బై బై ఇండియా.. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ తిరుగు పయనం

Submitted on 25 February 2020
donald trump leaves india

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి 25,2020) రాత్రి 10.30 గంటల ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా బయలుదేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ట్రంప్ బృందం అమెరికా పయనమైంది.

ట్రంప్ రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించారు. ట్రంప్ పర్యటనతో భారత్-అమెరికా మధ్య బంధం బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ టూర్ లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ తన కుటుంబంతో కలిసి సోమవారం(ఫిబ్రవరి 24,2020) ఉదయం ఇండియా వచ్చారు. బిజీబిజీగా గడిపారు. భారత దేశాన్ని, ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాకు భారత్ మంచి ఫ్రెండ్ అని చెప్పారు. అమెరికన్ల హృదయాల్లో భారతీయులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు ట్రంప్. మోడీ జీవితం ఎంతో మందికి ఆదర్శం అని ప్రశంసించిన ట్రంప్.. ఒక ఛాయ్‌ వాలాగా జీవితం మొదలు పెట్టి ఈ స్థాయికి ఆయన చేరుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు.

భారత పర్యటన విజయవంతంగా జరిగిందని ట్రంప్ అన్నారు. భారత పర్యటనకు తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. గొప్ప ఆతిథ్యమిచ్చిన భారత్ కు కృతజ్ఞతలు చెప్పారు. భారత ప్రధాని మోడీ చాలా గొప్ప వ్యక్తి అన్న ట్రంప్.. చాలా టఫ్ కూడా అన్నారు. అమెరికా నుంచి భారత్ కొనుగోళ్లు జరపడం ఆనందకరమన్నారు. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం కుదురుతుందన్నారు. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అమలుకు కృషి చేస్తానన్నారు. అమెరికాలో తమ రిపబ్లికన్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలు చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు ట్రంప్. ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ తెలిపారు. 

ప్రపంచంలో అందరూ ప్రధాని మోడీని అభిమానిస్తారని, మోడీ చాలా కచ్చితమైన వ్యక్తి అని ట్రంప్ అన్నారు. శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోడీ ఒక రోల్ మోడల్ అని కితాబిచ్చారు. నా నిజమైన స్నేహితుడు మోడీ అని, భారతదేశ అభివృద్ధి కోసం నిరంతరం మోడీ కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. 5 నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ మైదానంలో మోడీకి స్వాగతం పలికామని గుర్తు చేసిన ట్రంప్.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంలో నాకు మోడీ స్వాగతం పలికారని ట్రంప్‌ చెప్పారు.

మంగళవారం(ఫిబ్రవరి 25,2020) రాష్ట్రపతి భవన్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌, మెలనియా దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లోని ప్రత్యేకతలను ట్రంప్‌ దంపతులకు వివరించారు. రామ్‌పూర్వ బుల్‌ విగ్రహ చారిత్రక నేపథ్యాన్ని ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ వివరించారు.

రాష్ట్రపతి భవన్‌లోని బుద్ధుడి విగ్రహం దగ్గర డొనాల్డ్ ట్రంప్, మెలానియాతో రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫొటో దిగారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో ట్రంప్‌ దంపతులు మాట్లాడారు. ట్రంప్‌కు ప్రధాని మోడీ అతిథులను పరిచయం చేశారు. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు హాజరయ్యారు.

donald trump
america
india
India tour
leaves
Modi
Prime Minister
america president
Delhi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు