హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తారు : పాత ప్రాజెక్టులు ఆపేస్తారన్న వార్తలు అవాస్తవం

Submitted on 19 June 2019
minister anil yadav on polavaram project

పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఆపేస్తారని వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. పాత ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేస్తామనడం అవాస్తవం అన్నారు. పలు ప్రాజెక్టులపై సమీక్ష చేసేందుకు కమిటీ వేశామని మంత్రి తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం(జూన్ 19,2019) పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సీఎం జగన్ తొలిసారిగా జూన్ 20న పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తారు. హెడ్‌ వర్క్స్‌(జలాశయం), కుడి, ఎడమ అనుసంధానాలు(కనెక్టివిటీస్‌), నావిగేషన్‌ కెనాల్, పవర్‌ ప్రాజెక్టు, కుడి, ఎడమ కాలువల పురోగతి, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ చేసిన పనులను గోదావరి వరద బారి నుంచి రక్షించుకోవడం, నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో తన పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంపై సీఎం జగన్‌ దృష్టిసారించనున్నారు

రాజధాని నిర్మాణంపై అనవసర అపోహలు సృష్టించొద్దని మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు. రాజధాని నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులను బినామీ అకౌంట్లకు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్‌పై నమ్మకంతో ఉన్నారని మంత్రి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నేరవేరుస్తారని మంత్రి చెప్పారు. మిర్చి, పసుపు యార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మంత్రి మోపిదేవి చెప్పారు.

polavaram project
AP CM YS Jagan
minister anil kumar yadav
Mopidevi Venkata Ramana
jagan visit

మరిన్ని వార్తలు