కేసీఆర్ దూకుడు : ZP ఛైర్మన్ అభ్యర్థి ప్రకటన

Submitted on 15 April 2019
kcr announce trs zp chairman candidate

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీదున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ తరఫున తొలి జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పేరుని కేసీఆర్ అనౌన్స్ చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరుని ఖరారు చేశారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు జడ్పీ చైర్మన్ పదవులు ఆఫర్ చేశారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు జడ్పీ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చారు.

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించి..గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

కొత్తగా పార్టీలోకి వచ్చినవారు ఆందోళన చెందొద్దని కేసీఆర్ అన్నారు. చాలా పదవులు ఉన్నాయని, అందరికి అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అవకాశం ఉన్న చోట పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు కూడా కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక భాద్యతను ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పారు. మంత్రులు, ఇంచార్జీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. రెవెన్యూ చట్టంలో మార్పులు తెస్తున్నామని చెప్పిన కేసీఆర్.. మార్పులు ఎందుకు వచ్చాయో ప్రజలకు వివరించాలన్నారు. లంచాలు ఎక్కువై రైతులు బాధపడుతున్నారని అలాంటి వ్యవస్థ పోవాలని కేసీఆర్ చెప్పారు.

KCR
TRS
trs zp chairman candidate
kova lakshmi
zilla parishad elections
mandal parishad elections

మరిన్ని వార్తలు