కరీంనగర్‌ రాధిక హత్యకేసు : జర్మన్‌ టెక్నాలజీ ఉపయోగించి కీలక ఆధారాలు

Submitted on 14 February 2020
Karimnagar Radhika murder case investigation speed up

కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్‌ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కమలహాసన్‌ రెడ్డి సెలవు రద్దు చేసుకుని నిన్నే కరీంనగర్‌ చేరుకున్నారు. మరోవైపు హంతకుడు కోసం ఎనిమిది బృందాలుగా విడిపోయి గాలిస్తున్న పోలీసులకు హంతకుడుదొరికే వరకూ సెలవులు పెట్టొద్దని ఆదేశాలు అందాయి. 

రాధికను ఎవరు హత్య చేశారు...? ఎందుకు హత్య చేశారనే విషయంలో ఇప్పటివరకూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు పోలీసులు. పైగా హత్య చేసిన తరువాత సాక్ష్యాధారాలు చెరిపేయడంతో... ఇంటి గురించి బాగా తెలిసినవారే ఇలాంటి పని చేసుంటారని అనుమానిస్తున్నారు. హంతకుడి పట్టుకోవడం కోసం జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రక్తపు మరకలు చెరిపివేసినా నిందితులను పట్టుకునేలా జర్మన్‌ టెక్నాలజీ ఉండటంతో దానికే మొగ్గుచూపారు అధికారులు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలు సేకరించారు.  

రాధిక హత్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముందుగా రాధికను హత్య చేసి తరువాత గొంతు కోసినట్లు పోస్ట్‌మార్టం ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన తరువాత హంతకులు అక్కడే చాలా సమయం ఉండి.. ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు లేకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. 

ఘటన స్థలం నుంచి ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు రక్తనమూనాలు, వేలిముద్రలు సేకరించారు. 8 ప్రత్యేక బృందాలు సాంకేతికపరమైన అంశాలతో పాటు సీసీకెమెరాల పుటేజిని సేకరించారు. విద్యానగర్ కాలనీ పరిధిలోని 36 సీసీకెమెరాల పుటేజిలను పరిశీలించినా కనీసం అనుమానితులను కూడా గుర్తించలేకపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుకెళ్లినప్పటికీ.. అక్కడ కూడా సరైన ఆధారాలు దొరకలేదు. తాజాగా జర్మన్‌ టెక్నాలజీ సాయంతో దొరికిన ఆధారాలు నిందితుడిని ఏమాత్రం గుర్తిస్తాయో చూడాలి. 

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్

Karimnagar
Radhika
murder case
Investigation
speed up
German Technology
key evidence

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు