కనిపిస్తే కాల్చుడే..ఢిల్లీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్

Submitted on 25 February 2020
Delhi violence: Shoot-at-sight order issued in North East district

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసకు దారితీశాయి. ఈశాన్య ఢిల్లీలో షాపులు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఆదేశాలు జారీ చేశారు.

ఈశాన్య ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత అమలవుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్లతో 13మంది మృతి చెందడంతో పాటు.. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో కేంద్రం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పలు చోట్ల విధ్వంసానికి పాల్పడుతున్నాయి. తాజాగా చాంద్‌బాగ్‌ ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ అల్లరి మూకలను అడ్డుకోలేకపోతున్నారు. పరిస్థితి చేయి దాటి పోతుండడంతో ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పురా, కరావల్‌ నగర్‌, జాఫరాబాద్, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీలోనికి ఇతర ప్రాంతాల వారు రాకుండా సరిహద్దులను మూసివేశారు.

రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 13 మంది మృతి చెందారు. దాడుల్లో 56 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా ఉన్నారు. 130 మంది పౌరులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని వెల్లడించారు. ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలు మంగళవారం(ఫిబ్రవరి 25,2020) హింసాత్మకంగా మారాయి. మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, గోకుల్‌పురిలో ప్రాంతాల్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మంగళవారం ఉదయానికి నలుగురు మృతి చెందారు. మొదట సోమవారం నిరసనకారులు స్థానిక ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. అనంతరం ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ఈ రాళ్ల దాడిలో రతన్‌లాల్‌ అనే కానిస్టేబుల్‌కు తలకు తీవ్ర గాయాలై మృతి చెందగా... ఆ తర్వాత మరో ముగ్గురు పౌరులు మృతిచెందారు. ఇరువర్గాల ఘర్షణలో కనీసం 60 మంది పోలీసులు సహా పౌరులు గాయపడ్డారు. డీసీపీ అమిత్‌ శర్మకు సైతం గాయాలయ్యాయి. పరిస్థితి చేజారడంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు కొద్ది రోజులుగా జఫ్రాబాద్, మౌజ్‌పూర్, షహీన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 500 మందికి పైగా ఆందోళనకారులు షాహీన్‌బాగ్ తరహాలోనే జఫ్రాబాద్ మెట్రో రైల్వేస్టేషన్ సముదాయం కింద శనివారం అర్ధరాత్రి నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు.

Delhi violence
Shoot at sight order
North East district
caa
rioters
Police

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు