ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు

Submitted on 22 January 2020
medals for Telangana players in Khelo India Youth Games

ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ అండర్‌-21 బాలుర డబుల్స్‌ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్‌ గౌడ్‌, నవనీత్‌ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు. అండర్‌-21 టెన్నిస్‌ బాలుర డబుల్స్‌లో తీర్థ శాశంక్‌, సాయి కార్తీక్‌ జోడీ రజతాన్ని కైవసం చేసుకున్నది. టెన్నిస్‌ సింగిల్స్‌లో సామ సాత్విక, సిరిమల్ల సంజన కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్‌లో తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఓ స్వర్ణంతో సహా కాంస్య పతకాన్ని రాష్ట్ర షట్లర్లు ఖాతాలో వేసుకున్నారు.

మంగళవారం (జనవరి 21, 2020) జరిగిన అండర్‌-21 బాలుర డబుల్స్‌ ఫైనల్లో రాష్ట్ర ద్వయం విష్ణువర్ధన్‌ గౌడ్‌, నవనీత్‌ 18-21, 21-13, 21-15 తేడాతో మణిపూర్‌ జోడీ మంజీత్‌ సోగ్‌, డింకూ సింగ్‌పై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న విష్ణు, నవనీత్‌ జోడీ వరుసగా రెండు గేమ్‌ల్లో అదరగొట్టింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు డ్రాప్‌షాట్లు, నెట్‌గేమ్‌తో వరుస పాయింట్లు కొల్లగొట్టారు. మణిపూర్‌ జోడీ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మన షట్లర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి దూకుడు ముందు నిలువలేకపోయిన ప్రత్యర్థి ద్వయం పోటీనివ్వలేక పాయింట్లు సమర్పించుకుంది. 

మరోవైపు అండర్‌-21 బాలికల డబుల్స్‌లో శ్రీవిద్య, సాయి శ్రీయ జోడీ కాంస్య పతకం సాధించింది. దీంతో పాటు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను మన రాష్ట్ర బ్యాడ్మింటన్‌ జట్టు కైవసం చేసుకుంది. ఇక అండర్‌-21 బాలుర డబుల్స్‌ ఫైనల్లో రాష్ట్ర ద్వయం గంటా సాయికార్తీక్‌ రెడ్డి, తీర్థ శశాంక్‌ 3-6, 1-6 తేడాతో అసోం జోడీ పరీక్షిత్‌ సోమానీ, షేక్‌ ఇఫ్తికర్‌ చేతిలో ఓడి రజత పతకం దక్కించుకుంది. సెమీస్‌ వరకు అద్భుత పోరాట పటిమ కనబరిచిన కార్తీక్‌, శశాంక్‌ పసిడి పోరులో ఆకట్టుకోలేకపోయారు. 

ఇక అండర్‌-21 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో రాష్ట్ర యువ టెన్నిస్‌ క్రీడాకారిణి సామ సాత్విక 3-6, 1-6 తేడాతో వైదేహి చౌదరి(గుజరాత్‌) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. అండర్‌-17 బాలికల సింగిల్స్‌లో సిరిమల్ల సంజన 6-0, 7-5తో కుందన(తమిళనాడు)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 7 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్య పతకాలతో తెలంగాణ 15వ స్థానంలో కొనసాగుతోంది.
 

Telangana
players
medals
Khelo India Youth Games
Hyderabad

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు