కానిస్టేబుల్ జాబ్స్: ఎంపికైన అభ్యర్ధులకు ముఖ్య సూచనలు

Submitted on 13 January 2020
Telangana Police Constable Selection Process

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జనవరి 17 నుంచి శిక్షణ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సివిల్, AR కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మాత్రమే కాదు డ్రైవర్, మెకానిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కూడా జనవరి 17 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అభ్యర్థులకు 9 నెలలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 

దాదాపు 16 వేలకు పైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 11 విభాగాల్లో 17వేల 156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబరు 25న విడుదల చేసిన ఫలితాల్లో 16వేల 25 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అందులో 13వేల 373 మంది పురుషులు ఉంటే.. 2వేల652 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

శిక్షణలో భాగంగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైబరాబాద్‌, రాచకొండ, వికారాబాద్‌ ప్రాంతాలకు చెందిన 3వేల139 మంది కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు జనవరి 13న గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సీటీసీ గ్రౌండ్‌లో రిపోర్టు చేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ తెలిపారు. అభ్యర్థులు 13న ఉదయం 10 గంటల్లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.  ఈ సందర్భంగా అభ్యర్థులకు సీపీ పలు సూచనలు కూడా చేశారు. 

ముఖ్య సూచనలు: 
> అభ్యర్ధులు ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌ తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలి. అలాగే 10 పాస్‌పోర్టు సైజ ఫొటోలు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. 
> శిక్షణ పూర్తయిన తర్వాత కనీసం 5 సంవత్సరాల పాటు పనిచేస్తామని సెక్యూరిటీ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల శిక్షణ మధ్యలో వెళ్లిపోవాల్సి వస్తే.. శిక్షణ ఖర్చులతో పాటు, అప్పటివరకు పొందిన వేతనం‌ చెల్లించాల్సిందే. 
> అభ్యర్థులు రెండు ఖాకీ నిక్కర్లు, రెండు తెల్లని హాఫ్‌ హ్యాండ్‌ బనియన్లు, బెడ్ షీట్‌, షూ ఇతర అవసరమైన అన్ని వస్తువులను స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. 
> అభ్యర్ధులు బంగారు ఇతర విలువైన వస్తువులను శిక్షణ కేంద్రంలోకి తీసుకురాకూడదు. అంతేకాదు బయటివారెవరూ లోపలికి రావడానికి వీల్లేదు.

Telangana
Police constable
Selection Process

మరిన్ని వార్తలు