జగన్ - కేసీఆర్ ఆత్మీయ భేటీ

Submitted on 25 May 2019
Jagan And Telangana CM KCR Meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్..హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. జగన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత కాబోయే సీఎం హోదాలో జగన్.. తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. మే 25వ తేదీ శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్..తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం గంట పాటు కొనసాగింది.

అనంతరం జగన్.. నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి జగన్ దంపతులకు స్వాగతం పలికారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పండ్లు..పుష్పగుచ్చాలిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్టానికి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను జగన్‌కి పరిచయం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా జగన్‌కు స్వీటు తినిపించి శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు.    జగన్ సతీమణితో.. కేసీఆర్, కేటీఆర్ సతీమణిలు ముచ్చటించుకున్నారు. 

తర్వాత జగన్..కేసీఆర్‌ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. పోలింగ్ జరిగిన తీరు.. 150 స్థానాల్లో గెలుపు, మెజార్టీల అంశం చర్చకు వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారానికి, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటంలో కలిసి కట్టుగా సాగాలని నిర్ణయించారు. ఏపీకి కీలకం అయిన ప్రత్యేక హోదాను సాధించటానికి కలిసి రావాలని కూడా జగన్ కోరినట్లు సమాచారం. ఏపీ ప్రజల మనోభావాలను అనుగుణంగా, హామీలు నెరవేర్చటానికి ఎప్పటికీ ముందుంటాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మే 30వ తేదీన ప్రమాణ స్వీకార రావాలని కేసీఆర్‌ని ఆహ్వానించారు. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు