విలీనం మినహా : ఆర్టీసీ సమ్మె..ముందడుగు

Submitted on 23 October 2019
KCR Meeting Over TSRTC Strike

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు  సూచించిన 21 అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. రెండ్రోజుల్లో ఆర్టీసీ ఎండీకి నివేదిక ఇవ్వనుంది. హైకోర్టు సూచనల మేరకు అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం ఓ మెట్టు దిగడంతో.. సమ్మె విరమణ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతటా తాము వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆర్టీసీ ఎండీ, ఈడీలతో కమిటీ నియమించింది. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారన్న కేసీఆర్.. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్‌, బీజేపీలు మద్దతు పలకడం అనైతికమన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ను, రూట్లను ప్రైవేటు పరం  చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం కల్పిస్తూ నరేంద్రమోదీ సర్కార్‌ చట్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ సీఎంగా ఉన్నప్పుడే ఆర్టీసీని మూసేశారని, తెలంగాణ విషయంలో మాత్రం కాంగ్రెస్‌ విచిత్రంగా మాట్లాడుతోందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

‘1950లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ  చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్ లో సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్.. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. మోటార్ వెహికిల్ అమెండ్మెంట్ యాక్టు 2019 పేరిట అమలవుతున్న  చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పొందుపరిచారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం  అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొంది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని  కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తానికి అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఓ మెట్టు దిగడంతో సమ్మె విరమణ ప్రయత్నాలు మొదలయ్యాయి. కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వనుందో అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 
Read More : జాగ్రత్త : ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

KCR
meeting
over
TSRTC Strike

మరిన్ని వార్తలు