ట్రాఫిక్ చెకింగ్.. ఫైన్ పడదు : E- డాక్యుమెంట్లు చూపించండి!

Submitted on 12 February 2020
motorists can show docs digilocker during traffic checks cops 

ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశారు. ట్రాఫిక్ చెకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను చూపించాల్సిందే. లేదంటే.. ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలో ప్రతివాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ చెకింగ్ చేసే సమయాల్లో అవసరమైన పత్రాలు చూపించని పక్షంలో చలానాలు పడతాయని మరిచిపోవద్దు.

చాలామంది వాహనదారులు తమ వాహనాల్లో హార్డ్ కాపీ పత్రాలను తీసుకెళ్లరు. ఒరిజినల్ డాక్యుమెంట్లను క్యారీ చేయరు. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయి చలానాలు చెల్లించాల్సి వస్తోంది. ప్రతిసారి హార్డ్ కాపీలను వాహనంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిలాకర్, ఎంపరివాహన్ అనే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 

నేషనల్ డిజిటల్ లాకర్ సిస్టమ్ గా పిలిచే Digilocker యాప్ మీ మొబైల్లో ఉంటే చాలు.. మీ వాహన పత్రాలను ట్రాఫిక్ పోలీసు చెకింగ్ సమయాల్లో చూపించవచ్చు. ఇటీవలే ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ట్రాఫిక్ చెకింగ్ చేసే సమయంలో వాహన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. హార్డ్ కాపీలను చూపించలేనప్పుడు డీజీ లాకర్ యాప్ ద్వారా పత్రాలను చూపించి జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకు వాహనదారులు తప్పనిసరిగా డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో తమ వాహనానికి సంబంధించిన ఆర్ సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా భద్రపరుచుకోవచ్చు. 

ఇన్సూరెన్స్ లేదా.. రూ.2వేలు ఫైన్ : 
అవసరమైన సమయాల్లో డిజిలాకర్ ద్వారా సంబంధిత పత్రాలను చూపించవచ్చు. అయితే.. వాహనదారులకు డిజిలాకర్ ద్వారా పత్రాలను చూపిస్తే సరిపోతుందా? లేదా తప్పనిసరిగా హార్డ్ కాపీలను చూపించాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు చెకింగ్ చేసే సమయాల్లో వాహనదారులు డిజిలాకర్ ద్వారా సాఫ్ట్ కాపీ పత్రాలను చూపించవచ్చునని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

వెహికల్ ఇన్సూరెన్స్ హార్డ్ కాపీ చూపించలేనివారికి రూ.2వేల వరకు జరిమానా విధిస్తున్నారు. బెంగళూరు నగరంలో చాలామంది వాహనదారులు సోషల్ మీడియా వేదికగా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. హార్డ్ కాపీ తప్పనిసరిగా ఉండాలా లేదా సాఫ్ట్ కాపీ ఉంటే సరిపోతుందా? అనేదానిపై కన్ఫూజ్ అవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

మోటార్ వెహికల్ యాక్ట్ 1988 కింద రవాణా శాఖ అధికారులు జారీ చేసిన వాహన డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ సహా ఇతర డాక్యుమెంట్లు ఏమైనా సరే Digilocker లేదా mParivahan ప్లాట్ ఫాంల్లో ఉంటే అన్ని చెల్లుబాటు అవుతాయి. మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం ఈ పత్రాలన్నీ చెల్లుబాటు అవుతాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ వేదికగా వస్తున్న సందేహాలను నివృతి చేస్తున్నారు. వాహనాలకు సంబంధించి సాప్ట్ డాక్యుమెంట్లను ట్రాఫిక్ పోలీసు చెకింగ్ చేసే సమయంలో చూపిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘన కింద వాహనం స్వాధీనం చేసుకున్న సమయాల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఒరిజినల్ హార్డ్ కాపీలు అవసరం. డిజిలాకర్ లో ఉన్న DL, RC, ఎమిషన్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతాయి. 

37 గంటల్లోనే రూ.30లక్షల జరిమానాలు : 
కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. ఇప్పటివరకూ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘన కింద 2వేల 978 కేసులను ట్రాఫిక్ పోలీసు అధికారులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి ట్రాఫిక్ చలానాల కింద 37 గంటల్లోనే రూ.30.1 లక్షల జరిమానాలు విధించారు. ట్రాఫిక్ పోలీసు చెకింగ్ సమయాల్లో వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎమిషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్స్ (సవరణ) చట్టం 2019 కింద భారీగా ట్రాఫిక్ చలాన్లు ఫిక్స్ చేసింది.

ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 2 నుంచి కర్ణాటకలో అమల్లోకి తెచ్చారు. బెంగళూరు నివాసికి పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు అతడికి రూ.17వేల వరకు భారీగా జరిమానా విధించారు. హెల్మట్ ధరించకుండా.. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ దొరికాడు. అందులోనూ అతడు మద్యం సేవించి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కారణాలతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతడికి భారీ జరిమానా విధించారు. 

motorists
traffic cops
digilocker
traffic checking
mParvahan
High penalities

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు