జూన్ 21న కాళేశ్వరం ప్రారంభోత్సవం : జగన్, ఫడ్నవీస్ చీఫ్ గెస్టులు 

Submitted on 18 June 2019
Kaleswaram Project inauguration on June 21st

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకి 2019, జూన్ 21న ప్రారంభోత్సవం చేయనున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ చీఫ్ గెస్టులుగా వస్తారని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో 40లక్షల ఎకరాలకు సాగునీరందడంతో పాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతాయని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వర ప్రాజెక్టుని చూసి ప్రపంచమే అబ్బురపడుతోందన్నారు.

మంగళవారం(జూన్ 18,2019) సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ లో చర్చించిన అంశాలను, నిర్ణయాలను కేసీఆర్ మీడియాకి తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంబోత్సవానికి హాజరు కానున్నారని చెప్పారు. మంత్రి ఈటల ఒకరోజు ముందే అక్కడ ఉండి కార్యక్రమాలను సమన్వయం చేస్తారని, 5 పంపింగ్‌ స్టేషన్లలో మంత్రులు ప్రారంభోత్సవం చేస్తారని కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు హోమం నిర్వహిస్తామన్నారు. 

ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తన సొంత హెలికాప్టర్ లో వస్తారని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర సీఎం, గవర్నర్, బ్యాంకర్లు 4 హెలికాప్టర్లలో వస్తారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా సహకరించిందని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.

గతంలో ఎన్నడూ చూడని మంచి ఫలితాలను అన్ని రంగాల్లో సాధిస్తామని.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి నీళ్లిస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ రాకముందు కర్నాటకతో, మహారాష్ట్రతో బస్తీమే సవాల్ అన్నట్లుగా పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రతి రాష్ట్రంతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక ఏపీలో పరిస్థితి మారిందన్నారు. ఏపీతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని కేసీఆర్ వివరించారు.

Telangana CM KCR
Kaleswaram project
governor narasimhan
KCR
Ys Jagan Mohan Reddy
devendra fadnavis


మరిన్ని వార్తలు