బాపినీడు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు : చిరంజీవి

Submitted on 12 February 2019
Megastar Chiranjeevi paid homage to vijayaBapineedu dead body

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. బాపినీడు భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాపినీడు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. బాపినీడు తనను తమ్ముడి లాగానే కాకుండా ఒక కొడుకులాగా ఆయన ఎప్పుడు తనపై ప్రేమ చూపించేవారని తెలిపారు. తనకు కూడా బాపినీడు ఒక నిర్మాత, దర్శకుడే కాదు అంతకుమించి అని అన్నారు.

తన మనసుకు అతిదగ్గరైన వ్యక్తి బాపినీడు అని కొనియాడారు. పట్నంవచ్చిన పతివ్రతలు సినిమాతో తనకు బాపినీడుతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆయన తనతో ఆరు సినిమాలు చేశారని తెలిపారు. తనపై బాపినీడు ఎంతో అభిమానాన్ని, ప్రేమను చూపించారని పేర్కొన్నారు. ఆయన మృతి చాలా బాధాకరమని తెలిపారు. బాపినీడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. బాపినీడు ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి దేవుడు మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

విజయబాపినీడుగా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తను సంపాదకత్వం వహించిన పత్రిక పేరుతోనే విజయబాపినీడుగా ప్రసిధ్దిచెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధ పడుతూ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. 1936  సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించిన ఆయన ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో బీఏ మ్యాధ్స్ చేశారు. చిరంజీవి, శోభన్ బాబులతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. చిరంజీవి కేరీర్ లో మైలురాయిగా నిలచిన గ్యాంగ్ లీడర్ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. చిరంజీవితో గ్యాంగ్ లీడ‌ర్, ఖైదీ నెం 786, మ‌గ‌ధీరుడు, వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి అందించారు.
 

Megastar Chiranjeevi
paid homage
vijayaBapineedu dead body
Hyderabad


మరిన్ని వార్తలు