సేవ్ నల్లమల : యురేనియం తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇచ్చేది లేదు

Submitted on 15 September 2019
ktr on uranium mining permission

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఉద్యమం నడుస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అడవులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు దీనిపై గళమెత్తుతున్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు పెట్టొద్దని సాగుతున్న ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా దీనిపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. 

యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్ లోనూ ఇవ్వబోదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై చర్చ జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలోని లంబాపూర్ లో మాత్రమే అన్వేషణ చేపట్టామన్నారు. నాగర్ కర్నూల్- అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలున్నప్పటికీ అనుమతులివ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిన విషయాన్ని సభలో కేటీఆర్ గుర్తు చేశారు. మైనింగ్ విషయంలో అనవసరం రాద్దాంతం వద్దన్నారు. కొన్ని పార్టీలు కృతిమ యురేనియం ఉద్యమం సృష్టిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. యురేనియం నిక్షేపాలు ఉన్నాయని తేలినా.. అనుమతి ఇచ్చేది లేదని కేటీఆర్ క్లారిటీ గా చెప్పారు.

మైనింగ్ లో రెండు దశలుంటాయని, మొదటి దశలో అన్వేషణ ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారని, కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అయితే మైనింగ్ చేయాలా? వద్దా? అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పారు. యురేనియం విషయంలో ప్రజల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్ వెలువడదని కేటీఆర్ వివరించారు. 

అసలు యురేనియం తవ్వకాలకు, టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మైనింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు.. చేయదు కూడా అని కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు అని కేటీఆర్ చెప్పారు. అవసరమైతే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అధికారిక ప్రకటన చేస్తామన్నారు. సీఎం, మంత్రివర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని కేటీఆర్  గుర్తు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రవేశపెడతామని, ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతామని కేటీఆర్ చెప్పారు.

యురేనియం తవ్వకాల విషయంలో ప్రజల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అంగీకరించారు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్‌ వెలువడదని చెప్పిన కేటీఆర్.. అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయని ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. యురేనియంపై లేని భయాందోళనలు సృష్టించొద్దని విపక్షాలను కోరారు. యురేనియం లభ్యత ఉందని తేలినా ప్రభుత్వం అనుమతివ్వబోదని ప్రకటించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం చేపట్టారని, అలాంటిది యురేనియం తవ్వకాలకు అనుమతిస్తారని ఎవరూ అనుకోరని అన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. యురేనియం విషయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట విధానం, ఆలోచన ఉందని కేటీఆర్ వెల్లడించారు.

అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవ్‌ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీలే పునాది రాళ్లుగా మారారు. పర్యావరణం ధ్వంసం అవడమే కాకుండా ప్రజారోగ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అడవి బిడ్డలను అదుకునేందుకు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే చర్యలపై పోరాడేందుకు అందరూ ఒక్కటవుతున్నారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు... నల్లమలను సేవ్ చేయాలంటూ నినదిస్తున్నారు.

krt
Uranium mining
Telangana
Save Nallamala
TRS Government

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు