క్రికెట్ ప్లేయర్‌ని మోసం చేసిన కోడెల కుటుంబం 

Submitted on 15 June 2019
Kodela Son Booked For Rs 15 Lakh Job Fraud

మాజీ సభాపతి కోడెల కుటుంబం అరాచకాలపై రోజురోజుకు ఆరోపణలు చేసే వ్యక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు వ్యక్తులు కోడెల కుమారుడు, కూతురు తమ వద్ద నుంచి అన్యాయంగా డబ్బు తీసుకున్నారంటూ వార్తలు రాగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ప్లేయర్ నాగరాజును మోసం చేసినట్లు బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ.. ఆంధ్రా రంజీ క్రికెటర్‌ బుడుమూరు నాగరాజు గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున క్రికెట్‌ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర అనే వ్యక్తి ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్‌ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్‌కు చెప్పగా.. శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్(ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.15 లక్షలు తీసుకున్నట్లు నాగరాజు ఆరోపించారు.

అక్కడ నుంచి కాన్పుర్ వెళ్లాలని సూచించగా.. అక్కడకు వెళ్లడంతో..  ఠాకూర్ అనే వ్యక్తి సార్ నాకు అన్ని చెప్పారని స్పోర్ట్స్ కోటాలో కాలింగ్ లెటర్ వస్తుందని చెప్పారని, అనంతరం సంవత్సరం పాటు ఓపిక పట్టానని, ఎన్నికల ఫలితాలు అనంతరం కోడెల శివరామ్‌పై వస్తున్న K ట్యాక్స్ కేసులు చూసి కోడెల శివప్రసాదరావుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశానని చెప్పాడు.

నరసరావుపేట నందు జూన్ నెలలో కలవాలని చెప్పగా కలిసి రూ. 15 లక్షల బాండును చూపించగా.. అప్పుడు తన మనుషులు కొట్టి తన వద్ద ఉన్న బాండ్‌ను లాకున్నారని, తిరిగి మాజీ స్పీకర్ కోడెలకు ఫోన్ చేయగా 14 వ తేదీన గుంటూరులోని మూడు వంతెనల వద్ద గల శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దకు రామ్మన్నారని అక్కడే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు వేచి చూశానని ఫోన్ చేయగా రెస్పాండ్ అవ్వక పోవటంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు.

ఇదిలా ఉంటే గతంలో ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో మోసం చేసి పలువురిని మోసం చేసి డబ్బులు తీసుకున్న కేసులో నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2016లో 82 గంటల పాటు నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడి గిన్నీస్ రికార్డులకు నాగరాజు ఎక్కాడు.

Kodela Son
Rs 15 Lakh Job Fraud
kodela sivaprasad

మరిన్ని వార్తలు