జగన్ టీమ్‌ రెడీ : IASలకు స్థానభ్రంశం

Submitted on 24 May 2019
Jagan Team Ready IAS Officers Transfer Soon

జగన్ మోహన్ రెడ్డి కొలువులో ఐఏఎస్‌లకు స్థానభ్రంశం కలుగనుంది. చంద్రబాబుకు సన్నిహితులుగా ముద్రవున్న వారిని కీలక పోస్ట్‌ల నుంచి తప్పించి తనకు అనుకూలమైన వారిని కీలక స్థానాల్లో నియమించనున్నారు జగన్. ఇప్పటికే పలువురు దీనిపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చర్చలు జరిగినట్లు సమాచారం. చంద్రబాబు కీలక పదవుల్లో తనకు అత్యంత నమ్మకమైన వారిని నియమించుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించి రహస్య నిర్ణయాలు, విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఇప్పుడు జగన్‌ కూడా ఇదే పంథాను అనుసరించబోతున్నారు. బాబు కొలువులో కీలక పదవుల్లో ఉన్నవారిని తప్పించి వారి స్థానంలో తనకు అనుకూలమైన, అంకితభావంతో పనిచేసే వారిని నియమించే పనిలో పడ్డారు. ఈ విషయంపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో కొంత మేర చర్చలు కూడా జరిగాయి. 

మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బదిలీలు జరుగనున్నాయి. రిటైర్డ్‌ సీఎస్ అజయ్ కల్లాంరెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు సేవలను జగన్ ఉపయోగించుకొనే అవకాశం వుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేష్ ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చారు. రెండు నెలల్లో రిటైర్‌ కానున్న ఈ అధికారి ప్రస్తుతం జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రిటైర్‌మెంట్ తరువాత కూడా జగన్ ప్రభుత్వం ఈయన సేవల్ని వినియోగించుకోనున్నట్లు సమాచారం. 

బాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, సీఎంవోలో పనిచేస్తున్న జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీకాంత్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజమౌళి, సాయి ప్రసాద్, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం సతీష్ చంద్ర, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం గిరిజా శంకర్, సీఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర, ఏపీఎడీసీ ఎండీ వెంకయ్య చౌదరి, ఎనర్జీ అండ్ సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, ఏపీపీఎఫ్ఎస్ఎస్ సీఈవో క్రిష్ణదేవరాయలు, ఐ అండ్‌ పీఆర్ కమిషనర్‌ వెంకటేశ్వర్లు వున్నారు. 

వీరిలో క్రిష్ణమోహన్ రిటైర్డ్‌ అధికారి. వాసిరెడ్డి క్రిష్ణదేవరాయలు బయటి వ్యక్తి కాబట్టి ఈయనకు పూర్తిగా ఉద్వాసన పలుకనున్నారు. మిగిలిన వారికి బదిలీ తప్పదు. మూడు సంత్సరాలుగా ఒకే పోస్ట్‌లో ఉన్న ఐఏఎస్ అధికారులకు కూడా శాఖలు మార్చనున్నారు. ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఉండనుంది. ఏపీకి సీనియర్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఏ అధికారినీ కూడా ఖాళీగా కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ప్రతి సీనియర్ అధికారికి బదిలీ తప్పనప్పటికీ వారికి మరో కీలకశాఖ కార్యకలాపాలు అప్పగించక తప్పదు.  

కీలక పోస్టులైన ఫైనాన్స్, జీఏడీ, సీఎంవో, జలవనరులశాఖ, మున్సిపాలిటీ శాఖ, సీసీఎల్ఏ, రెవిన్యూ, హెల్త్, పరిశ్రమల శాఖలకు తన తండ్రి వైఎస్ఆర్‌ హయాంలో తనతో సన్నిహితంగా మెలిగినవారిని తీసుకోనున్నారు. అంతేకాక ముఖ్యమైన శాఖల్లో ఏ వివాదాలులేని, సిన్సియర్ అధికారులకు కూడా చోటు ఇవ్వనున్నారు. 

Jagan Team
ready
IAS Officers
Transfer Soon

మరిన్ని వార్తలు