ఓటమి తర్వాత తొలిసారి స్పందించిన కవిత

Submitted on 27 May 2019
Kalvakuntla Kavitha after defeating Nizamabad Constituency Election

నిజామాబాద్ ఎన్నికల్లో ఓటమిపాలైన ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత.. ఓటిమి తర్వాత తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని, దేశంలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఆశతో బీజేపీకి ఓట్లు వేశారని ఆమె అన్నారు.

నిజామాబాద్‌లో ఉండేటువంటి ప్రత్యేకమైన ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు కవిత తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా.. టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర బాగు కోసం పనిచేసే వ్యక్తిని నేను అని, కేడర్ ధైర్యం కోల్పోవద్దని, గెలుపులో ఎంత ఆనందంగా ఉంటామో ఓటమిలో అంతే హుందాగా ఉండాలనేది తెలంగాణ ఉద్యమమే మనకు నేర్పించిందని అన్నారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అని, ఓడిపోయినంత మాత్రాన నిజామాబాద్‌ని వదలను అని, నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదని, తెలంగాణ కోసమైనా.. నిజామాబాద్ కోసమైనా.. కార్యకర్తలు, ప్రజల కోసమైనా.. పదవిలో ఉన్నా లేకున్నా.. తప్పకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే కవిత ఓడిపోయిందనే బాధలో  మనస్తాపానికి గురై చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. కిశోర్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 

Kalvakuntla Kavitha
Nizamabad Constituency
Election2019

మరిన్ని వార్తలు