మసీదులో మంత్రోచ్ఛరణల మధ్య.. హిందూ యువతి పెళ్లి జరిపించిన ముస్లింలు

Submitted on 21 January 2020
Kerala mosque plays bride’s guardian, hosts Hindu wedding

మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే ఇదేరా అని అనిపించేలా చేసింది. ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీపై దేశంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో కేరళలోని ఓ మసీదు ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. 


కేరళలోని చేరవల్లిలో ఓ నిరుపేద హిందూ కుటుంబం మసీదు పక్కనే నివాసం ఉంటోంది. ఆ ఇంటి పెద్ద ఏళ్ల కిందటే మరణించడంతో... తల్లి ఆశ ఎన్నో కష్టాలకోర్చి కుమార్తె అంజు అశోక్ ను పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు ఇటీవలే ఓ సంబంధం కుదిరింది. కానీ, ఆమె పెళ్లి చేయడానికి తల్లికి తగిన ఆర్థిక స్థోమత లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మసీదు కమిటీ వారిని కలిసి తన గోడు చెప్పుకుంది. ఆ తల్లి కష్టం గురించి తెలుసుకున్న చేరవల్లీ ముస్లిం జమాత్ కమిటీ తమ సభ్యులతో చర్చించి, పేదింటి ఆడపిల్ల పెళ్లిని మసీదులో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అంజు పెళ్లి బాధ్యతను వాళ్లే తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా మసీదును అందంగా అలంకరించారు. పెళ్లికి పూర్తి ఏర్పాట్లు చేశారు.

ఆదివారం (జనవరి 19) ఆ మసీదులో పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం అంజు అశోక్ కు కృష్ణాపురంకి చెందిన శరత్ శశి అనే యువకుడితో పెళ్లి జరిపించారు. మసీదులో హిందూ పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య ఓ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. పెళ్లి పెద్దలుగా హాజరైన హిందువులు, ముస్లింలు ఆ కొత్త జంటకు నిండు ఆశీర్వాదాలు అందజేశారు. మసీదులోనే 1000 మంది అతిథులకు విందు భోజన ఏర్పాట్లను కూడా చేశారు. అంతేకాకుండా ఆ నవ వధువుకు 10 సవర్ల బంగారంతో పాటుగా రూ.2 లక్షల నగదు కూడా ఇచ్చి ఆ ముస్లింలు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ముస్లిం ఆడపడచులూ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

fb3.jpg

పేదింటి అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అల్లా కూడా సంతోషిస్తాడంటూ ముస్లిం జమాత్ కమిటీ తెలిపింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. ‘ప్రపంచానికి ఇదొక ఉదాహరణ. ఒక హిందూ జంట మసీదు ప్రాంగణంలో వివాహం చేసుకున్నారు’ అని మసీదు కమిటీ కార్యదర్శి నజుముద్దీన్ తెలిపారు. మసీదులో పెళ్లి చేసుకున్న కొత్త జంట అంజు, శరత్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అభినందించారు. ‘కేరళలో ఐకమత్యానికి ఇదొక ఉదాహరణ. చేరవల్లి ముస్లిం జమాత్ మసీదు అంజు, శరత్ వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించింది. నూతన వధూవరులు, కుటుంబాలు, మసీదు అధికారులు, చేరవల్లి ప్రజలకు నా అభినందనలని విజయన్ ట్వీట్ లో తెలిపారు.

kerala
MOSQUE
Wedding
HINDU
cheravally
CM
PINNARAI VIZAYAN
congratulations
communal harmony
muslim communities

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు