రో'హిట్'.. దుమ్ము దులిపాడు

Submitted on 8 November 2019
India vs Bangladesh, 2nd T20I: Rohit Sharma pyrotechnics help India pull level in Rajkot

తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్‌లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిచింది. చాహల్‌ (2/28), దీపక్‌ చాహర్‌ (1/25), వాషింగ్టన్‌ సుందర్‌ (1/25)ల బౌలింగ్‌ ప్రదర్శనతో మొదట బంగ్లాను 153/6కే కట్టడి చేశారు. చేధనలో రెచ్చిపోయిన రోహిత్‌ (85; 43 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులు) విజృంభించడంతో లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగలిగారు. 

రాజ్‌కోట్‌లో రోహిత్‌ ఆటే హైలైట్‌‌గా నిలిచింది. అద్భుతమైన ప్రదర్శనకు రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కెరీర్‌లో 100వ మ్యాచ్‌‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెచ్చిపోయాడు. ఛేదనలో తొలి ఓవర్‌ నుంచి ధాటిగా ఆడింది భారత్‌. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన ధావన్‌.. ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌తో తుఫాన్ మొదలైంది. అఫిఫ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో డీప్‌ మిడ్‌వికెట్లో స్టాండ్స్‌లోకి పడేట్లు బాదిన రోహిత్ (23 బంతుల్లో) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అదే జోరులో అమినుల్‌ బౌలింగ్‌లో ఓ పుల్‌ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. 

13వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 125. రాహుల్‌ (8 నాటౌట్‌) అండతో శ్రేయస్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ధావన్‌ (31; 27 బంతుల్లో 4ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (24 నాటౌట్‌; 13 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) రాణించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ నయీమ్‌ (36; 31 బంతుల్లో 5ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. చివరిదైన మూడో టీ20 ఆదివారం నాగ్‌పుర్‌లో జరుగుతుంది.

భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (1/44) ఒక్కడే నిరాశపరిచినప్పటికీ స్పిన్నర్లు చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బంగ్లాను దెబ్బతీశారు. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి బంగ్లా పతనాన్ని చవిచూశారు. చాహల్‌ ఒకే ఓవర్లో (13వ)  ముష్ఫికర్‌ (4), సౌమ్య సర్కార్‌ (30)ను వెనక్కి పంపాడు. 13 ఓవర్లకు స్కోరు 103/4. మహ్మదుల్లా, అఫిఫ్‌ హుస్సేన్‌ (6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ అఫిఫ్‌ను ఖలీల్‌.. మహ్మదుల్లా (30)ను చాహర్‌ వెనక్కి పంపారు. 

india
bangladesh
t20
Rohit Sharma
rajkot

మరిన్ని వార్తలు