అప్పుడే అయిపోలేదు : వైసీపీలోకి మరో 30మంది టీడీపీ నేతలు

Submitted on 16 February 2019
More TDP Leaders Likely To Join YSR Congress Party, AP Politics

విజయవాడ: ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. జంపింగ్‌ జపాంగ్‌లు ఎక్కువయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. అయితే కేడర్‌ గందరగోళానికి గురికాకుండా.. టీడీపీ అధిష్టానం  సైతం ముందే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మరో 30మంది నేతలు కూడా పార్టీ మారవచ్చంటూ సంకేతాలిచ్చింది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్‌టాపిక్‌గా మారింది.

 

ఎన్నికల వేళ సైకిల్‌ దిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటు వైసీపీ నేతలు కూడా ఆపరేషన్‌ ఆకర్ష్ పేరుతో టీడీపీ నేతలకు వల విసురుతున్నారు. దీంతో టీడీపీలో అసంతృప్త నేతలు  వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మొన్న ఆమంచి.. నిన్న అవంతి.. నేడు జై రమేష్‌ ఇలా వరుసగా టీడీపీ నేతలు ఫ్యాన్‌ రెక్కల కిందకు చేరుకుంటున్నారు. మరికొంతమంది నేతలు సైతం  వీరి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు.

 

ఓవైపు పార్టీ నేతలు గోడ దూకుతున్నా.. టీడీపీ అధిష్టానం మాత్రం అన్ని పరిణామాల్ని పరిశీలిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోంది. కేడర్‌లో గందరగోళం ఏర్పడకుండా.. పార్టీ మారే నేతలు ఇంకా  చాలామంది ఉన్నారనే సంకేతాలు ఇచ్చింది. ఇటు వైసీపీపై కారాలు మిరియాలు నూరుతోంది. తమ నేతల్ని మభ్యపెట్టి.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ  మంత్రులు కూడా ఫిరాయింపులపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో టికెట్‌ రాదని డిసైడ్‌ అయినవారే పార్టీ మారుతున్నారని నారా లోకేష్‌ తెలిపారు. వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌పై మంత్రి  గంటా శ్రీనివాసరావు ఫైరయ్యారు. చంద్రబాబును కాపుమిత్ర అంటూ నెలక్రితమే పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు. పార్టీ మారాక అవంతి శ్రీనివాస్‌ చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించరన్నారు.

 

తమ పార్టీలో సీట్లు రావని తెలిసిన నేతలే పార్టీ మారుతున్నారని.. ఇలాంటివారు ఇంకా 30మంది దాకా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. పార్టీలకు కులం రంగు పూయడం  సమంజసం కాదన్నారు. మొత్తానికి రానున్న కాలంలో టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వరుస వలసలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా  వేడెక్కాయి. మరి ఎన్నికల నాటికి ఇంకెతమంది ఫ్యాన్‌ గాలికి పడిపోతారో చూడాలి.

Read Also: కర్నూలు టీడీపీకి షాక్ : జగన్‌తో ఇరిగెల సోదరులు భేటీ

Read Also: వీడ్ని ఏం చేసినా పాపం లేదు : ఉగ్రదాడిని సమర్థించిన విద్యార్థి

ap politics
TDP
YSR congress party
jumpings
tdp leaders to join ysr congress party
MLA Amanchi Krishna Mohan
avanthi srinivas
Ys Jagan Mohan Reddy

మరిన్ని వార్తలు