ఉత్కంఠపోరులో మరోసారి మెరిసిన ముంబై

Submitted on 12 May 2019
ipl 2019 winners mumbai indians

ఉత్కంఠభరితమైన పోరులో ముంబై గెలిచింది. చివరి బంతికి 2పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఠాకూర్ అవుట్ అవడంతో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. 150పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన చెన్నై చివరి వరకూ పోరాడింది. ఓపెనర్‌గా దిగిన షేన్ వాట్సన్ (80: 59బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు)ముంబైకు ముచ్చెమటలు పోయించాడు. ఒకానొక పరిస్థితుల్లో ముంబై చేతి నుంచి మ్యాచ్ చేజారిందనుుకన్న పరిస్థితుల్లో బుమ్రా వాట్సన్‌ను 19.4  ఓవర్ల వద్ద దొరకబుచ్చుకున్నాడు. 

ఆఖరి ఓవర్ వేయకముందు వరకూ మలింగ వేసిన 3ఓవర్లలో 42పరుగులు సమర్పించుకున్నాడు. అయినా చివరి ఓవర్‌ను మలింగకు ఇవ్వడంతో నమ్మకాన్ని నిలబెట్టుకుని పరుగులు కట్టడి చేయడంతో పాటు ఒక్క పరుగు తేడాతో జట్టుకు విజయం దక్కేలా చేశాడు. 

ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన చెన్నైకు డుప్లెసిస్(26; 13బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు)తొలి వికెట్‌ను కృనాల్ పాండ్యా పడగొట్టాడు. మరో ఓపెనర్ వాట్సన్ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలబడి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మిగిలిన చెన్నై బ్యాట్స్‌మెన్ ఆశించినంత మేర రాణించలేకపోయారు. 

సురేశ్ రైనా(8), అంబటిరాయుడు(1), ఎంఎస్ ధోనీ(2), డేన్ బ్రావో(15), రవీంద్ర జడేజా(5), శార్దూల్ ఠాకూర్(2)లతో సరిపెట్టుకున్నారు. ముంబై బౌలర్లు బుమ్రా 2వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా, మలింగ, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 

ముంబై ఇన్నింగ్స్:

అంతకంటే ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. నిర్ణీత ఓవర్లకు 8వికెట్లు నష్టపోయి అతికష్టంపై చెన్నైకు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. దీపక్ చాహర్ 3వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్‌కు చెరో 2వికెట్లు దక్కాయి. 

ఆరంభంలో కనిపించిన దూకుడు చివరివరకూ కొనసాగించలేకపోయింది ముంబై ఇండియన్స్. స్పిన్నర్ల ధాటికి వికెట్లు కాపాడుకునేందుకు కష్టపడింది. డికాక్(29; 17బంతుల్లో 4 సిక్సులు)స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దూకుడు మీదున్న ముంబై ఓపెనర్ డికాక్‌ను 4.5వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత 3బంతుల విరామానికే రోహిత్(15)వికెట్‌ను చాహర్ పడగొట్టాడు. దాంతో ముంబై స్కోరు నత్తనడకన సాగింది. 

సూర్యకుమార్ యాదవ్(15), ఇషాన్ కిషన్(23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కృనాల్ పాండ్యా(7)వచ్చిన కాసేపటికే ఠాకూర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బర్త్ డే బాయ్ కీరన్ పొలార్డ్(41; 25బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు) మ్యాచ్ పూర్తయ్యేవరకూ క్రీజులో నిలబడి ముంబైకు స్కోరు తెచ్చిపెట్టాడు. మరో ఎండ్‌లో దిగిన బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా(16; 10 బంతుల్లో) బాదుడు మొదలుపెట్టగానే చాహర్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ చాహర్(0), మిచెల్ మెక్ క్లెనగన్(0), బుమ్రా(0)లతో సరిపెట్టుకున్నారు. 

IPL 2019
MUMBAI INDIANS
IPL 12

మరిన్ని వార్తలు