
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో పోస్టర్లను చెట్లకు అంటించారు. పోస్టర్‌పై ఏముందంటే.. 'ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా?. ఇండోర్‌లో జిలేబీ తింటుండగా అతన్ని చివరిసారి చూశాం. ఆ వ్యక్తి కోసం ఢిల్లీ మొత్తం వెతుకుతోంది.' అని ఆ పోస్టర్లో రాశారు.
ఇటీవల ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవటంతో ఇందుకు సంబంధించిన అంశంపై అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నవంబర్ 15న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కీలక సమావేశానికి ఎంపీలు, ప్రభుత్వాధికారులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు.
సమావేశానికి గైర్హాజరైన గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషితో పాటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం జిలేబీలు, అటుకులతో చేసిన చాట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇండోర్‌లో జరిగిన భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టుకు గౌతంగంభీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.