందిగా ఎయిర్ ఇండియాకు సూచించారు. కేప్టన్ అరవింద్ రక్తంలో అధికంగా ఆల్కాహాల్ ఆనవాళ్లు ఉన్నాయని న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానం బయలుదేరే కొద్దిసేపటి ముందు గమనించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో అరవింద్ ఫెయిల్ అవడం ఇది రెండవసారి. గతేడాది జనవరిలో కేప్టన్ అరవింద్‌ను విమానం బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు వెళ్లకుండా తప్పించుకున్నందుకు అతన్ని విమానం నడపకుండా మూడు సార్లు దింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ కల్పనకు నడుంబిగించింది. ఈ ప్రణాళికలో భాగంగా రూ. లక్ష కోట్లతో మెగా జాతీయ ఉద్యోగ కల్పన జోన్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రానున్న మూడేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 
నీతి అయోగ్ సూచన మేరకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ పథకం వచ్చే ఏడాది రానున్న సాధారణ ఎన్నికలలోపే అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. దీని ద్వారా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు సృష్టించాలని   బీజేపీ సర్కార్ యోచిస్తోంది. ఈ ఉద్యోగ కల్పన జోన్లలో ఆర్థిక రాయతీలతో పాటు పన్ను చెల్లింపుకు సంబంధించి వెసులుబాటు, మూలధన సబ్సిడీలు, ఏక గవాక్ష క్లియరెన్సులు కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఈ జోన్లలో ఉత్పత్తి రంగాలకు ప్రాధాన్యత కల్పించి ఉద్యోగ కల్పనను మెరుగుపరుస్తారు. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రయోజన వెహికల్ రూట్ల కింద 14 జోన్లను ఏర్పాటు చేయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 
 

 

ఢిల్లీ: శబరిమల వివాదం కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రివ్యూ పిటిషన్లపై బహిరంగ విచారణకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం 13వ తేదీన మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రివ్యూ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది. తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి. 
అయితే శబరిమలలోకి మహిళల ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఉత్తర్వులు యథాతథంగా ఉంటాయని న్యాయస్థాయం స్పష్టం చేసింది. 
కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు వెలువరించిన విషయం విదితమే. కోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తీర్పునకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు. మాస పూజల నిమిత్తం అక్టోబర్ 17న ఆలయాన్ని తెరవగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించడంతో భక్తులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు రక్షణగా వచ్చినా అయ్యప్ప దర్శనం మాత్రం చేసుకోలేక వెనుదిరిగారు.

ఛత్తీస్ గఢ్ : జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాహంపై వార్తలు ఎప్పటికప్పుడు వస్తునే వుంటాయి. ఆయన్ని వివాహం చేసుకుంటానంటు కొందరు యువతులు గతంలో ప్రకటించారుకూడా. రాహుల్ ప్రచారాలలో ఆయనకు ప్రపోజ్ చేసిన యువతులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ మరో మహిళ వార్తల్లోకి వచ్చింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆ మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ‘కాంగ్రెస్’ లో చేరింది. ‘కాంగ్రెస్’లో చేరడానికి గల కారణమేంటి? ఆ  మహిళను విలేకరులు అడిగారు. దీంతో రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని సమాధానం చెప్పింది. దీంతో మీడియా మిత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 

కాగా, గతంలో కూడా ఇదే తరహా సంఘటన ఒకటి యూపీలో జరిగింది. రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ దళిత యువతి పేర్కొంది. దళితులకు రాహుల్ ఎంతో సాయం చేస్తారని, అందుకే, ఆయన్ని పెళ్లాడాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ లో తొలి విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సదరు యువతి రాహుల్ గాంధీని వివాహం చేసుకోవటానికే కాంగ్రెైస్ పార్టీలో చేరానని తెలిపింది. కాగా ఛత్తీస్ గఢ్ రెండో విడత ఎన్నికలు నవంబర్ 20 నుంచి జరగనున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ బిజీగా ఉన్నారు.
 

న్యూడిల్లీ : రఫేల్ యుధ్ద విమానాల కొనుగోలు వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ వివాదం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలకు కారణమైన విషయం విదితమే. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎటువంటి సమాధానం చెప్పని ఫ్రాన్స్ డిఫెన్స్ కంపెనీ డసో మౌనం వీడింది. అనీల్ అంబానీ కంపెనీని తామే ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎంచుకొన్నామని ఇందులో ఎవరి ప్రమేయం లేదని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డసో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరిక్ ట్రాపియర్ ప్రకటించారు. ‘‘తమకు రిలయన్స్‌తోపాటు మరో 30 కంపెనీలతో భాగస్వామ్యం ఉందని.. నేను ఎన్నడూ అబద్ధం ఆడను.. నేను చెప్పిన విషయాలు నిజం. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు అసలు లేదు. ఈ స్థానంలో ఉన్న ఎవరూ అబద్ధం ఆడరు’’ అంటూ ట్రాపియర్ వ్యాఖ్యానించారు. 
డసో సీఈవోపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలు ఖండనగా భావిస్తున్నారు. 
 

ఛత్తీస్‌గఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌‌గాంధీని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఆ పార్టీలో చేరింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌‌గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన యువతికి రాహుల్‌ అంటే ఇష్టమట. అతను ఒప్పుకొంటే పెళ్లి కూడా చేసుకుంటానంటోంది.

ఇప్పుడు రాహుల్‌ కోసం ఆ యువతి కాంగ్రెస్‌లో చేరింది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లింది. అక్కడి మీడియా వర్గాలు ‘మీరెందుకు కాంగ్రెస్‌లో చేరారు?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ...‘రాహుల్‌ని పెళ్లి చేసుకోవాలనే చేరాను’ అని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. గతంలోనూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ దళిత యువతి రాహుల్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చింది. ఆయన దళితులకు ఎంతో సాయం చేస్తారని అందుకే పెళ్లాడాలనుకుంటున్నానని తెలిపింది.

 

వాషింగ్టన్‌ : అమెరికా జైళ్లలో 2400 మంది భారతీయులు ఉన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారనే కారణంతో దాదాపు 2,400 మంది భారతీయులు అమెరికా జైళ్లలో మగ్గుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. వారు అమెరికాలో ఆశ్రయం కోరుతూ అక్రమంగా సరిహద్దులు దాటినట్లు తెలిపింది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం నుంచి వెళ్లిన వారు ఉన్నారని నివేదిక వెల్లడించింది. పంజాబ్‌ నుంచి వెళ్లిన వారు తమ ప్రాంతంలోని హింసాత్మక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోరుతూ అమెరికా వచ్చినట్లు తెలిపారని నివేదిక తెలిపింది. అమెరికా సమాచార హక్కు చట్టం ద్వారా నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌(ఎన్‌ఏపీఏ) అమెరికాలోని 86జైళ్లలో 2,382 మంది భారతీయులు ఉన్నారని సమాచారం తీసుకుందని సదరు నివేదిక వెల్లడించింది. 

 

ఢిల్లీ : మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఎడిట్ ఫీచర్ రానుంది. ట్విటర్‌లో త్వరలోనే ఎడిట్‌ ఆప్షన్‌ను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూజర్లు తాము చేసే పోస్టుల్లో అక్షర దోషాలను నిరోధించేందుకు ఈ ఫీచర్‌పై కసరత్తు చేస్తున్నట్లు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే తెలిపారు. డోర్సే భారత పర్యటన సందర్భంగా నిన్న ఐఐటీ ఢిల్లీలోని టౌన్‌ హాల్‌లో మాట్లాడారు. ‘‘పోస్ట్‌ను ఎడిట్‌ చేసే ఆప్షన్‌ను చాలా మంది వినియోగదారులు కోరుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా పోస్ట్‌ చేసినప్పుడు అక్షర దోషాలు, వెబ్‌లింక్‌లను తప్పుగా ఎంటర్ చేయడం వంటి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.’’ అని డోర్సే అన్నారు. ఇదే సమయంలో ఈ ఫీచర్‌ దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎక్కువ సార్లు పోస్ట్‌ను ఎడిట్‌ చేసే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ గజ.. తీవ్ర రూపానికి మారింది. దీని ప్రభావం ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలపై ఉండనుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నోట్ రిలీజ్ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
> గజ తుఫాన్ 15వ తేదీ మధ్యాహ్నం తీరం దాటనుంది. ఏపీలోని శ్రీహరికోట - తమిళనాడులోని కడలూరు మధ్య తుఫాన్ తీరం దాటనుంది.
> తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 120కిలోమీటర్ల వేగం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
> తుఫాన్ తీరం దాటిన తర్వాత 48 గంటలు అతి భారీ వర్షాలు పడనున్నాయి. తమిళనాడులోని చెన్నై, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఈ ప్రభావం ఉండనుంది.
> తీర ప్రాంతాల నుంచి 40వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు
> కడలూరుతోపాటు నాగపట్నంపైనా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండొచ్చని హెచ్చరించింది వాతావరణశాఖ. కడలూరు, నాగపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 సెంటిమీటర్లపైనే వర్షం పడనుంది. అంటే కుండపోతే
> తమిళనాడులోని నాగపట్నం, తంజావూరు, పుడికొట్టాయ్, రామనాథపురం జిల్లాలు, పాండిచ్ఛేరిలోని కరైకల్ జిల్లాల్లో తుఫాన్ తీవ్రత అధికంగా ఉండనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తం అయ్యి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చెన్నై: ‘‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా’’.. అంటూ రజనీకాంత్‌పై చర్చలు సాగుతున్నాయి. కొద్దికొద్దిగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారా అనే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మర్మగర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో రజనీ బీజేపీ మద్దతుదారుడా కాదా అంటూ రకరకాల కధనాలు వెలువడుతున్నాయి. ఒక విలేకరి బీజేపీఏతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో బీజేపీ డేంజరస్ పార్టీ అని అంటున్నారని ప్రశ్నించగా..‘‘ప్రతిపక్షపార్టీ వాళ్లు అలా అనుకుంటే అది తప్పకుండా అయ్యిండవచ్చు’’ అంటూ నిగూఢంగా సమాధానం చెప్పారు. అలాగే.. డీమానిటైజేషన్ ముమ్మాటికీ తప్పేనని రజనీ వ్యాఖ్యానించారు. ఈ రెండు వ్యాఖ్యలలో ఒకటి బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ఉన్నా డీమానిటైజేషన్‌ను వ్యతిరేకించండాన్ని ఎలా తీసుకోవాలన్న సందిగ్ధత ఏర్పడింది. 
జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటించినా ఇంతవరకు బహిరంగంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. రానున్న 2019 ఎన్నికల్లో రజనీ ఎటువైపు మొగ్గుచూపుతారు అన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.  బీజేపీకి రజనీకాంత్ దగ్గరగా ఉన్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీకి వ్యతికేకంగా ఉన్నాయని కొన్న కథనాలు వెలువడ్డాయి. చెన్నై విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు రజనీ నవ్వుతూ తన స్టైల్‌లో సమాధానం చెప్పారు.  
రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..ఇది తప్పకుండా ప్రతిపక్ష పార్టీలకు రజనీ వ్యాఖ్యలు చురకలేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరికి వస్తేకాని అసలు విషయం అర్థంకాదని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి వ్యాఖ్యానించారు. 

 

చత్తీస్‌గఢ్ : ఐదు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారాలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 18 నియోజకవర్గాల్లో 70శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టుల హెచ్చరికలు, పోలీసుల బందోబస్తు, ఎన్‌కౌంటర్‌లు, ఈఐడీ బాంబుల మధ్య ఎన్నికలను ముగించారు. 2013 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో 75శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు ఐదుశాతం పోలింగ్ తక్కువగా నమోదైంది. 

Image result for chhattisgarh elections 2018

1.9శాతం పోలింగ్ యత్నాలు మాత్రమే మొరాయించాయని, వాటిని మార్చి ఎన్నికలు నిర్వహించామన ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 4336 పోలింగ్ కేంద్రాల్లో పొలింగ్ నిర్వహించారు. మొత్తం 90 స్థానాలు కాగా, మిగిలిన 72 స్థానాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడుతాయి.బందా అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రం సమీపంలో మూడు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు  గుర్తించాయి.  సీఆర్‌పీఎఫ్‌ బాంబు స్క్వాడ్ వచ్చి  వాటిని నిర్వీర్యం చేస్తుండడంతో ‌ పోలింగ్‌ కేంద్రాన్ని తాత్కాలికంగా ఓ చెట్టు కిందకు మార్చి  అక్కడ పోలింగ్‌ కొనసాగిస్తున్నారు. 
 

 

ఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీతో  స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా తదితరులు సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాహుల్ పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ జాబితాకు తుదిరూపు ఇచ్చేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సొంత పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంత మంది ఉన్నారు? ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన వారు ఎంతమంది ఉన్నారనే విషయమై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
 

 

మిజోరాం : రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాలకు కేంద్ర బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. ఆ రాష్ట్ర డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ జోసెఫ్ లాల్‌చ్చుయానా మాట్లాడుతు.. ‘రాష్ట్రంలోని సంబంధిత అధికారులందరి అభిప్రాయాలు తీసుకున్నాకే 40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల ప్రధానాధికారి ప్రతిపాదించారు. 
కాగా మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ తగులుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాలని ఆయన చేసిన ఓ కీలక ప్రతిపాదన పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు ఆ రాష్ట్ర పోలీసుల నుంచి మద్దతు లభించింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి తమకు 40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు  కావాలని శశాంక్‌ ప్రతిపాదన చేయగా అది సరైందేనని ఆ రాష్ట్ర పోలీసులు అన్నారు. దీంతో మిజోరాంకు కేంద్ర బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. కాగా  సుమారు 11 లక్షల జనాభా మాత్రమే ఉన్న మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.
 

 

బెంగళూరు : కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి నవంబర్ 24వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. గాలి జనార్దన్ రెడ్డిని నవంబర్ 11వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో నిందితులను విచారణ నుండి తప్పిస్తానని, ఇందుకు రూ. 20 కోట్లకు గాలి డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసును ఈడీ విచారిస్తోంది. కోర్టు ఎదుట హాజరు పరిచేముందు గాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీ విధించడంతో ఆయన్ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. తాను తప్పించుకుని తిరగడం లేదని, తనపై దుష్ప్రచారం జరిగిందని గాలి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు దిగలేదని వాదించారు. 
సయ్యద్ అహ్మద్ ఫరీద్ అనే వ్యక్తి 15000 మంది నుండి దాదాపు రూ. 600 కోట్ల మేర వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అంబిడెంట్ మార్కెటింగ్ సంస్థ ద్వారా ఈ స్కాం జరిగిందని ఆరోపణలున్నాయి. దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. కేసు నుండి విముక్తి చేసేందుకు గాలి డీల్ కుదుర్చుకున్నారని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురికి సంబంధం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
మరోవైపు బెయిల్ కోసం జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై మంగళవారం కోర్టు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఛత్తీస్ ఘడ్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఇవాళ జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో బీజేపీ ఎలా నిలువరించాలో కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వంశాన్ని కాపాడుకునేందుకు, కులాలపైనే  దృష్టి పెడుతోందని’’ ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ‘‘తల్లీ కొడుకులు బెయిల్ మీద బయట తిరుగుతూ నోట్లరద్దుపై నన్ను ప్రశ్నిస్తున్నారనీ..కానీ నోట్లరద్దు కారణంగానే వాళ్లు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చిందని మర్చిపోయారు..’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ‘‘వంశం కోసమే ప్రారంభమై.. వంశంతోనే ముగుస్తుంది..’’ అని ప్రధాని నరేంద్రమోదీ రాహుల్ సొనియాలపై విరుచుకుపడ్డారు.  
నక్సలైట్ల హింసకు అడ్డుకట్ట వేసేలా ఛత్తీస్‌గఢ్ ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ‘‘మీ ఇళ్లలో నుంచి బయటికి రండి... తుపాకులు గురిపెడుతున్న వారిని ఓడించేలా ఓట్లు వేయండి...’’ అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘గిరిజన చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్న అర్బన్ మావోయిస్టులకు’’ కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

జార్ఖండ్‌ : అక్కడ మావోయిస్టుల హావా కొనసాగుతుంటుంది. బైటికెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారా? లేదో? అనే భయం, అనుమానం, కానీ వెళ్లాలి. ఇక చిన్నారులైతే స్కూలుకెళ్లాలంటే పుస్తకాల సంచీతో పాటు చేతిలో వేటగాళ్లమాదిరిగా విల్లంబులు ధరించి వీరాభిమన్యుడిలా వెళ్లాల్సిందే. ఇదీ ఆ చిన్నారుల దుస్థితి. ఈ పరిస్థితిని చూసిన వార్తాసంస్థ 'ఏఎన్ఐ' ఈ చిత్రాలను బయటి ప్రపంచానికి వెల్లడించింది.  స్కూలుకు వెళ్లేందుకు అడవిని దాటే చిన్నారులు, మార్గమధ్యంలో ఉండే నక్సల్స్ నుంచి రక్షణ కోసం విల్లంబులు పట్టుకుని వెళుతున్న సమయంలో విద్యార్ధుల పరిస్థిని చూసిన ఏఎన్ఐ ఫోటోల ద్వారా బైటి ప్రపంచానికి వెల్లడిచేసింది. 
మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే చకులియాస్‌ పోచపాని గ్రామం విద్యార్థులు ఇలా విల్లంబులు, పుస్తకాల సంచీ చేతబట్టుకుని నిత్యమూ అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటారు ఈ విద్యార్ధులు.  చదువును ఆపకూడదన్న సంకల్పం ఈ చిన్నారులనిలా నడిపిస్తోంది.ఇక్కడ చదువుకోవాలన్నా, ప్రాణాలు నిలుపుకోవాలన్నా ఆయుధాలు చేతిలో ఉండటం తప్పనిసరని చెబుతూ, విద్యార్థుల దీనస్థితి గురించి పేర్కొంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

ఢిల్లీ : సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు ట్విట్టర్ తోనే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ట్విట్టర్ లోనే పలకరిపంపులు, పరామర్శలు, అభినందలు తెలుపుకుంటున్నారు. అంతేకాదు మాటల యుద్ధాలకు కూడా ఈ ట్విట్టల్ పిట్టనే సాధనంగా వినియోగించటం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యలో ట్విట్టర్ ను తరచుగా వినియోగించే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్ సీఈవోతో సెల్ఫీ దిగారు. 
ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న జాక్ డోర్సీతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్ఫీ దిగారు. ఈ ఉదయం జాక్, రాహుల్ ను కలవగా వారిద్దరి మధ్యా కాసేపు చర్చలు సాగాయి. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాహుల్ గాంధీ, ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ట్విట్టర్ దే ప్రముఖ పాత్రని వ్యాఖ్యానించారు. సమాచార బట్వాడా ఆరోగ్యకరంగా ఉండేందుకు, తప్పుడు వార్తలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జాక్ తనకు వివరించారని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను దిగిన సెల్ఫీలను రాహుల్ పోస్టు చేశారు.
సామాజిక మాధ్యమం, ట్విట్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్, జాక్ డోర్సీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ, సెల్ఫీ ,

ఛత్తీస్ గడ్ : 90 అసెంబ్లీ స్ధానాలున్న చత్తీస్ గడ్‌లో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ వేళలను మార్చారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో  కాంకెర్‌, కేష్కాల్‌, కొండగాన్‌, నారాయణ్‌పూర్‌, దంతెవాడ, మోహ్లా మాన్పూర్‌, అంతగఢ్‌, భానుప్రతాప్పూర్‌, బిజాపూర్‌, కోంటా 10 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. 47.18 శాతం పోలింగ్ నమోదైంది. మిగతా 8 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. 
పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అవసరాల దృష్ట్యా భారతీయ నావికా దళ చాపర్లను కూడా వినియోగిస్తున్నారు. బందా అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రం సమీపంలో మూడు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు  గుర్తించాయి.  సీఆర్‌పీఎఫ్‌ బాంబు స్క్వాడ్ వచ్చి  వాటిని నిర్వీర్యం చేస్తుండడంతో ‌ పోలింగ్‌ కేంద్రాన్ని తాత్కాలికంగా ఓ చెట్టు కిందకు మార్చి  అక్కడ పోలింగ్‌ కొనసాగిస్తున్నారు. 

ఢిల్లీ : రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై జనవరి నెలలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వెంటనే  విచారణ జరపాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ ను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసిన ఈ పిటీషన్ పై స్పందించని దేశ అత్యున్నత దేవస్థానం అయిన సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. దేశంలోకొన్ని రాష్ట్రాలలో  సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా వాదించారు. దీనిపై స్పందించని న్యాయస్థానం ఇప్పడు కుదరదని జనవరిలోనే విచారిస్తామని తెలిపింది. 
ఈ కేసును జనవరికి వాయిదా వేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ కే కౌల్ ధర్మాసనం, అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. 
 

 

ఢిల్లీ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రిని పట్టుకోలేకపోయారా ? అద్భుతం అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బీహార్ పోలీసులపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీహార్‌లోని ముజఫర్ పూర్ బాలిక వసతి గ‌ృహాల అత్యచార కేసు తీవ్ర సంచలనం స‌ృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 40 బాలికలపై దారుణంగా అత్యచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బీహార్ మంత్రి మంజు వర్మ భర్తకు కూడా ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మంజు వర్మ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె పరారీలో ఉన్నారు. 
సోమవారం ఈ కేసును సుప్రీం విచారించింది. కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పటి వరకు ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలియదా ?మాజీ మంత్రి ఆచూకి తెలియకపోవడంలో ఎంత సీరియస్‌గా ఉన్నారనేది గ్రహించాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన వ్యక్తిని ఎలా పట్టుకోలేకపోయారనే విషయాన్ని తెలియచేయాలని బీహార్ పోలీసులను ఆదేశించింది. 

ట్రిస్సూర్: ఒక పక్క మహిళలకు ప్రవేశం కల్పించాలని కేరళలోని శబరిమల ఆలయంలో ఆందోళనలు ఉదృతం అవుతుంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తూ ఒక లాడ్జిని ‘షీ లాడ్జ్’ పేరుతో ప్రారంభించింది. ఈ లాడ్జి మహిళలకు భద్రత కల్పించడంతోపాటు, అందుబాటు ధరల్లో వసతి కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే మహిళలకు 14 జిల్లాల్లో ఈ లాడ్జిలను నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ట్రిస్తూర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో పచ్చటి పొలాలమధ్య మొదటి షీ లాడ్జిని ఏర్పాటు చేశారు. ఇందులో 50 మంది మహిళలకు సరిపడా వసతి సౌకర్యం ఉంది. మరోక లాడ్జి కాసరగాడ్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఇంకా ప్రారంభం కావాల్సిఉంది. ఈ రెండు కాక తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులంలో మరో మూడు లాడ్జిలు నిర్మాణంలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  మొత్తానికి కేరళలోని కమ్యూనిస్టు సర్కార్ మహిళల కోసం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే!
 

Pages

Don't Miss