ఏపీ శాసనమండలికి సుదీర్ఘ చరిత్ర : వైఎస్సార్ పునరుద్ధరించిన మండలిని జగన్ రద్దు చేస్తారా?

Submitted on 24 January 2020
A long history for the AP Legislative Council

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం ఇదే తొలిసారి కాదు. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం.. శాసన మండలిని రద్దు చేసింది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్‌.. రద్దు చేస్తారా..? 

ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి ఏర్పాటయ్యింది. 1983 వరకూ కాంగ్రెస్‌ పార్టీ పాలనే సాగడంతో.. శాసససభ, మండలి కార్యకలాపాలు సజావుగానే సాగాయి. అయితే.. 1983లో ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం అధికారంలోకి రావడంతో.. అసెంబ్లీకి, మండలికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. మండలి తీరుతో విసిగిపోయిన అప్పటి సీఎం ఎన్టీఆర్‌ దీన్ని ఆరో వేలుగానూ వర్ణించారు.

అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో మండలిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 30, 1985న తీర్మానం చేయించారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ .. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ఆమోదించింది. దీనికి జూన్‌1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది. 

అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ మండలి పునరుద్ధరణకు ప్రయత్నించింది. జనవరి 22, 1990న శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును పట్టించుకోలేదు. 

ఇక 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ మండలి పునరుద్ధరణ దిశగా అడుగులు పడ్డాయి. జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. దీనికి డిసెంబర్‌ 15, 2005న ఏపీ శాసన మండలి పునరుద్ధ రణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 20, 2005న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. దీంతో.. జనవరి 10, 2006న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. చివరకు 1985లో రద్దైన మండలి.. మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. 

ఇప్పుడు మరోసారి శాసన మండలి రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే.. అసెంబ్లీ బిల్లు తీర్మానం చేస్తే మండలి రద్దు అయిపోతుందా..?  శాసనమండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా..? శాసనమండలి రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తుందా..? అన్నది తేలాల్సి ఉంది. 
 

AP
Legislative Council
long history
YS Rajasekhara Reddy
Restoration
cm jagan
Cancellation
Thought

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు