కొండగట్టులో ఘోర ప్రమాదం

12:08 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు హాహాకారాలతో మారుమోగింది. తమ వారు ఎక్కడున్నారు ? జీవించి ఉన్నారా ? అంటూ ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. పవిత్ర ఆలయం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. 
కొండగట్టును దర్శించుకొనేందుకు పలువురు జగిత్యాల జిల్లాకు వస్తుంటారు. మంగళవారం నాడు పలువురు దర్శనం చేసుకుని బస్సులో కిందకు బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో 80 మంది ఉన్నట్లు సమాచారం. లోయ వద్ద మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీనితో పది మంది అక్కడికక్కడనే మృతి చెందారు. ఇందులో వృద్దులు, చిన్నారులున్నారు. వారి వారి మృతదేహాల వద్ద బంధువులు రోదించారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Don't Miss