నోరు విప్పితే.. వైసీపీ నేతల బూతు పురాణం!

Submitted on 14 January 2020
YSRCP Leaders use unparliamentary language against Chandrababu Naidu

ఏపీ రాజకీయాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. నాయకుల నోటికి అసలు అడ్డూ అదుపూ ఉండడం లేదు. నోటికెంత మాటొస్తే అంత మాటతో ప్రత్యర్థుల మీద పడిపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ వారని తేడా లేదు. నేతల్లో చాలా మంది నోటికొచ్చిన బూతు ప్రేలాపనలతో రెచ్చిపోతున్నారు. ఈ బూతు పురాణాలు వినలేక జనాలు మాత్రం హవ్వా.. వీరా మనల్ని పాలించే నాయకులని నోరెళ్లబెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజం. కానీ, మరీ బూతులతో తిట్టేంత విరోధం పనికి రాదని జనాలు అంటున్నారు. హద్దులు మీరిపోయి మాట్లాడుతుండడం విస్తుగొలుపుతోంది.

పెరిగిపోతున్న అసహనం :
ఏపీ సర్కారు పెద్దల అసహనం నానాటికీ పెరిగిపోతోంది. ప్రతిపక్షాలు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బూతు పురాణం మొదలుపెడుతున్నారు. అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు. వార్తల్లో రాయలేని, చెవులతో వినలేని బూతులను అలవోకగా మాట్లాడేస్తున్నారు. ప్రతిపక్ష నేత ఒకరు సన్నబియ్యం గురించి అడిగితే.. సంబంధిత మంత్రి కొడాలి నాని ఎంత అరాచకంగా రియాక్టయ్యారో అందరికీ తెలిసిందే. అసహనం పెరిగిపోయి, సంస్కారం మరిచిపోయి సన్నబియ్యం ఇస్తామని ఎవడు చెప్పాడు.. నీ... అంటూ ఏవేవో మాట్లాడేశారు. తప్పు చేశామని తెలిసి కూడా ఇతరులపై దాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు కొడాలి నాని అని జనాలు అంటున్నారు.

టీవీ డిబేట్లను మొదలుకొని పబ్లిక్‌ మీటింగుల వరకూ.. చివరకు మీడియా సమావేశాల్లోనూ బూతులు అవలీలగా... అలవోకగా.. అసలేం కానట్టు మాట్లాడేస్తున్నారు. పబ్లిక్‌గానే ఈ రేంజ్‌లో రెచ్చిపోతుంటే.. ఇక లోలోపల ఏ రేంజ్‌లో మాట్లాడతారో వారికి, వారితో పాటు ఉండే వారికే తెలియాలి. ఇటీవల కాలంలో ఈ నీచపు సంస్కృతి మరింత పెరిగిపోతోంది. లైవ్‌ షోల్లో నోటికి అదుపు లేకుండా మాట్లాడేస్తుంటే.. బీప్‌లు కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైసీపీ నేతల నోటికి అస్సలు హద్దులు ఉండడం లేదని జనాలు అంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి మంత్రుల వరకూ అదే బూతు వరస.. స్థాయిని మరచి దిగజారుడుతనాన్ని ప్రదర్శించే పరిస్థితి.

ఆ మాట గుర్తొస్తే చాలు :
కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఏకంగా పబ్లిక్‌ మీటింగ్‌లో పక్కనే ఓ మహిళా నేత ఉన్నా కూడా నోటిని అదుపులో ఉంచుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను నోటికొచ్చినట్టుగా బూతులు తిట్టేశారు. నిజానికి సాధారణ జనాలు కూడా పబ్లిక్‌లో అలాంటి మాటలు ఆడేందుకు సంకోచిస్తారు. కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు అలాంటి పట్టింపులేవీ లేకుండా నోటికి పని చెబుతున్నారని జనాలు విస్తుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లయిస్‌ మంత్రి కొడాలి నాని ఓ వ్యాక్యాన్ని ఏకంగా తన ఊతపదంగా మార్చేసుకున్నారు. ఆ మాట గుర్తొస్తే చాలు.. సదరు మంత్రి పేరు టక్కున గుర్తుకొచ్చేస్తుంది.

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం షరా మామూలే. కానీ, దానికీ ఒక హద్దుంటుంది. ఇష్టానుసారంగా మాటలాడేయడం కాకుండా పద్ధతిగా మాట్లాడితే గౌరవం ఉంటుంది. విమర్శల్లో లాజిక్‌ ఉండాలి. అంతేగానీ.. నోటికొచ్చిన తిట్లు, బూతులు మాట్లాడడం వల్ల ఆ పదవికే కాదు నేతలపై కూడా గౌరవం పోతుందని జనాలు అంటున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులంటే జనాల్లో ఏహ్యభావం పెరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బూతు పురాణంతో అది మరింతగా దిగజారుతోంది. 

వైసీపీ అభిమానుల్లోనూ అసహనం :
వైసీపీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొడాలి నాని బూతు పురాణం అందరూ చూసిందే. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అసభ్య పదజాలంతో చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. వైసీపీ అభిమానులు కూడా వీరి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ పార్టీకి చెందని వారైతే మరింత చిరాకు పడుతున్నారు.

స్పీకరు పదవి అంటే పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. పార్టీలకు అతీతంగా స్పీకరు వ్యవహరించాలి. కానీ ఏపీ స్పీకరుగా పదవి చేపట్టాక కూడా వైసీపీ నేతలాగే వ్యవహరిస్తున్నారు తమ్మినేని సీతారాం. సరే పార్టీ పరంగా ఏదో అలా వ్యవహరిస్తున్నారు అని లైట్‌గా తీసుకుందామన్నా.. ఆయన కూడా బూతులు వల్లించడం దారుణమని పార్టీలో వారే అనుకుంటున్నారు.

చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడడం సమర్థనీయం కాదు. ఒక సభాపతిగా సాధారణ మనిషి కూడా మాట్లాడకూడని భాషను విచ్చలవిడిగా మాట్లాడడంపై జనాలు విస్తుపోతున్నారు. ఇలా వైసీపీ మంత్రులు, నేతలు అడ్డదిడ్డంగా బూతులు మాట్లాడుతుంటే అడ్డు చెప్పాల్సిన ముఖ్యమంత్రి జగన్‌ కూడా ప్రేక్షక పాత్ర పోషించడం ఏంటని జనాలు అనుకుంటున్నారు. వైసీపీ నేతలంటే బూతులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోతున్నారు.

YSRCP leaders
unparliamentary language
Chandrababu Naidu
D Chandrasekhar Reddy

మరిన్ని వార్తలు