National News

రాజస్థాన్ : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధుల చేతుల్లో ఎంతో మహిళలు నలిగిపోతున్నారు. పలువురిని దారుణంగా హత్య చేసేస్తున్నారు. రాజస్థాన్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. వీరి నుండి తప్పించుకోవాలని ఓ యువతి నగ్నంగా భవనంపై నుండి కిందకు దూకేసింది. తీవ్రగాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. 
నేపాల్‌కు చెందిన 23 ఏళ్ల యువతి జైపూర్‌లో ఓ సంస్థలో పని చేస్తోంది. ఈమెను ముహానా ప్రాంతంలో ఓ ఇంట్లో ఇద్దరు యువకులు అనంతరం ఒకరు తరువాత మరొకరు అత్యచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హింసించారని తెలుస్తోంది. వీరి నుండి తప్పించుకొనేందుకు భవనం మూడో అంతస్థు నుండి కిందకు నగ్నంగా దూకేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచారానికి పాల్పడిన వారు లోకేశ్ శైని కమల్ శైని యువకులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ముంబయి: సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎందర్నో చూసాం. ఈ ఫోటోలో సెల్ఫీ తీసుకుంటున్న మహిళ పేరు అమృత. ఈమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి. ఓడలో ప్రయాణిస్తూ సెల్ఫీ బాగారావాలని భద్రతకోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ఓడ చివర భాగాన సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న భద్రతాధికారులకు కాసేపు చెమటలు పట్టాయి. సీఎం భార్య.. చెబితే ఏమన్నా అనుకుంటుందేమో అనే భయంతోనే ఇది చాలా ప్రమాదమని చెప్పేందుకు సాహసించారు. అమృత ఓడ రైలింగ్ మీద ప్రమాదం అంచున కూర్చొని సెల్ఫీదిగటం ఏఎన్ఐ వీడియోలో రికార్డింగ్ అయ్యింది. అలాగే.. అంటూ మరో సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడం పోలీసులనే కాదు ఓడలో ఉన్న జనాలకూ కాసేపు దడ పుట్టించింది.

Image result for AMRUTA FADNAVIS DARINGయాంగ్రియా అనే మొదటి దేశీయ షిప్ ప్రారంభం సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ ఓడను అమృత భర్త ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలోని విక్టోరియా పోర్టులో ప్రారంభించారు. ప్రతీ వారం ముంబయి నుంచి గోవా ప్రయాణించేందుకు యాంగ్రియా షిప్‌ను ప్రారంభించారు. ఇందులో 400 మంది ప్రయాణించే అవకాశం ఉంది. 
 

ఉత్తర్ ప్రదేశ్ : ఎవరైనా ప్రముఖులు చనిపోతే...అంత్యక్రియల్లో వ్యక్తులు ఎలా ఉంటారు..ఎలా ఉంటారేంటీ ? విషాద సమయం కాబట్టి...బాధాతప్త హృదయాలతో ఉంటారు..అని అంటారు కదా..కానీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అంత్యక్రియల్లో పాల్గొని నవ్వులతో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 
యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయపై పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. యూపీ అసెంబ్లీ ప్రాంగణంలో తివారీ భౌతికకాయాన్ని ఉంచారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తివారీ పార్థీవ దేహం వద్ద సీఎం యోగి ఆదిత్యనాత్ కూర్చొగా ఆయన పక్కన బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్ కూర్చొన్నారు. వీరి వెనుకాలే మోసిన్ రాజీ, ఆవుతోష్ టాండన్‌లు ఆసీనులయ్యారు. కానీ ఏమీ మాట్లాడుకున్నరో ఏమో కానీ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. అంత్యక్రియల్లో..సహచర మంత్రులతో కలిసి యోగి నవ్వుతూ కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన విపక్షాలకు మంచి అస్త్రంగా మారింది. విషాద సమయంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నవ్వడంపై వివక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

బెంగళూరు: కర్నాటక తొలి మహిళా ఐజీ-డీజీపీ అయిన నీలమణి ఎన్.రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రెస్ కోడ్‌కు సంబంధించి మహిళా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా కానిస్టేబుళ్ల డ్రెస్ కోడ్ విషయంలో పలు నిబంధనలు విధించారు. చీరలు వద్దు.. ప్యాంటులు, షర్టులే ధరించాలన్నారు. మహిళా పోలీసులు ఇకపై విధిగా ఖాకీ యూనిఫాం అయిన ప్యాంటు, షర్టు, బెల్టు, బూటు ధరించాల్సిందేనని ఆమె ఆదేశించారు. చీరలో కంటే ప్యాంటు, షర్టు సౌకర్యంగా ఉంటుందని, నేరం జరిగినప్పుడు వేగంగా స్పందించవచ్చని ఆమె వివరించారు. అంతేకాదు ఓపెన్ హెయిర్ కూడా ఉండకూడదని చెప్పారు. చేతులకు గాజులు కూడా ఉండకూడదన్నారు(మెటల్ గాజులు వేసుకోవచ్చు). పూలు కూడా పెట్టుకోవద్దన్నారు. చిన్న బొట్టు మాత్రమే ఉండాలని సూచించారు. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీపీ తెలిపారు. మహిళా పోలీసు అధికారులు, సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశం అనంతరం డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇప్పటి వరకు పెద్ద ర్యాంకుల్లో ఉన్న మహిళా పోలీసులు షర్టులు, ప్యాంటులు ధరిస్తుండగా.. కానిస్టేబుళ్లు మాత్రం ఖాకీ చీరలు ధరిస్తున్నారు. అయితే, ఇకపై ప్రత్యేక సందర్భాల్లో తప్ప చీరలు ధరించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలోని మహిళా పోలీసులందరూ విధిగా ప్యాంటు, షర్టు ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
 
ఈ ఏడాది జూలైలో కర్నాటక రిజర్వ్ పోలీసు అధికారులు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. చీరలకు బదులు ట్రౌజర్స్, షర్టులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 95 వేల మంది పోలీసుల్లో 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. మహిళా కానిస్టేబుళ్ల డ్రెస్ కోడ్‌కు సంబంధించి పోలీసు శాఖలో అనేకసార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పలు నిబంధనలు తీసుకొస్తున్నారు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి 2రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర  ప్రభుత్వం అక్టోబరు 4న చమురుపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ, వినియోగదారుల కోసం  వ్యాట్ తగ్గించమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. కానీ ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించలేదు. ఢిల్లీతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. వ్యాట్ తగ్గించటానికి ఢిల్లీ  ప్రభుత్వం ఒప్పుకోనందున సమ్మె చేపట్టాలని ఢిల్లీ పెట్రో డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. బంద్ వలన ఢిల్లీలోని సుమారు 400 పెట్రోల్ బంక్లలో సోమవారం ఉదయం 6 గంటలనుంచి మంగళవారం వరకు పెట్రోల్,డీజిల్,సీఎన్జీ అమ్మకాలు నిలిపివేయనున్నారు.

మధ్యప్రదేశ్ : ఓటర్లను చైతన్యం చేసేందుకు, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు వింత ఆలోచన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఝాబువా జిల్లా యంత్రాంగం మద్యం సీసాలపై ఓటర్లను చైతన్యం చేసే నినాదాలతో స్టిక్కర్లను అతికించాలని నిర్ణయించింది. అయితే అది బెడిసికొట్టడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

ఇందుకు సంబంధించి స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు. వాటిపై ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ రాశారు. ఎక్సైజ్‌ శాఖ స్టిక్కర్లను పంపిణీ చేసి మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా? అంటూ పలువురు మండిపడ్డారు. దీంతో ఈ నిర్ణయాన్ని అధికారులు వెనక్కితీసుకున్నారు. ‘ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీన్ని వెనక్కితీసుకుంటున్నాం’ అని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అభిషేక్‌ తివారి వెల్లడించారు. 

 

ముంబై: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతుంటారు. ఈ సెల్ఫీలతో కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సెల్ఫీ వివాదమై కూర్చొంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ ఆంగ్రియా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని భావించి...ప్రారంభోత్సవం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమృత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ దిగాలని ఆమె భావించారు. కానీ హద్దు మీరారు. నౌక రెయిలింగ్ దాటి వెళ్లి కూర్చొని తాపీగా సెల్ఫీలు తీసుకున్నారు. సముద్ర అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది హెచ్చరించారు. పోలీస్ అధికారి అలా చేయొద్దని వారించారు. కానీ అమృత పెద్దగా పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. అమృత బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. 

 కేరళ: అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శబరిమలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల రావడం, ఆందోళనకారులు వారిని అడుగడుగునా అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఓవైపు భారీగా పోలీసు బలగాలు.. మరోవైపు అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు.. దీంతో శబరిమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమైంది. అయ్యప్ప గర్భగుడిలోకి వచ్చేందుకు కొందరు మహిళలు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆందోళనకారుల నిరసనలు, హెచ్చరికల కారణంగా వారు వెనుదిరగాల్సి వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు మహిళలు ప్రయత్నించడం..  ఆందోళనకారులు వారిని అడ్డుకోవడం.. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలావుంటే మాస పూజల కోసం తెరిచిన ఆలయం.. ఈరోజు ప్రత్యేక పూజల అనంతరం రేపు మూతపడనుంది.

నాలుగు రోజుల క్రితం మాస పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకున్నాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు 8మంది మాత్రమే దేవుడిని దర్శించే ప్రయత్నం చేశారని, వారిలో ఒక్కరు కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడలేదని ఆయల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వసంతి (41), ఆదిశేషి (42) పంబ బేస్ క్యాంప్ నుంచి శబరిమలకు బయలుదేరగా, ఆలయానికి 200 మీటర్ల దూరంలో వారిని అడ్డుకున్న భక్తులు తీవ్ర నిరసనలు తెలుపగా, వారిద్దరూ వెనుదిరిగారు. నిన్న కేరళకు చెందిన 38 ఏళ్ల మహిళకు కూడా ఇదే విధమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎర్నాకులానికి చెందిన రెహానా, హైదరాబాద్ జర్నలిస్టు కవితలు భారీ బందోబస్తు మధ్య ఆలయం పరిసరాల్లోకి వెళ్లినప్పటికీ, స్వామిని మాత్రం దర్శించుకోలేక పోయారు. గర్భగుడిలోకి రావాలని చూస్తే ఆలయం మూసివేస్తామని ప్రధాన పూజారి కూడా హెచ్చరికలు పంపారు. దీంతో మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది. మొత్తంగా ఒక్క మహిళ కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూడలేకపోయారు.

కాగా, రేపు శబరిమల ఆలయం మూతపడనుంది. ఆపై మండల పూజ నిమిత్తం నవంబర్ 16న ఆలయం తెలుపురు తెరవనున్నారు. డిసెంబర్ చివరి వారం వరకూ ఆలయంలో పూజలు జరగనున్నాయి.

పంజాబ్: మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. జాలి, దయ లోపిస్తున్నాయి. సాటి మనిషి కష్టాల్లో ఉంటే.. ఆదుకోవాల్సింది పోయి సెల్ఫీలు దిగుతున్నారు, అంతకుమించి దోచుకుంటున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి ఘోరాలు అమృత్‌సర్‌ రైలు దుర్ఘటన అనంతరం ఎన్నో చోటుచేసుకున్నాయి. రావణ దహణ వేడుకలు వీక్షించేందుకు ట్రాక్‌పై నిల్చున్న వారిపైకి రైలు దూసుకురావడంతో 61మంది దుర్మరణం చెందగా, 70మంది గాయాలపాలయ్యారు.

కాగా, నెత్తుటి మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారికి చేతనైన సాయం అందించాల్సింది పోయి కొందరు వారివద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుపోయారు. బాధితుల మొబైల్‌ఫోన్లు, నగలు, నగదు, పర్సులు దొంగిలించారు. ఆఖరికి మృతదేహాలు అనే కనికరం కూడా లేకపోయింది. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను సైతం దోచుకెళ్లారు. ఇంత విషాదకర ఘటనలో కూడా రాక్షసానందం పొందడం ఆ మనసు లేని మనుషులకే చెల్లింది.

అమృత్‌సర్‌ రైలు ప్రమాద ఘటనలో దీపక్ అనే వ్యక్తి కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అతని కూతురు చనిపోయింది. కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రైలు ఢీకొని వెళ్లిపోయాక పట్టాలపై విసిరేసినట్టు పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో అత్యంత హృదయవిదారకంగా మారిపోయింది. చనిపోయిన తన కుమార్తెను, ఒళ్లంతా గాయాలైన తన కుమారుడిని చూసి దీపక్ కుమిలిపోతున్నాడు. సాయం అడిగేందుకు సైతం గొంతు పెగలట్లేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి దీపక్‌ జేబులోని మొబైల్‌ను బలవంతంగా లాక్కొని పారిపోయాడు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో దీపక్ ఉండిపోయాడు.

జ్యోతి కుమారి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు వాసును రైలు ప్రమాదంలో పోగొట్టుకుంది. ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని అప్పగించాక అతని మెడలో బంగారు గొలుసు, మొబైల్, పర్స్‌ కనిపించలేదని ఆమె వాపోయింది. కమల్‌కుమార్‌ అనే వ్యక్తికి సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైలు ప్రమాదంలో కమల్ తన కుమారుడిని కోల్పోయాడు. కొడుకు మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కమల్‌కు అప్పగించారు. అయితే కొడుకు జేబులో ఉండాల్సిన రూ.20 వేల విలువైన మొబైల్‌ఫోన్ కనిపించడం లేదని ఆ తండ్రి వాపోయాడు.

కొందరు దొంగతనాలకు పాల్పడి మానవత్వానికి మచ్చ తెస్తే.. ఇంకొందరు సెల్ఫీలు దిగి సిగ్గుపడేలా చేశారు. ప్రమాదం అనంతరం బాధితులకు తక్షణ సాయం అందించాల్సిందిపోయి కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వారి ఆర్తనాదాలను రికార్డు చేస్తున్నారు. మరికొందరు ఘటన స్థలంలో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఇంత విషాదంలోనూ కొందరు వ్యక్తులు చేసిన పనులు అందరిని బాధిస్తున్నాయి. వీళ్లసలు మనుషులేనా? అన్న అనుమానం కలుగుతోంది. మనిషి ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదనే విషయం వారికి తెలుసా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఢిల్లీ: వాహనదారుల వెన్నులో వణుకుపుట్టించిన పెట్రో ధరలు దిగొస్తున్నాయి. కొన్ని రోజులుగా నింగిని తాకుతూ సెంచరీ దిశగా వెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఆదివారం(అక్టోబర్-21) హైదరాబాద్‌లో పెట్రోల్ పై 27 పైసలు తగ్గగా, డీజిల్‌పై 18 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.86.75గా ఉండగా, డీజిల్ ధర రూ.81.89గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర 25పైసలు లీటర్ ధర రూ.86.25.. డీజిల్ ధర 18పైసలు తగ్గి లీటర్ ధర రూ.80.97కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.81.74కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర 17 పైసలు తగ్గి రూ.75.19గా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర 25పైసలు, డీజిల్‌ 18 పైసలు తగ్గింది. ఇక్కడ పెట్రోల్‌ ధర రూ.87.21, డీజిల్‌ ధర రూ.78.82గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో దసరా రోజు నుంచి పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్: ఉదయం, రాత్రి తేడా ఉండదు. పనిగంటలు అస్సలు తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే. డ్యూటీ చేయడం. తాము కుటుంబానికి దూరమైనా.. ప్రజలంతా హాయిగా ఉండేలా కాపలా కాయడం. అల్లరిమూకల రాళ్ల  దెబ్బలు, విద్రోహుల తుపాకీ తూటాలకు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డుతారు. వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలు కాపాడతారు. వారే పోలీసులు. విధి నిర్వహణలో రక్తాన్ని చిందించి.. ప్రాణాలు అర్పించిన పోలీసుల  త్యాగం మరువలేనిది. శాంతిభద్రతలే ధ్యేయంగా విధులు నిర్వహిస్తారు. నిరంతరం సేవలందిస్తూ.. ప్రజారక్షణలో నిమగ్నమవుతారు పోలీసులు. ఇవాళ(అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం..

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్‌చిన్ ప్రాంతం.. 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఇక్కడి నుంచే ఆరంభమైంది.

మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకం. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను CRPF బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న పంజాబ్‌కు చెందిన 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పదిమంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పోలీసుల పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

పోలీసులకు తెలిసిందల్లా ఒక్కటే.. శాంతిభద్రతలను కాపాడటం. బంధుత్వాలు అనే వాటికి వారివద్ద తావుండదు. తప్పు చేసిన వాడు తన వాడైనా శిక్ష ఒక్కటే అనేది వారి పాలసీ. పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని విధులు నిర్వహిస్తారు. బందులైనా, బందోబస్తులైనా వారు లేనిదే ఏమీ జరగదు. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెడతారు. అందుకే తల్లిదండ్రుల్లా దండించే స్థానంలో వారికి మనం స్థానం కల్పించాం. భార్యబిడ్డలకు, తల్లిదండ్రులకు సైతం దూరంగా ఉండి నిరంతరం సొసైటీని రక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. నేరస్తుల గుండెల్లో నిద్రపోతూ, సంఘ విద్రోహశక్తులను అణిచివేడయంలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది అనేక మంది ఉన్నారు. వారి త్యాగం మరువలేనిది. అలా డ్యూటీలో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం మన పోలీసులు ప్రతి ఏడాది అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తారు. 

పోలీసులు దేశం కోసం, ప్రజల కోసం వారి ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ త్యాగాలు గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ త్యాగాలను గుర్తించి, ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దుల్లో సైనికులు, అంతర్గత శత్రువులతో పోరులో పోలీసు అసువులు బాస్తున్నారు. ఎంతో కష్టతరమైన.. పోలీసు బాధ్యతలను నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే.. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు...సీత, లక్ష్మి, సరస్వతి...తదితర దేవతల పేర్లు పెట్టుకోవడం సహజం. కానీ రాజస్థాన్‌ ఓటర్ల జాబితా పేర్లను చూస్తే మాత్రం విస్తు పోవాల్సిందే. రామాయణ కాలం నాటి దేవతలే కాదు...రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. రాజస్థాన్‌లో ఈసీ విడుదల చేసిన  ఓటర్ల జాబితా ఇపుడు చర్చనీయాంశమైంది.
రామాయణ కాలం నాటి పాత్రల పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శతృఘ్న, హనుమంతుడి లాంటి పేర్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ....రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. రావణ్‌, మండోదరి, విభీషణ్‌, మేఘనాథ్‌, కుంభకర్ణ్‌ లాంటి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండడం విస్తు గొలుపుతోంది.  
పూజించే దేవతల పేర్లు పెట్టుకోవడం సహజమే...భారత్‌లో రావణుడిని విలన్‌గా చూడడమే కాదు...దసరా పండగ రోజు ఆయన దిష్టిబొమ్మను కూడా తగులబెడుతుంటారు. అలాంటిది రాజస్థాన్‌ ఓటర్ల జాబితాలో రావణుడి పేరిట 110 మంది ఓటర్లు ఉన్నారు. జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌ ప్రకారం రావణుడి భార్య మండోదరి పేరిట 47 మంది మహిళా ఓటర్లున్నారు. నలుగురు కుంభకర్ణులు, 68 మంది విభీషణులు, 223 మంది మేఘనాథ్‌లు ఉన్నారు. హనుమాన్‌ పేరుతో 64 వేల 637 ఓటర్లున్నారు. సీత పేరుతో లక్షా 90 వేల 77 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రాముడి పేరుతో 12 లక్షల 81 వేల 679 ఓటర్లున్నారు. లక్ష్మణుడి పేరుతో 44 వేల 194 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రావణుడి పేరుతో 24,873 ఓటర్లు, మండోదరి పేరుతో 6,831 ఓటర్లు... రావణుడి సోదరి శుర్పనఖ పేరుతో ఇద్దరు, మంథర పేరుతో 1233, కైకేయి పేరుతో 644 మంది ఓటర్లు ఉండడం గమనార్హం. పురాణ పాత్రల పేరుతో వ్యక్తుల పేర్లు కలిగి ఉండడం విచిత్రమే మరి. 

ఢిల్లీ : అయోధ్యలో రామజన్మ భూమి వివాదం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రం కాబోతోందా? ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఈ సందేహం  రాక మానదు. తరచుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రకటనలు చూస్తుంటేఅదే నిజమనిపిస్తోంది. రామ జన్మభూమి నిర్మాణానికి అంతా సహకరిస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు.

Image result for BHAGAVATH rSS AND UDDAV THAKREదేశంలోనే వివాదాస్పదమైన అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది బీజేపీ. యూపీలో అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అది ఎటూ తేలలేదు. కానీ ఇప్పుడు తాజాగా రానున్న ఎన్నికల్లో మరోసారి రామజన్మ భూమిని అస్త్రంగా ఉపయోగించటానికి బీజేపీ రెడీ అయిపోయింది. దీనిపై ఎన్ని వివర్శలు వచ్చినా రామ జన్మ భూమిలో అయోధ్యను నిర్మించి తీరతామని ప్రకటిస్తు వచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి రామజన్మ భూమి వివాదాన్ని తెరపైకి తెచ్చిన భగవత్ ప్రకటనతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి దూరంగా వున్న శివసేన కూడా ఇదే పంథాను అవలంభిస్తోంది. రామమందిరం నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తోంది. దీనికోసం నవంబర్ 25 అయోధ్యకు వెళతానని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. 

Image result for supreme court ayodhyaమరోవైపు సుప్రీంకోర్టులో బాబ్రి మసీదు, రామ జన్మభూమి కేసులు ఇంకా పెండింగ్ లోనే వున్నాయి. ఈ అంశంపై పలుమార్లు విచారణ కొనసాగుతున్నా ఇంతవరకూ ఎటూ తేలలేదు. దీంతో బాబ్రి మసీదు, రామ జన్మభూమి వివాదాలపై ఎన్నికల ముందు తీర్పు వెలువరించవద్దనీ..అలా చేస్తే అల్లర్లు చెలరేగుతాయని సుప్రీం కోర్టులో పలు పిటీషన్స్ దాఖలైయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం రామ జన్మభూమి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన యత్నిస్తున్నాయి. 

అమృతసర్: దసరా వేడుకల్లో జరిగిన విషాదంతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. దాదాపు 61 మంది మృత్యవాత పడిన ఈ ఘటనలో రావణాసురుడు వేషం వేసిన  నటుడు దల్బీర్ సింగ్ కూడా మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. ఊహించని రీతిలో రైలు దూసుకురావడంతో రైలు పట్టాల మీదనుంచి రావణ దహనం దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు మరణించిన సంగతి తెలిసిందే. 
దల్బీర్ సింగ్ అప్పుడే స్టేజీ మీద తన పాత్ర ముగించి షీల్డ్ తీసుకొనేందుకు ఎదురుచూస్తుండగా రైలు మృత్యరూపంలో తరలివచ్చింది. దల్బీర్‌కు భార్య, 8 సంవత్సరాల కూతురు ఉన్నారు. ప్రతీ సంవత్సరం జరిగే రామ్‌లీల వేడుకల్లో దల్బీర్ పాల్గొనేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

 

మీరట్: కోతులు సృష్టించిన బీభత్సానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక కోతుల గుంపు ఉత్తరప్రదేశ్‌లోని భాగ్ఫట్ జిల్లా టిక్రీ అనే గ్రామానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తిపై రాళ్లు రువ్వడంతో అతను మరణించాడు. 
వివరాల్లోకి వెళితే..  ధర్మపాల్ సింగ్ అనే వ్యక్తి కట్టెలు ఏరుకుంటుండగా.. కోతుల గుంపు అతనిపై ఇటుకలతో దాడి చేశాయి. అక్కడ ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోని ఇటుకలను అందుకొని ధర్మపాల్‌పై విసిరాయి. దీంతో అతని తలపై, గుండెలపై ఇటుకలు తగిలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మరణించాడు. 
దీంతో అతని కుటుంబ సభ్యులు కోతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
ఈ ఫిర్యాదుపై కేసు ఎలా నమోదు చేయాలో తెలియక తికమకపడ్డ పోలీసులు ‘‘యాక్సిడెంట్’’ గా స్టేషన్ డైరీలో రాసి చేతులు దులుపుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన తెలియచేసిన బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. 
కోతుల దండు దాదాపు 20 ఇటుకలను ధర్మపాల్‌పై విసరాయని మృతుని బంధువు కృష్ణపాల్ సింగ్ ఆరోపించారు. కోతుల వల్ల తమ జీవితాలు దుర్భరమవుతున్నా అధికారులు వాటిని తరిమేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
అయితే.. ఇదేం చోద్యం...కోతులపై కేసు ఎలా నమోదు చేయాలని పోలీసులు వాదిస్తున్నారు.  

 

 

మైసూరు: దసరా పేరెత్తగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మైసూరు. ఎందుకంటే భారతదేశంలో మైసూరులో జరిగినంత గొప్పగా దసరా వేడుకలు మరెక్కడా జరగవు. మైసూరు రాజకుటుంబీకుల ఆధ్వర్యంలో నగరంలో విజయ దశమి వేడులకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మైసూరు ప్యాలెస్.. విద్యుద్దీపాలతో ధగధగ మెరిసిపోతుంది. రాజప్రాసాదాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఏనుగుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. దసరా ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు మైసూరు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటాలానే ఈసారి కూడా అందరి చూపు మైసూరుపై ఉంది. ఎప్పుడెప్పుడు ప్యాలెస్‌లో దసరా వేడుకలు చూసి పులకించిపోదామా అని వెయిట్ చేస్తున్నారు. అయితే వారికి ఈసారి నిరాశ తప్పదు. మైసూరు ప్యాలెస్‌లో దసరా వేడుకలు రద్దయ్యాయి. ఇందుకు కారణం మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకోవడమే.

శుక్రవారం ఒకేరోజున ఇద్దరు పెద్దలు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం రాజమాత ప్రమోదాదేవి తల్లి పుట్టచిన్నమ్మణ్ణి (98) కన్నుమూయగా, మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె (ప్రమోదాదేవి వదిన మరదలు) విశాలక్షి దేవి (58) సాయంత్రం వేళ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సంతాప సూచకంగా మైసూర్ ప్యాలెస్‌లో నిర్వహించే దసరా సంబరాలను రద్దు చేశారు.

రాజవంశీయుడు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు సోదరి విశాలాక్షి (58) శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమాత ప్రమోదాదేవికి స్వయానా ఆమె మరదలు (ఆడబిడ్డ). మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె కూడా. శుక్రవారం ఉదయమే ప్రమోదాదేవికి మాతృవియోగం కల్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాలాక్షి మరణంతో ఒడెయరు కుటుంబంలో ఒకేరోజున ఇద్దరు కన్నుమూసినట్లైంది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. వారి మృతిపట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

పంజాబ్: మనిషిలో మానవత్వం కనుమరుగైపోతోంది. పక్కవాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. చావుబతుకుల్లో ఉన్నవారిని కాపాడాల్సింది పోయి సెల్ఫీలు దిగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చూశాం. తాజాగా మరోసారి అలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని జోడా పాఠక్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 61 మంది చనిపోయారు. 70మంది గాయపడ్డారు. అప్పటివరకు రావణ దహన వేడుకలను ఆనందంగా చూస్తున్న వారు.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరవేగంగా దూసుకొచ్చిన జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు తమ పాలిట మృత్యుశకటం అవుతుందని పసిగట్టలేకపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్దినిమిషాల ముందు వరకూ ఉన్న ఆనందాతిరేకాలు ఆవిరయ్యాయి. ఆక్రందనలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది.

కాగా.. రావణ దహన వేడుకలు చూసేందుకు వచ్చిన వారు ప్రాణాలు కోల్పోడానికి అనేక కారణాలు వినిపిస్తున్నా.. అందులో సెల్ఫీల పిచ్చి కూడా ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది. సెల్ఫీల కోసం ప్రజలు పోటీలు పడి రైలు రాకను గమనించకపోవడంతో ప్రాణనష్టం భారీగా ఉందని చెబుతున్నారు. 

ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే.. రైలు ఢీకొడుతున్న దృశ్యాలను కూడా కొందరు సెల్‌ఫోన్లలో బంధించడం. అంతేకాదు, ఆ దృశ్యాలను చిత్రీకరించలేకపోయిన వారు, అవి తీసిన వారి నుంచి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవడం గమనార్హం. ఇక తీవ్రంగా గాయపడి ప్రాణాపాయంలో ఉన్నవారికి సాయం చేయాల్సింది పోయి.. వారితో సెల్ఫీలు దిగారు కొందరు మనసు లేని మనుషులు. ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న వారికి సాయం అందించాల్సింది పోయి వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం మరింత బాధాకరమని స్థానికులు చెబుతున్నారు. 

Image result for punjab train accident selfiesరైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేర్వేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశమే లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో వారి కళ్లకు ఏదీ సరిగా కనిపించలేదు. ఈ అయోమయంలో.. వేగంగా దూసుకొచ్చిన రైలు కిందపడి నలిగిపోయారు.

పంజాబ్‌: అమృత్‌సర్‌లో దసరా పండుగ వేళ చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం పెను విషాదం మిగిల్చింది. రోజంతా దసరా పండుగను వేడుకగా చేసుకొని.. సాయంత్రం రావణ దహనకాండను కళ్లారా చూసేందుకు జనాలు ఉత్సాహంతో వచ్చారు. రావణ దహన వేడుకలను చూస్తూ అప్పటివరకు ఆనందంగా గడుపుతున్న వారిని మృత్యువులా దూసుకొచ్చిన రైలు బలితీసుకుంది. రావణ దహనాన్ని పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ప్రజలపైకి దూసుకొచ్చిన రైలు ఏకంగా 61మంది ప్రాణాలు బలితీసుకుంది. 72మందిని గాయపరిచింది. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్దినిమిషాల ముందు వరకూ ఉన్న ఆనందాతిరేకాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆక్రందనలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని జోడా పాఠక్‌ వద్దచోటు చేసుకున్న ఈ ప్రమాదం అనేక కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది.

కాగా, ఈ ఘోర రైలు ప్రమాదం వెనుక ఉన్న కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. హారన్ కొట్టని రైలు, మైకుల మోత, బాణాసంచా పేలుళ్ల శబ్దం, బాణాసంచా నిప్పురవ్వలు, సెల్ఫీలు.. ఇలా పలు కారణాలు ప్రమాదానికి దారితీసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుంటున్న రైలు కొంచెం కూత పెట్టినా ప్రమాద తీవ్రత తగ్గేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు, రైలు వస్తున్న విషయాన్ని గుర్తించిన కొందరు పక్క ట్రాక్‌పైకి వెళ్లాలని భావించారు. అయితే అటునుంచి మరో రైలు రావడంతో వారికి మరో మార్గం కనిపించలేదని చెబుతున్నారు. అయితే, ఆ రైలు అప్పటికే వెళ్లిపోయిందని మరికొందరు చెబుతున్నారు. కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించారని, అందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

ప్రమాదానికి కారణమైన డీఎంయూ 74943 రైలు ఆ ప్రాంతవాసులకు చిరపరిచతమే. హోషియాపూర్ నుంచి జలంధర్ వెళ్లే ఈ రైలులో చాలామంది స్వర్ణదేవాలయానికి వెళ్తుంటారు. ఈ రైలు సమయం అందరికీ తెలుసు. సాయంత్రం 6:50 గంటలకు జోడాపాఠక్‌కు చేరుకుంటుంది. అయితే, దసరా రోజున రైళ్లు ఈ ప్రాంతం గుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. దీంతో జనాలు భయం లేకుండా ట్రాక్‌లు దాటుతుంటారు. ప్రమాద సమయంలో మైకుల్లో పాటలు హోరెత్తుతుండడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు.

రావణ దహనం సందర్భంగా బాణాసంచా నిప్పు రవ్వలు ఎగిరి పడుతుండడంతో అందరూ దూరంగా జరిగి పట్టాలపైకి చేరుకున్నారు. మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ బిజీ అయిపోయారు. బాణసంచా పేలుడు తప్ప వారికి రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు. మరోవైపు రైలు కూడా హారన్ మోగించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఊహించని విధంగా 15 సెకన్ల వ్యవధిలోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది.

రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేర్వేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో వారి కళ్లకు ఏదీ సరిగా కనిపించలేదు. ఈ అయోమయంలో.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు.

ఈ దుర్ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన చిన్నారిని కోల్పోయిన ఓ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కాగా, పండుగ సమయంలో ఆ ప్రాంతంలో రైళ్లను నెమ్మదిగా నడపాలని తాము అధికారులను, స్థానిక నేతలను ఎప్పటి నుంచో కోరుతున్నామని, అయినా ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. బాణసంచా పేలుడు మోతలో రైలు చప్పుడు తమకు వినిపించలేదని మరో వ్యక్తి చెప్పాడు. డ్రైవర్‌ హారన్‌ కొట్టలేదని ఆరోపించారు.

కేరళ: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు కవితతో పాటు సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమా, మేరీ స్వీటీ అనే ముగ్గురు మహిళలు ఇవాళ శబరిమల ఆలయానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గుర్భగుడి వద్ద ఉన్న 18 మెట్లకు 500 మీటర్ల దూరం వరకు వారు చేరుకున్నారు. అయితే భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారి ముందుకు పోలేకపోయారు. పోలీసుల సూచనల మేరకు వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో శబరిమల దేవస్థానం అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ అధికారులకు పందళ ప్యాలెస్ ట్రస్ట్ లేఖ రాసింది. ఒకవేళ ఆలయ ఆచారాలకు ఎలాంటి భంగమైనా వాటిల్లి ఉంటే వెంటనే తలుపులు మూసేయాలని లేఖలో కోరింది. ప్రధాన అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాతే ఆలయాన్ని మళ్లీ తెరవాలని సూచించింది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, రాజకుటుంబీకులు ఈనెల 12న శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

కాగా, గర్భగుడిలోకి వెళ్లే 18 మెట్ల దారి సమీపం వరకు వెళ్లడం చాలా గర్వంగా ఉందని ఆ ముగ్గురు మహిళలు పేర్కొన్నారు.

ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. శతాబ్ది ఉత్సవాల స్మారకంగా వెండి నాణేన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 

షిర్డి సాయిబాబా సందేశాలు మానవాళికి ప్రేరణగా నిలిచాయని ప్రధాని మోదీ అన్నారు. బాబా బోధించిన విశ్వాసం, సహన సూత్రాలు మానవాళిని ఆకట్టుకున్నాయన్నారు. విశ్వాసం, సహనంపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ప్రేరణగా నిలిచాయన్నారు. సమానత్వానికి షిర్డి సాక్ష్యంగా నిలుస్తుందని, అన్ని మతాలకు చెందిన ప్రజలు బాబా ముందు వంగి నమస్కరిస్తారని ప్రధాని అన్నారు. సాయిబాబా బోధించిన సబ్ కా మాలిక్ ఏక్‌హై అన్న సూత్రం ప్రపంచ శాంతికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. అనంతరం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను మోదీ అందజేశారు.

పంజాబ్: అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో 50మందికి పైగా దుర్మరణం చెందారు. దసరా వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ వద్ద రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని పట్టాలపై నుంచుని వీక్షిస్తున్నారు. అదే సమయంలో రైలు రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రావణ దహనంలో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకెళ్లింది.  సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రైలు పఠాన్‌కోట్‌ నుంచి అమృత్‌సర్‌ వెళుతోంది.

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యువాత పడటంతో బంధువుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్ధరిల్లింది.

కాగా, ఈ ప్రమాదానికి నిర్వాహకులు నిర్లక్ష్యమే కారణం అని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదన్నారు. రైలు వస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు రైలును నిలివేయడమో లేదా వేగం తగ్గించమని చెప్పడమో చేయాల్సిందని అంటున్నారు. ఘటన జరిగే సమయంలో రైల్వే ట్రాక్‌పై 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేరళ: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి మహిళలు రాకుండా ఆందోళనకారులు ఇవాళ కూడా అడ్డుకున్నారు. దీంతో శబరిమల కొండపైకి వెళ్లాలని అనుకున్న తెలుగు మహిళా జర్నలిస్టు కవిత, సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా మధ్యలోనే వెనుదిరిగారు. వారి ప్రయత్నం ఫలించలేదు. ఆలయానికి 500 మీటర్ల దూరంలో వారు ఆగిపోయారు. భక్తుల నిరసనల మధ్య హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు, సామాజిక కార్యకర్తకు రక్షణగా వెళ్లిన పోలీసులు ముందుకు వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కొండపైకి వెళ్లకుండానే వారిద్దరూ వెనుదిరిగారు. 

ఇవాళ ఉదయం వీరిద్దరూ సుమారు 300 మంది పోలీసుల భద్రత మధ్య కొండపైకి బయల్దేరారు. జర్నలిస్టుకు తాము ధరించిన ప్రత్యేక దుస్తులను, బులెట్ ఫ్రూఫ్ జాకెట్‌ను, హెల్మెట్‌ను ఇచ్చిన పోలీసులు, ఆమెకు జాగ్రత్తలు చెబుతూ ముందుకు తీసుకెళ్లారు. పంబ నుంచి 4.6 కిలోమీటర్ల దూరంలో పర్వత మార్గంలో ఆలయం ఉంది. సన్నిధానానికి అర కి.మీ. దూరంలో ఇద్దరు మహిళలను ఆపారు. కొండమీదకు చేరుకున్నాక గర్భాలయానికి వెళ్లి అయ్యప్పను దర్శించుకునే ముందు.. పదునెట్టాంబడి అని పిలిచే 18 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఈ 18 మెట్లు ఎక్కితేనే అయ్యప్పను దర్శించుకోవచ్చు. ఈ ఇద్దరు మహిళల విషయంలో అది జరగలేదు. ఓ వైపు వేలాది మంది ఆందోళనకారుల బెదిరింపులు, మరోవైపు ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేస్తామని ప్రధాన తాంత్రీ ప్రకటించారు. తామందరినీ చంపేసి ముందుకు వెళ్లాలని భక్తులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు సైతం చేసేదేమి లేకపోయింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ద్వారం దగ్గరి దాకా వెళ్లిన కవిత సహా మరో మహిళ వెనక్కి తిరగక తప్పలేదు. 

శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న ప్రయత్నాన్ని కవిత విరమించుకోవడంతో.. పూజారులు నిరసనను విరమించి యథావిధిగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆలయ తలుపులు మూసివేశారన్న ప్రచారంలో నిజం లేదని.. రోజువారీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు గురువారం రాత్రి నుంచే కవిత సన్నద్దమయ్యారు. కేరళ ప్రభుత్వం కల్పించిన భద్రత నడుమ ఈ ఉదయం 6గంటలకు ఆమె కొండపైకి బయలుదేరారు. భక్తుల నిరసనలు, హిందూ సంఘాల ఆందోళనల నడుమ ఆలయ ద్వారం దగ్గరిదాకా వెళ్లారు. అయితే ప్రధాన పూజారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం.. ఆలయ ద్వారాన్ని మూసిస్తానని హెచ్చరించడంతో పోలీసులు సైతం పునరాలోచనలో పడ్డారు. ఇంకా ముందుకు కదిలితే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయాందోళనతో తమ ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు మహిళలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అయ్యప్ప భక్తులు.. ఎట్టిపరిస్థితుల్లో ఆలయంలోకి మహిళలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.

కేరళ : శబరిమలలో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఆలయాన్ని తెరిచి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క మహిళ కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోలేకపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇదిలా ఉంటే తెలుగు మహిళా జర్నలిస్టు జుక్కాల కవిత స్వామిని దర్శించుకొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసుల సహాయంతో ఆమె ఆలయ సన్నిధానం వరకు చేరుకున్నట్లు, ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ ఆమె మాత్రం ఆలయంవైపుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దీనితో టెన్షన్ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ ఉన్నా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. 
10-50 ఏళ్ల వయస్సు గల మహిళలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. పంబ బేస్ క్యాంపు నుండి ఆలయం వరకు భక్తుల రూపంలో ఆందోళనకారులు మోహరించారు. ఇదిలా ఉంటే ట్రావెల్ బోర్టు సమావేశం కానుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనలకు గురిచేసే ఈ తీర్పుతో న్యాయానికి పాతర వేసిందంటూ పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఒడిషా : మనసు చలించే ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం కోసం ఏడేళ్ల కూతురి మృతదేహాన్ని 8 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. గజపతి జిల్లా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని అతంక్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
ముకుంద్‌ దొర ఏడేళ్ల కూతురు బబిత ఈనెల 11 నుంచి కనిపించకుండాపోయింది. అయితే కొండచరియలు విరిగిపడి బబిత మరణించిందని అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి ఫొటోలు తీసుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. అసలే తిత్లీ తుపాన్‌ ధాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్‌ కుటుంబం.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇక చేసేది ఏమీ లేక ముకుంద్‌... బబిత మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు. అలా 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత కొందరు విషయం ఆరా తీశారు. 
డెడ్‌బాడీని వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో నడుచుకుంటూ తీసుకెళ్తున్నానని ముకుంద్‌ తెలిపాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు వాహనం ఏర్పాటు చేసి డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. 
ఇలాంటి ఘటనే 2016లో కాలింది జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్లు దూరం నడిచిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. గ్రామాల్లో కనీస వసతులు లేక.. జనం పడుతున్న ఇబ్బందులకు ఇవన్నీ నిదర్శనమని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. 

ఢిల్లీ : అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ప్రారంభించింది బీజేపీ. ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఇక తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఎంపిక చేసిన రాష్ట్ర నేతలు అధిష్టానానికి జాబితా అందించనున్నారు. శనివారం అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం కానుంది. తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అందులో ఆరు స్థానాల్లోని అభ్యర్థుల పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మిగతా స్థానాలపై ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసి.. అధిష్టానానికి అందించనుంది. ఈ జాబితా ప్రకారం బీజేపీ శనివారం అభ్యర్థులను ప్రకటించనుంది. 
మరోవైపు రాష్ట్రంలో 15 మంది సభ్యులతో ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిటీలో ఖైరతాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చోటు లభించలేదు. దీంతో ఈ అంశం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. వీరిద్దరికి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెబుతారా ? లేదా మిన్నకుండిపోతారా ? అనేది సందిగ్ధంగా మారింది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఖమ్మం : మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలీసులే టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యేను దారుణ హత్య చేసిన అనంతరం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కానీ పోలీసులపై పైచేయి సాధించేందుకు మావోయిస్టులు కూడా పలు చర్యలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో మావోస్టులు రెచ్చిపోయారు. దంతెవాడలో ల్యాండ్ మైన్ను పేల్చివేశారు. ఐటీబీటీ 44 బెటాలియన్‌కు చెందిన 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

 

కేరళ : శబరిమలలో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది. చినికిచినికి గాలి వానలా మారిన చందంగా ఈవివాదం కాస్తా. రాజకీయ రంగుపులుముకుంది. ఆరెస్సెస్‌, సంఘ్‌పరివార్‌ వల్లే సమస్య జఠిలంగా మారిందని ఆరోపించారు కేరళ సీఎం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శబరిమలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి నిరసనగా  భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది.  ఆరెస్సెస్‌, సంఘ్‌పరివార్‌ వల్లే సమస్య జఠిలంగా మారిందని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. కులం, ఫ్యూడల్‌ భావజాలానికి ప్రేరేపితులు కావడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయన్నారు కేరళ సీఎం. 
ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంప్రదాయాలు కాపాడడం కోసం ఆందోళన చేసి తీరుతామని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ప్రకటించాయి. ఆందోళకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ బెహరా తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనలకు గురిచేసే ఈ తీర్పుతో న్యాయానికి పాతర వేసిందంటూ పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు రక్షణ కల్పించాలని సూచిస్తూ జాతీయ మహిళాకమిషన్‌.. కేరళ డీజీపీకి లేఖ రాసింది. మహిళలను అడ్డుకుంటున్న వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కోరింది. 

Pages

Don't Miss