National News

కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకోటానికి ఈ తెల్లవారుఝూమున వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అయ్యప్ప భక్తుల నిరసనల మధ్య శబరిమల వెళ్లకుండానే వెనుతిరిగారు. దాదాపు 16 గంటల పాటు అయ్యప్పస్వామి భక్తుల నుంచి ఆమె నిరసనలు ఎదుర్కొన్నారు. కొచ్చి విమనాశ్రయం నుంచి ఆమె బయటకు రాకుండా భక్తులు విమానాశ్రయాన్ని నిర్భందించారు. దీంతో ఆమె వేరే మార్గం ద్వారా వెళ్లాలని ప్రయత్నించినా అదీ విఫలమైంది. దీంతో పోలీసులు ఆమెను వెనక్కు తిరిగి వెళ్లిపోవల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేయగా చివరకు ఆమె వెనక్కు వెళ్ళటానికి ఒప్పుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించి ఆందోళన చేసినందుకు గాను పోలీసులు 215 మందిపై కేసులు నమోదు చేశారు. కేరళలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే పూణేకు తిరిగి వెళుతున్నట్లు ఆమె చెప్పారు. 

శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామివారి ఆలయం ఈసాయంత్రం తెరిచారు. మండల - మకరవిళక్కు పూజల కోసం, నేటి నుంచి 62 రోజులపాటు స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శనం  కల్పిస్తారు. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సెప్టెంబరు 28న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోవటం ఇది మూడవ సారి. 
నేటి నుంచి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం వరకు ఆలయం తెరచి ఉంచుతారు. ఈ 2నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు దీక్షతో నియమాలు పాటించి స్వామి దర్శనానికి విచ్చేస్తారు. శబరిమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవస్ధానం అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళా భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నీలక్కల్, పంబ, సన్నిధానంతో సహా శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దాదాపు 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. వారిలో 860 మంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు. 
కాగా......శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోటానికి ఆరుగురు మహిళలతో శుక్రవారం  కొచ్చిన్ వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ను  అయ్యప్ప భక్తులు  ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.  వేరే మార్గం ద్వారా  వెళ్లాలని ఆమె  శబరిమల వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ భక్తులు అడ్డుకోవడంతో ఒక దశలో ఆమె సహనాన్ని కోల్పోయారు.  ఈ తెల్లవారుఝూము గం.4-40 నుంచి ఆమె  ఎయిర్ పోర్టులోనే చిక్కుకునిపోయారు. ఆమెను తిరిగి వెళ్లమని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుగుతున్నాయి.

ఢిల్లీ : సీబీఐలో వివాదాస్పదంగా తయారైన అవినీతి భాగోతం సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో అభిమానం. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి అలోక్ వర్మ తనకు తెలుసని, ఎంతో నిజాయతీ పరుడైన ఆయనకు అన్యాయం జరిగిందని సుబ్రహణ్యస్వామి పేర్కొన్నారు.  అలోక్ వర్మపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో  సుప్రీంకోర్టు ఆయనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

న్యూఢిల్లీ: అర్థాంతరంగా అండమాన్‌కు ట్రాన్సఫర్ చేశారని తన ట్రాన్సఫర్ నిలుపుదలచేయాలని కోర్టుకెక్కిన సీబీఐ అధికారికి సుప్రీంకోర్టు నుండి ఊరట లభించకపోగా.. ‘‘ ఏ ఊరు ట్రాన్సఫర్ చేశారు? అండమాన్ అయితే చాలా మంచి ప్లేస్ కొన్నిరోజులు అక్కడే ఉండండి’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సీబీఐ అధికారి ఏ కే బస్సీ లాయర్‌ను ఉద్దేశించి శుక్రవారం (నవంబర్ 16) వ్యాఖ్యానించారు. 
రాత్రికి రాత్రి తనను అండమాన్‌కు ట్రాన్సఫర్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ అధికారి ఏకే బస్సీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బస్సీతోపాటు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే దాఖలు చేసిన పిటీషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మను బలవంతంగా బదిలీ చేయాటాన్ని ప్రశ్నిస్తూ ఖర్గే పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐలో రెండో ర్యాంకు ఆఫీసర్ రాకేష్ అస్తానా అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్న సీబీఐ బృందంలో సభ్యుడైన బస్సీను కూడా గతనెల 23న అలోక్ వర్మతో పాటు కేంద్రం బదిలీ చేసిన సంగతి విదితమే. 
 

 

ఢిల్లీ: " గజ " తుపాను వల్ల నష్టపోయిన తమిళనాడును కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ.కే.పళని స్వామితో మాట్లాడి పరిస్ధితి తెలుసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్ధితి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడాల్సిందిగా ఆయన హోంశాఖ కార్యదర్శికి కూడా సూచించారు. 
కాగా....ఈతెల్లవారు ఝూమున తమిళనాడులోని నాగపట్నం-వేదారణ్యం మధ్య "గజ" తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  సహాయక చర్యల కోసం 2500 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాగపట్నం, కడలూరుల్లో సహాచక చర్యల్లో పాల్గోంటున్నాయి. బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహరం సరఫరా చేస్తున్నారు. సముద్రతీరంలో తూర్పు నావికాదళం యుధ్దనౌకలను, హెలికాప్టర్లను సిధ్దంగా ఉంచింది. 

పశ్చిమబెంగాల్ : ఇటీవల కాలంలో ఏపీలో పలు ప్రాంతాలలో సీబీఐ హఠాత్తుగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రవేశాన్ని కట్టడి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు బాటలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని... తదుపరి చర్యలను త్వరలోనే తీసుకుంటామని మమతా  స్పష్టం చేశారు. రాష్ట్రాల పరిధిలో కేంద్రం తప్పుడు వైఖరిని అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తోందనీ..ఈ క్రమంలోనే కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ కుతంత్రాల వల్ల దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మాదిరే తమ రాష్ట్రంలో కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యత్నిస్తున్నామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కాగా ఏపీలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 

 

చెన్నై: తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తుపాను తీవ్ర ప్రభాన్ని చూపిస్తోంది. పుదుకోటైలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. కారైక్కాల్‌లో విద్యుద్ఘాతానికి గురై మరొకరు మృతి చెందారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు.
438 పునరావాస కేంద్రాలకు 76,290 మంది తరలింపు 
22 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. 438 పునరావాస కేంద్రాలకు 76,290 మందిని తరలించారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 3 గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద ప్రాంతాలలో సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. తంజావూరు, తిరుచ్చి జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఉంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. 
చిత్తూరు జిల్లాపైనా కూడా గజ తుపాను ప్రభావం 
మరోవైపు చిత్తూరు జిల్లాపై కూడా గజ తుపాను ప్రభావం చూపింది. రాత్రి నుంచి జిల్లాలో చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుంది. తూర్పు వైపు ఉన్న 25 మండలాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుంది. విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించారు. ఇప్పటికే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

 

తమిళనాడు : గజ బీభత్సం సృష్టిస్తోంది. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో హృదయవిదారక దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. నాగప్నటం..వేదారణ్యం మధ్య తీవ్ర తుపాను తీరం దాటింది. పశ్చిమ దిశగా తుపాను గజ గమనం సాగిస్తోంది. తీరం దాటగానే తన ప్రతాపం చూపెట్టింది. విపరీతమైన గాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. ఇళ్లు సైతం పేకమేడల్లా కూలిపోయాయి.

#CycloneGaja | Heavy damage in #Karaikal. Several houses in coastal areas damaged. Power supply completely disrupted. Hundreds of people shifted to relief camps. https://t.co/m6F25EHnrY pic.twitter.com/mIc0tXjdYy

— The Hindu (@the_hindu) November 16, 2018

విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు చోట్ల అంధకారం నెలకొంది. నాగపట్నంతో పాటు కడలూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కారైకల్, తిరువారూరు, పుదుక్కొట్టై తదితర ప్రాంతాల్లో పాటు ఏడు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతూ ఉంది. గజ తుపాన్ తో ఇప్పటి వరకు 8మంది మృతి చెందారు. పుదుకోటైలో ఇల్లు కూలి నలుగురు మృత్యువాత పడ్డారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణకు చర్యలు చేపట్టింది. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వివిధ చోట్ల నేలకూలిన విద్యుత్ స్థంభాలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 
> నాగపట్నానికి తెగిన రవాణా సంబంధాలు.
తిరుచ్చి విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత. 
> 22 జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 
> 76, 290 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
నాగపట్నం రైల్వే స్టేషన్ పూర్తిగా ధ్వంసం.
చిత్తూరు జిల్లాలోని 25 మండలాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆయా మండలాల్లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

కేరళ : రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము అయ్యప్పను దర్శంచుకుని తీరుతామని మహిళలు..అడ్డుకుంటామని కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరోసారి టెన్షన్..టెన్షన్..వాతావరణం నెలకొంది. తాజాగా భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమల ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళ్లారు. ఆమెతో పాటు భారీగా మహిళలు కూడా ఉన్నారు. కొచ్చి ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 
ఎయిర్ పోర్టు బయట భారీగా పోలీసులు మోహరించారు. వారితో పాటు ఆమెను అడ్డుకొనేందుకు భారీగా పలు సంఘాల నేతలు చేరుకున్నారు. అయ్యప్ప పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు. తాను మాత్రం శబరిమల ఆలయాకి వెళ్లి తీరుతానని, తనకు భద్రత కల్పించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
  • సుప్రీం తీర్పును అమలు చేస్తామని..అందుకగనుగుణంగా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకొంది.
  • హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. ర్యాలీలు..ఆందోళనలతో అట్టుడికించాయి.
  • కొన్ని రోజుల పాటు ఆలయాన్ని తెరిచినా మహిళలు దర్శించుకోలేకపోయారు.

మరి ఈసారైనా మహిళలు దర్శించుకుంటారా ? సుప్రీం తీర్పు అమలవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

విశాఖ : గజ తుపాను తీరం దాటింది. నాగప్నటం..వేదారణ్యం మధ్య తీవ్ర తుపాను తీరం దాటింది. తుపాను తీరం దాటిన సమయంలో బలమైన గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు గజ తుపాన్‌‌తో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

పాట్నా: ‘‘నా పక్కింటాయన నామీద నిఘా పెట్టాడు..కావాలంటే చూడండి ఆయన ఇంటిచుట్టూ ఉన్న సీసీటీవీ కెమేరాలు అన్ని మా ఇంటివైపే వీడియో తీస్తున్నాయి...’’ అంటూ లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. ఈ విషయంపై పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సీఎంపై విరుచుకుపడుతున్నాడు ఒకప్పడి డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. 
‘‘నితీష్‌కు అభద్రతాభావం పెరిగిపోతోంది.. ఆయనను మృత్యుభయం వెంటాడుతోంది.  చిరాకులు, అపోహలతో అలమటిస్తూ సీసీటీవీ కెమేరాలు ఆయన/నా ప్రహరీగోడ చుట్టూ పెట్టించుకొని నా మీద నిఘా పెంచారు. అసలు ముఖ్యమంత్రికి కెమేరాలు ఎందుకు.. ఆయన భవంతి చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు చెక్‌పోస్టులు, భద్రతా సిబ్బంది ఉండగా..’’ అంటూ తేజస్వీ యాదవ్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
 తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయనకు 5 సర్కులర్ రోడ్‌లో బంగళాను కేటాయించారు. ఆ తర్వాత మహాకూటమి నుంచి నితీష్ కుమార్ తప్పుకొని బీజేపీ మద్ధతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్నారు. ఆ బంగళా ఖాళీ చేయమని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా తేజస్వీ యాదవ్ చేయకుండా సీఎం నితీష్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. పక్క పక్కనే ఇద్దరి బంగళాలు ఉండటంతో విమర్శలు గుప్పిస్తూ తాజాగా  ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చాడు తేజస్వీ యాదవ్. తన ట్విట్టర్ పోస్టులో కొన్ని ఫొటోలను సైతం జతచేయడం గమనార్హం. 
 

ఢిల్లీ : భారతదేశంలో ఉన్న 125 కోట్ల మంది ప్రజలకు రాముడి పేరు పెట్టాలని పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ పేర్కొన్నారు. నగరాల పేర్లను మార్చడంపై ఆయనపై విధంగా స్పందించారు. ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్, ఫైజాబాద్ పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ గురువారం హార్థిక్ పటేల్ మీడియాతో మాట్లాడారు. నగరాలకు పేర్లు మారిస్తే సమస్య తీరుతుందని భావిస్తే భారతీయులందరికీ రాముడి పేరు పెట్టాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య..రౌైతుల సమస్య ప్రధానంగా ఉంటే కేంద్రం మాత్రం నగర పేర్లను మార్చుకుంటూ..విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తూ బిజీగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. 
ఇటీవలే అయోధ్య దీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చుతున్నట్టు...వెల్లడించారు. సరిగ్గా ఇది జరిగిన కొద్ది రోజులకే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చేశారు. అంతేగాకుండా ముజఫర్ నగర్, అహ్మదాబాద్ పేర్లను కూడా మార్చేయాలని డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాషాయ దళం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

బెంగళూరు: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, గోవధ నియంత్రణకు, గోవుల ఆరోగ్యం కోసం, అవి ఎక్కడున్నా సులభంగా గుర్తించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చిప్‌ల పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే జీపీఎస్ ఆధారిత డిజిటల్‌ చిప్‌లను అమర్చనుంది. ఒక్కో చిప్ ఖరీదు ఆరు రూపాయలు. 
ఆవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్‌ చిప్‌లు ఉపయోగపడుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. చిప్‌ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చని చెప్పింది. ఇకపై తమ పశువులు తప్పిపోతాయనే ఆందోళన యజమానులు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. పశువుల అక్రమ రవాణా, వధకు డిజిటల్ చిప్‌ చెక్ పెడుతుందని అధికారుల నమ్మకం. అంతేగాక, గోవుల ఆర్యోగం గురించిన వివరాలు కూడా చిప్‌లు అందిస్తాయని పేర్కొంది. ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబర్‌, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. రాష్ట్రంలో 71లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, లక్షా 30వేల పశువులు ఉన్నాయి. ఇప్పటికే 56లక్షల పశువుల చెవుల్లో డిజిటల్ చిప్‌లను అమర్చినట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తెలిపారు.

చెన్నై: గజ తుఫాన్ దూసుకొస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తోంది. ప్ర‌స్తుతం నాగ‌ప‌ట్ట‌ణానికి ఈశాన్యంలో 240 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉన్న‌ తుఫాన్ క్రమేపీ తీరం వైపు దూసుకువ‌స్తోంది. గురువారం సాయంత్రం(15వ తేదీ) పంబ‌న్-క‌డ‌లూర్ మ‌ధ్య గజ తుఫాన్ తీరం దాటుతుందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే తీరం వెంబడి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ సమీపించే సమయానికి గాలుల తీవ్రత సుమారు 90 నుంచి వంద కిలోమీట‌ర్ల వేగానికి పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పంబన్-కడలూరు మధ్య తుఫాన్ తీరం దాటనుండటంతో ఆ ప్రాంతాల్లో అధిక ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కడలూరు జిల్లా కలెక్టర్, విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. గజ తుఫాన్ తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని కడలూరు, నాగపట్నం, పుదక్కోట, తంజావూరు, తిరువారూరు, కారైకాల్‌, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎనిమిది జిల్లాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతేకాకుండా మధురై, రామేశ్వరం వైపు వెళ్లే పలు రైళ్లును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
తుఫాన్ తీరానికి చేరువయ్యే సమయంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గజ తూఫాన్‌ కారణంగా బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరగడంతో నెల్లూరు జిల్లాలోని మైపాడు, కోడూరుపాడు, తుమ్మలపెంలోకి సముద్ర అలలు చొచ్చుకొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు జిల్లాలోని 30మండలాల్లో కూడా గజ తుపాన్‌ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై అంతగా కనిపించబోదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు.

కర్ణాటక : మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డికి ప్రాణహాని వుందనీ..తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తనకు సబంధం లేని కేసుల్లో తనను ఇరికించటమే కాక తననకు భయాందోళనలకు గురిచేసేందుకు కుట్ర జరుగుతోందని గాలి ఆరోపించారు. అంబిడెంట్ కేసులో నాలుగు రోజులుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు..కర్ణాటక రాష్ట్రంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని... తనకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. 
రాజకీయ దురుద్ధేశంతోనే కేసుల్లో ఇరికిస్తున్నారు : గాలి 
 అంబిడెంట్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని చివరకు న్యాయమే గెలుస్తుందని గాలి ధీమా వ్యక్తంచేశారు. తనపై వున్న అన్ని కేసుల నుంచి ఏడాదిలోగా విముక్తి పొందుతానన్న ఆశాభావాన్ని గాలి వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు వేయించి ముఖ్యమంత్రి కుమారస్వామి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ రాక్షస నవ్వు ఎంతో కాలం ఉండదని చెప్పారు.

 

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖమంత్రి మేనకా గాంధీ కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. క్యాజువల్ ఎనౌన్సర్లుగా పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా తక్షణమే విచారణ జరిపించాలని మంత్రిని మేనకా గాంధీ కోరారు. 
దీనికి సంబంధించిన ఒక వార్తా క్లిప్పింగ్‌ను కూడా మంత్రి జతచేశారు. ఈ వేధింపులు ఢిల్లీలొనే కాక పలు ఆల్ ఇండియా రేడియోలోని వివిధ కేంద్రాల్లో చోటు చేసుకుంటున్నాయని మేనకా గాంధీ తెలిపారు. ఎవరైన మహిళ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే.. ఒక బాధ్యత కలిగిన సంస్థలో పనిచేస్తున్న మహిళలకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. వారు పర్మినెంట్ ఉద్యోగా.. లేదా తాత్కాలిక ఉద్యోగా అన్న తారతమ్యాలు చూపకూడదని మేనకా గాంధీ ఈ లేఖలో కోరారు.
 

 

ఢిల్లీ : ‘టూ మినిట్స్ ’ అంటు మార్కెట్ లోకి దూసుకొచ్చి చిన్నారులనే కాదు పెద్దవారికి కూడా అత్యంత ప్రీతిపాత్రంగా మారిపోయింది నెస్లే ఇండియా ప్రవేశపెట్టిన  ‘మ్యాగీ’ నూడుల్స్. మ్యాగీ  ఈ మాట వింటే చాలు చిన్నారులకే కాదు పెద్దవారికి కూడా నోరు ఊరిపోతుంది. ఆ రుచిని అప్పుడు తింటున్న ఫీలింగ్ కలుగుతుంది. పెద్దగా శ్రమ పడనక్కరలేదు. టూ మినిట్స్. జస్ట్ టూ మినిట్స్ వెయిట్ చేస్తే చాలు ప్లేట్ లో పొగలు కక్కే డిఫరెంట్ రుచితో నోరూరించే ఆహారం మ్యాగీ నూడుల్స్ రెడీ అయిపోతాయి. ఆకర్షించే రంగు, ఆస్వాదించే రుచి మ్యాగీ సొంతం. అటుంటి మ్యాగీ అభిమానులకు, వినియోగదారులకు ఓ చక్కటి అవకాశాన్ని కల్పించింది. అదే 10 మ్యాగీ రేపర్స్ రిటర్న్' ఆఫర్. చిట్టి ప్యాకెట్ తో  గట్టి సందేశం ఇస్తోంది నెస్లే ఇండియా కంపెనీ.
Related image'మ్యాగీ రేపర్స్ రిటర్న్' ప్రోగ్రామ్..
నెస్లే ఇండియా ఒక 'మ్యాగీ రేపర్స్ రిటర్న్' కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీనిలో వినియోగదారులు మాగీ యొక్క ఉచిత ప్యాకెట్ పొందవచ్చు. మ్యాగీ నూడిల్ కస్టమర్ల యొక్క ప్రతి పది ఖాళీ రేప్ల కోసం వారు ఉచిత మాగీ నూడుల్స్ ప్యాకెట్ పొందవచ్చంటోంది నెస్లే ఇండియా. 
దేశంలోనే అతి పెద్ద ఆహారం సంస్థ నెస్టే ఇండియా..
ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టడానికి దేశంలోని అతిపెద్ద ఆహార సంస్థ అయిన నెస్లే ఇండియా, 'మాగ్జిబి ర్యాపర్స్ రిటర్న్' కార్యక్రమం ప్రారంభించింది, దీనిలో వినియోగదారులు మాగీ యొక్క ఉచిత ప్యాకెట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రకారం, మ్యాగీ  నూడిల్ కస్టమర్ల యొక్క ప్రతి 10 ఖాళీ రేపర్స్  కోసం వారు ఉచిత మాగీ నూడుల్స్ ప్యాకెట్ పొందవచ్చు. డెహ్రాడూన్, ముస్సోరీలలో ఈ ప్రాజెక్టు నడుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాల్లో ఈ చర్య ఒకటి అని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు. ఇంకే ముంది? మ్యాగీ ప్రియులకు ఇది శుభవార్తే. ఇంకెందుకు ఆలస్యం మ్యగీ ప్యాకెట్స్ రేపర్స్ పట్టికెళ్లండి..మీకిష్టమైన నోరూరించే మ్యాగీ ప్యాకెట్స్ ను తెచ్చేసుకోండి. చిన్నారులకు టూ మినిట్స్ లో వండిపెట్టేయండి..

ఢిల్లీ : ఎయిరిండియా విమానంలో మద్యం సేవించిన ఐరిష్‌‌కు చెందిన ఓ మహిళ గొడవ చేసింది. ఇంకా వైన్‌ కావాలని కోరగా, సిబ్బంది నిరాకరించినందుకు విమాన సిబ్బందిని ఆమె దుర్భాషలాడుతూ రచ్చ రచ్చ చేసింది. గత శనివారం ముంబయి నుంచి లండన్‌ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఐరిష్‌ మహిళ సిబ్బందితో గొడవ పడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సిబ్బందిపై అరుస్తూ చాలా అభ్యంతరకరంగా తిట్టడమే కాకుండా వారిపై ఉమ్మినట్లు తెలుస్తోంది.

ఆమె విమానంలో రచ్చ చేస్తుండగా సిబ్బందిలో ఒకరు మొబైల్‌లో వీడియో తీశారు. సదరు మహిళ ఇష్టం వచ్చినట్లు తిడుతుండగా సిబ్బంది మాత్రం ఏమీ అనకుండా నిలబడి ఉన్నారు. ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాను అంతర్జాతీయ క్రిమినల్‌ లాయర్‌ను అని, బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుల పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా, గ్లాస్‌ వైన్‌ అడిగితే ఇవ్వరా అని, రోహింగ్యాలు, ఆసియా ప్రజలు అని జాతి వివక్షతో కూడా తిడుతూ గట్టి గట్టిగా అరిచారు. ఆమె వైన్‌ బాటిల్‌ కావాలని అడిగేప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నారని, ఈ విషయాన్ని పైలట్‌కు చెప్పగా ఆమెకు ఇక ఎలాంటి డ్రింక్స్‌ ఇవ్వొద్దని చెప్పారని సిబ్బంది వెల్లడించారు. అయితే విమానం లండన్‌లో దిగిన తర్వాత ఆ మహిళను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

బెంగళూరు : నార్త్ - సౌత్ తేడా ఏంటో.. బీజేపీకి పోటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటోంది జేడీఎస్ పార్టీ. కర్ణాటక సీఎం కుమారస్వామి పార్టీ అయిన జనతాదళ్ సంచలన నిర్ణయం తీసుకున్నది. గుజరాత్‌లోని పటేల్ విగ్రహానికి పోటీగా పెద్ద విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. కావేరీ నది ఒడ్డున.. కావేరీ నది తల్లిని ప్రతిష్టించటానికి రంగం సిద్ధం చేసింది. ఈ విగ్రహం విశేషాలు ఏంటో చూద్దాం...
> ఏర్పాటు ఎక్కడ : మాంఢ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్ రిజర్వాయర్‌లో
> ఎత్తు : 350 అడుగులతో కావేరీ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. 
> రూపం : తల్లి రూపంలో.. నీటిని పోస్తున్నట్లు ఉంటుంది.
> ఖర్చు : రూ.2వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.
> ప్రాజెక్ట్ : జైపూర్ కు చెందిన ఓ కంపెనీ చేపట్టనుంది.
> ఎప్పుడు ప్రారంభం : డిసెంబర్ లో ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుంది. 2019 జనవరి నుంచి పనులు ప్రారంభం అవుతాయి. రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కావేరీ తల్లి విగ్రహం ఎందుకంటే?
కర్నాటక వాసులకు కావేరీ నదితో విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడు - కర్నాటక మధ్య నీటి పంపిణీ విషయంలో నిత్యం సెంటిమెంట్‌ను రాజేస్తూ ఉంటుంది కావేరీ నది. కావేరీ నదిలోని నీటితోనే కర్నాటకలోని మాంఢ్య ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. బంగారు పంటలు పండుతాయి. ఏపీలో కోనసీమ తరహాలో ఉంటుందీ కావేరీ నదీ పరివాహక ప్రాంతం. కర్నాటకలోని ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చినవారే. బడా పారిశ్రామికవేత్తలు కూడా కావేరీ నది పరివాహక ప్రాంతాల్లోని వారే కావటం విశేషం. అందుకే కావేరీ నదీతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడుతో నిత్యం నీటి వివాదాలకు కూడా ఈ నది నీళ్లే కారణం. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్నాటక 400 టీఎంసీలు, తమిళనాడు 200 టీఎంసీల నదీ జలాలను వాడుకుంటున్నాయి. తమ పరిధిలోని కావేరీ నదిపై 12 డ్యాములు కట్టింది కర్నాటక. నీరు విడుదలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తమిళనాడులోని రైతులు, సినీ ఇండస్ట్రీ అంతా కర్నాటకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది.
సెంటిమెంట్ పట్టిన కుమారస్వామి :
కావేరీ నదిపై కర్నాటక ప్రజలకు ఉన్న అనుబంధం, తమిళనాడుతో ఉన్న వైరం రెండూ కలిసి వస్తాయని భావించారు కన్నడ సీఎం కుమారస్వామి. పటేల్ విగ్రహం చూసి ముచ్చటపడినట్లు ఉన్నారు.. అదే తరహాలో అతి పెద్ద కావేరీ నది తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో సెంటిమెంట్ ను చిరస్థాయిగా ఉంచటంతోపాటు.. తన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఢిల్లీ : ఎవరైనా వారి జీవితాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు..కానీ బాలీవుడ్ ప్రేమజంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ వివాహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఢిల్లీకి చెందిన ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో వీరిద్దరూ తమ పెళ్లికి ఇన్సూరెన్స్‌ చేయించారట. ‘దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ భవ్నానీ’ పేరిట దీప్‌వీర్‌ వివాహానికి బీమా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వివాహం సందర్భంగా వీరికి అందించారు. వివాహంలో ప్రమాదవశాత్తూ ఆస్తి నష్టం, దొంగతనం, పేలుడు, అగ్ని ప్రమాదం, ఎయిర్‌ క్రాప్ట్‌ ప్రమాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఇన్సూరెన్స్‌ ఉపయోగపడుతుంది’ అని ఈ సంస్థ వెల్లడించింది. ఇటలీలోని లేక్‌ కోమోలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణెల వివాహం కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో సెల్‌ఫోన్లను నిషేధించారు.

 

parliament winter session on december 11 2018 -10TV తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుండే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. దీనితో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నెలకొనే పరిస్థితి ఉంటే అక్కడ సమరం ప్రారంభం కానుంది. 
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు సెమీఫైనల్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఈసారి ఎన్నికలో గెలిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 
మొత్తంగా పార్లమెంట్ సమావేశాల్లో 20 పనిదినాలు ఉండనున్నాయి. ఈసారి జరిగే సమావేశాలు పూర్తి స్థాయి సమావేశాలని..తరువాత లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశాలుండడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కీలక బిల్లుల మీద ఆర్డినెన్స్‌లు తేవాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని..అందులో ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని విపక్షలు వ్యూహ రచన చేస్తున్నాయి. 

విశాఖ : బంగాళాఖాతంలో గజ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తమిళనాడు తీరం దిశగా తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం కడలూరు..పంబన్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి 430 కి.మీ, నాగపట్నానికి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ నైరుతిగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్‌గా ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారనుంది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

ఏపీలో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ అప్పుడప్పుడు 65 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని... తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ, తమిళనాడు అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు భారీ వర్ష సూచన చేసింది. 

 

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో వినూత్న రీతిలో బీజేపీ ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీ, సీఎం శివరాజ్‌సింగ్ మాస్కులు ధరించి బీజేపీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఇండోర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మహేంద్ర హర్ణియా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ, శివరాజ్‌సింగ్ మాస్కులతో జనం సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

ఢిల్లీ: కేంద్రంలో ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు? దేశ ప్రధాని ఎవరు అవుతారు? ఇలాంటి చర్చలు తీవ్రంగా జరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి రావడం దేశానికి మంచిదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. నిత్యం దేశాభివృద్ధి గురించి ఆలోచించే మోడీ వంటి జాతీయ నాయకుడు ఉండటం దేశానికే మంచిదన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన కేంద్ర స్థాయిలో అవినీతిని నిర్మూలనకు ప్రధాని మోడీ మంత్రివర్గం విశేషమైన కృషి చేసిందని కితాబిచ్చారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 
దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటారని, మోడీ వచ్చాక అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా వింటున్నానని నారాయణమూర్తి తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి అమలు తీరు సక్రమంగా లేకపోతే అందుకు ప్రధాని ఎంతమాత్రం బాధ్యులు కారని, అధికారులకే ఆ బాధ్యత ఉంటుందని వివరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించారని ప్రశంసించారు. ఇటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం మంచి విషయమన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీని ప్రశంసిస్తూ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

రాజస్థాన్‌ : రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది. అదికూడా మామూలు షాక్ కాదు. రాజుల స్థానం రాజస్థాన్ లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలగా వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. బలమైన రాజకీయ వ్యూహాలతో బీజేపీకి జోరుకు కాంగ్రెస్ కళ్లెం వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కమలదళానికి ఎంపీ హరీష్ చంద్ర మీనా హ్యాండిచ్చారు. బుధవారం మాజీ సీఎం అశోఖ్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

Related image2014లో బీజేపీలో చేరిన హరీశ్ చంద్ర మీనా మాజీ ఐపీఎస్ అధికారి అయిన మీనా 2009 నుంచి 2013 వరకు రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు. మీనాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో  తూర్పు రాజస్థాన్‌లో కూడా మీనాలు ఎక్కువమంది ఉండటంతో.. హరీశ్ చంద్ర చేరికతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ నేతగా ఉన్న హరీష్ మీనా పార్టీని వీడటం బీజేపీకి ఎదురు దెబ్బేనని చెప్పాలి. మరి హరీశ్ చంద్ర మీనా ఝలక్ తో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

కర్ణాటక : పుడమి తల్లి కడుపు కొల్లగొడుతున్న కన్నడ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. పోన్జీ స్కామ్‌లో ఇరుక్కున్న ఈ మైనింగ్ మాఫియా కింగ్  ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించగా పరారీలో వుండి బెయిల్ కు అప్లైచేసుకున్నా కుదరక పోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయాడు. దీంతో అతనికి రిమాండ్ విధించటంతో మరోసారి బెయిల్ కు యత్నించగా బుధవారం బెంగళూరు 6వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గాలికి బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో బాండ్.. ఇద్దరి షూరిటీ కోరింది. బాండ్, షూరిటీ ఇస్తామని గాలి సన్నిహితులు తెలపడంతో.. కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో గాలి గురువారం సాయంత్రం జనార్దన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. 

బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన కేసు విషయంలో ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంబిడెంట్ సంస్థ రూ.500 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి సీసీబీ, ఈడీ అధికారులు ఆ సంస్థ చైర్మన్ ఫారిద్‌ను విచారిస్తూ వచ్చారు. అయితే.. ఈ కేసు నుంచి ఫరిద్‌ను తప్పించేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటికి డీల్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

డీల్‌లో భాగంగా అంబిడెంట్ కంపెనీ నుంచి బళ్లారికి చెందిన రాజ్మాహల్ జ్యుయెల్లర్‌కు గాలి జనార్దన్ రెడ్డి రూ.18.5 కోట్లతో పాటు రూ.2 కోట్ల నగదు ముట్టజెప్పినట్లు సీసీబీ పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం లావాదేవీల్లో అంబిడెంట్‌తో పాటు బెంగళూరుకు చెందిన అంబికా జ్యుయెల్లర్స్‌, జనార్దన్‌ రెడ్డికి చెందిన ఎనేబుల్ ఇండియా సంస్థలు కూడా భాగస్వాములని అనుమానిస్తున్నారు.

ఈ కేసు నుంచి తప్పించే డీల్‌లో భాగంగా గాలి జనార్దన్‌ రెడ్డి ఈడీ అధికారికి రూ. కోటి లంచం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. అంబిడెంట్ కేసులో తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే పసిగట్టిన గాలి జనార్దన్‌ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో గాలిని విచారించేందుకే పోలీసులు ప్రయత్నించగా.. ఆయన కనిపించకుండా పోయారు. 

ఈ నెల 07-11-2018న అజ్ఞాతంలోకి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య.. తన లాయర్‌ను వెంటబెట్టుకొని శనివారం అనగా 10-11-2018న సీసీబీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ గాలిని పోలీసులు విచారించారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ కు యత్నించగా బెంగళూరు కోర్టు గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
 

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-డీ2 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా 3వేల 423 కిలోల జీశాట్-29 ఉపగ్రహాన్ని తొలిసారి కక్ష్యలో ప్రవేశపెట్టింది. పదేళ్ల పాటు దేశ సమాచార రంగానికి జీశాట్-29 ఉపగ్రహం సేవలు అందించనుంది. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం నెలకొంది. ఇస్రో ఛైర్మన్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు.
నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం(14వ తేదీ) సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2ను ప్రయోగించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే రాకెట్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక కమ్యూనికేషన్‌కు సంబంధించిన జీశాట్‌-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లింది. జీశాట్-29 సమాచార వ్యవస్థకు కీలకం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జీశాట్‌-29 ఉపగ్రహంలో కేయూ, కేఏ బ్యాండు పేలోడ్‌లు ఉన్నాయి. ప్రధానమంత్రి డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇస్రో జీశాట్‌-29కు రూపకల్పన చేసింది. దీనిద్వారా మరో రెండు నూతన అంతరిక్ష సాంకేతికతలపై అధ్యయనం చేయనున్నారు. జీశాట్‌ సిరీస్‌లో మూడు ఉపగ్రహాలను పంపాల్సి ఉంది. ఇందులో జీశాట్‌-19 ఉపగ్రహాన్ని 2017 జూన్‌లో శ్రీహరికోట నుంచి కక్ష్యలోకి పంపారు. తర్వాత జీశాట్‌-29 ఉపగ్రహాన్ని బుధవారం(14వ తేదీ) నింగిలోకి పంపారు. చివరగా జీశాట్‌-11 ఉపగ్రహాన్ని డిసెంబర్ 4న యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

Pages

Don't Miss