కంటతడి పెట్టిన జోగు రామన్న

Submitted on 11 September 2019
MLA Jogu Ramanna Teary at press conference

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నానని.. సర్పంచ్ స్థాయి నుండి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. బీపీ అధికంగా పెరగడంతో ఆస్పత్రిలో చేరానని, కానీ అజ్ఞాతంలోకి వెళ్లే అవసరం తనకు లేదన్నారు. ఆశ అందరికీ ఉంటుందని చెప్పారు. ఇవ్వకున్నా.. కేసీఆర్ తమ నాయకుడు అన్నారు. 

కార్యకర్తలు, అభిమానులు అడిగిన ప్రతిసారి అందరికి మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటూ వచ్చానని తెలిపారు. పనిచేసుకునే నేతకు మంత్రి పదవి వస్తుందని కార్యకర్తల్లో గట్టినమ్మకం ఉంటుందన్నారు. మంత్రి పదవి రానందుకు మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. హై బీపీ కావడం వల్ల డాక్టర్లు ఎవరితో మాట్లాడవద్దని చెప్పారని తెలిపారు. అందుకే ఎవరికి కాంటాక్ట్ లో లేనన్నారు. తాను ఆజ్ఞాతవాసంలో లేనని... ఆసుపత్రికి వెళ్ళానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, అభిమానులే తనకు ఆక్సిజన్, వాళ్ళు ఉన్నత వరకు ఏమీ కాదన్నారు.

కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దన్నారు జోగురామన్న. కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణలు తెలిపారు. సర్పంచ్ నుండి మంత్రి వరకు కార్యకర్తల కృషితో ఎదిగానని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ప్రతిష్ఠను దిగదార్చలేదన్నారు. 

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది. సోమవారం (సెప్టెంబర్ 9, 2019) ఉదయం నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయింది. తన గన్ మెన్లను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లిపోయారు. అయితే మంత్రివర్గంలో చోటుదక్కని తన అనుచరులకు ముందుగానే సమచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాల్లోనూ టెన్షన్ చోటు చేసుకుంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అలకబూనారు. అయితే బుధవారం జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, మనస్తాపానికి గురై, ఆస్పత్రిలో చేరానని స్పష్టం చేశారు. 
 

MLA Jogu Ramanna
Teary
Press conference
Adilabad

మరిన్ని వార్తలు