కాచిగూడ స్టేషన్లో రైలు ప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్ 

Submitted on 11 November 2019
kachiguda railway station trains collide CCTV footage viral 

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన  రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ  పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్‌ క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ను రెస్క్యూ టీం దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్‌ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్‌ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాం‍దోళనకు గురయ్యారు. 

నవంబర్11 సోమవారం ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని  సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రైలు వేగంగా ఢీకొట్టడంతో ఎంఎంటీఎస్ వెనకవైపు బోగీలు అమాంతం గాల్లోకి లేవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరిగిందో తెలియని ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగు అందుకున్నారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంఎంటీఎస్ ప్రమాదం కారణంగా కొన్ని రైల్వే అధికారులు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసారు. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో  ఉదయం  ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Telangana
MMTS Train Accident
Kachiguda
Hyderabad

మరిన్ని వార్తలు