ఉరి తప్పించుకోలేరు : నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్ల పై సుప్రీం విచారణ

Submitted on 14 January 2020
Nirbhaya rape and murder case: Supreme Court to hear curative petitions of 2 convicts days before hanging

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీహార్ జైలులో ట్రయల్స్ కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఇటీవల పటియాలా కోర్టు బ్లాక్ వారెంట్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ వారెంట్ అంటే మరణశిక్ష విధించిన వ్యక్తిని ఉరి తీయాలని జైలు అధికారులను ఆదేశించే కోర్టు ఉత్తర్వు. ఈ నెల 22న ఉదయం 7గంటలకు దోషులను ఉరితీయాలని పటియాలా కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. 

అయితే పటియాలా కోర్టు తీర్పు అనంతరం ఇద్దరు దోషులు వినయ్ శర్మ(26),ముకేష్ కుమార్(32) దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లపై ఇవాళ(జనవరి-14,2020)మధ్యాహ్నాం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మధ్యాహ్నాం 1:45గంటలకు ఇద్దరు దోషుల క్యూరేటివ్ పిటిషన్లను ఐదుగరు సభ్యుల ధర్మాసనం సుప్రీం విచారించనుంది. ఐదుగరు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ భానుమతి,జస్టిస్ బూషన్ లు కూడా ఉన్నారు. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు 2017లో మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు బెంచ్ లో ఈ ఇద్దరు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా 2018లో నలుగురు దోషుల్లో ముగ్గురు.. వినయ్ శర్మ,ముఖేష్,మరో దోషి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టేసిన బెంచ్ లో కూడా జస్టిస్ భానుమతి,జస్టిస్ బూషన్ లు ఉన్నారు. 

క్యూరేటివ్ పిటిషన్ అనేది న్యాయస్థానాలచే శిక్షించబడిన వ్యక్తికి లభించే చివరి న్యాయ పరిహారం. వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను ఒకవేళ ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరిస్తే, ఇద్దరికీ చివరగా ఆప్షన్ గా రాష్ట్రపతి క్షమాబిక్ష కోరే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులోని మరో ఇద్దరు దోషులు అక్షయ్ కుమార్ సింగ్(31),పవన్ గుప్తా(25)లు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేదు.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు... తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో... జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
 

Nirbhaya Rape
Convicts
Curative Petition
Supreme Court
HEARING
Tihar jail
death sentence

మరిన్ని వార్తలు