కర్నాటకలో కొత్త ప్రభుత్వం! : బీజేపీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు

Submitted on 15 January 2019
Karnataka Two Independent MLAs Withdraw Support

కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.మకరసంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇద్దరు  స్వతంత్ర ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.


ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేష్‌లు మంగళవారం(జనవరి 15,2019) తేదీన ప్రకటించడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. మకర సంక్రాంతి పండుగ..మంచి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని..ప్రభుత్వం మారాలని తాను కోరుకుంటున్నానని ఆర్.శంకర్ తెలిపారు. ప్రజలకు మంచి, స్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తారని తాను సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిచ్చానని, అయితే ప్రభుత్వం అందులో పూర్తిగా విఫలమైపోయిందని హెచ్.నగేష్ తెలిపారు. కాంగ్రెస్-జేడీఎష్ నేతల మధ్య సఖ్యత లేదని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం కోసం తాను బీజేపీకి మద్దతిస్తానని నగేష్ తెలిపారు.

ప్రభుత్వానికి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై సీఎం కుమారస్వామి స్పందించారు.తాను చాలా రిలాక్స్ గా ఉన్నానని ఆయన తెలిపారు. తనకు తన బలమేంటో తెలుసునని కుమారస్వామి తెలిపారు. వారం రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు చూసి తాను ఎంజాయ్ చేస్తున్నానని ఆయన అన్నారు.కర్ణాటకలో ఎమ్మెల్యేలకు కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి వారు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ తెలిపారు. కుమారస్వామి సీఎంగా ఐదేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ అన్నారు.

మరోవైపు బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆపరేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకొంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ శివార్లలోని గురుగావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తరలించింది. కేవలం రాబోయో సార్వత్రిక ఎన్నికలపై చర్చించడానికి తాము హోటల్ లో మీట్ అయ్యామని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికి దీని వెనుక పెద్ద కుట్రే ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల లోపు కర్నాటకలో అధికారంలోకి రావాలని...అనంతరం వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లున్నాయి. 113 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. కాంగ్రెస్ - జేడీఎస్ బలం 118గా ఉంది. 6-8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ అంటోంది. 

karnataka
Two Independent
MLAs
Withdraw
Support
Karnataka govt
DK Shivakumar
Operation Lotus
H D Kumaraswamy

మరిన్ని వార్తలు