రండి.. నిద్రపోండి...రిలాక్స్ అవ్వండి

Submitted on 15 September 2019
napyork is new york city"s coolest new place for relax

నిత్యజీవితంలో ఉరుకులు పరుగుల ప్రయాణంలో మనిషి ఇంట్లో సమస్యలతో, ఆఫీసులో పని వత్తిళ్లతో కంటిమీద కునుకులేకుండా గడిపేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు  ఇంటి సమస్యలు... అక్కడి నుంచి బయలు దేరి గంటలకొద్ది ప్రయాణం చేసి ఆఫీసుకు చేరుకుంటే....అక్కడ పోటీ ప్రపంచంలో పోరాటం....మధ్య మధ్యలో స్మార్ట్ ఫోన్ వాట్సప్ లో చాటింగ్ ...ఇది అయ్యాక  కాస్త రిలాక్సవటానికి పార్టీకి వెళ్లి  అర్ధరాత్రిదాకా గడిపి ఇంటికొచ్చి పడుకోవటంతో నిద్ర చాలటం లేదు.

మర్నాడు  ఆఫీసుకు వెళ్లి కుర్చిలో కూర్చోగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఒక అరగంట కునుకు తీస్తే మనసు ప్రశాంతంగా ఉండి ఎంతో హాయిగా అనిపిస్తుంది. న్యూయార్క్ లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఇలా ఆఫీసులకు వచ్చి నిద్రపోతున్నారుట. ఇలాంటి వారికోసం అక్కడ ఇప్పుడు అద్దెకు క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. "నాప్ యార్క్" సంస్ధ ఇలా నిద్రపోవడానికి అవకాశం  కల్పిస్తోంది. ఈ సంస్ధ అధునాతన మైన బెడ్లతో క్యాబిన్లను రెడీ చేసింది. వీటిలో మెత్తటి పరుపులు, తలగడలు ఉంటాయి. పరుపును కావల్సిన కోణంలో అమర్చుకునేలా ఏర్పాటు ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలేచేలా అలారంలు ఏర్పాటు చేశారు. క్యాబిన్ లోకి వెళ్లి పైకి  చూస్తే చీకటి పడి ఆకాశంలో నక్షత్రాలు కనపడేలా డిజైన్ చేశారు. ఈ క్యాబిన్లలో అరగంట నిద్రపోవాలంటే 15 డాలర్లు చెల్లించాలి ( ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1075), నెలకు 250 డాలర్లు (రూ.18 వేలు) వసూలు చేస్తున్నారు. 

విమానాల్లో ప్రయాణం చేసి వచ్చేవాళ్లు ఎక్కువగా తమ కేంద్రానికి వస్తున్నారని నాప్ యార్క్ కమ్యూనిటీ డైరెక్టర్ రెజా మోరెనో చెప్పారు. మధ్యాహ్నభోజనం తర్వాత నిద్రపోవడానికి, లేదా ఏదైనా అత్యవసర సమావేశానికి వెళ్లే ముందు స్నానం చేయడానికి ఉద్యోగులు ఇక్కడకు వస్తున్నారని ఆయన తెలిపారు. నిద్రలేమి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 41,100 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేశారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా ప్రకారం మూడోవంతుమంది అమెరికన్లకు నిద్ర చాలటం లేదు.24% మంది మాత్రమే రోజుకు 8గంటలకంటే ఎక్కువసేపు నిద్ర పోతున్నారు. మిగతా వారు తమకు అవసరమైనదాని కంటే తక్కువ నిద్రపోతున్నారు. సగం మందికి పైగా ఆరుగంటలు లేదా అంతకంటే తక్కువసేపే నిద్రపోతున్నారని తేలింది.  

nap york
New York
sleeping beds
Insomnia
relax
napping lounge
private pods

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు