పౌరసత్వ చట్టం ఢిల్లీ రణరంగం : జనవరి 05 వరకు జామియా యూనివర్శిటీ మూసివేత

Submitted on 16 December 2019
Citizenship Act Jamia University Closed till January 05

పౌరసత్వ చట్ట.. వ్యతిరేక జ్వాలలు దేశ రాజధానిని దహించి వేస్తున్నాయి. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆందోళనల్లోకి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఎంట్రీ ఇవ్వడం.. పోలీసులు వాళ్లపై లాఠీలు ఝుళిపించడంతో ఢిల్లీ యుద్ధభూమిని మరిపించింది. ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాలను ధ్వసం చేసి.. బీభత్సం సృష్టించారు.

బిల్లుకు వ్యతిరేకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆందోళన చేపట్టేందుకు నిరసనకారులు సిద్ధమయ్యారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. భరత్ నగర్ ఏరియాలో నిరసనకారులు రెచ్చిపోయారు. మూడు బస్సులకు, వందకు పైగా ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన ఫైరింజన్లపైనా ఆందోళకారులు దాడులు చేశారు. ఓ బస్సులో ప్రయాణికులు దిగక ముందే ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పూర్తిగా మంటలు  అంటుకునేలోగా ప్రయాణికులు బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

జామియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీనే ఉద్రిక్తతలకు కారణమైంది. విద్యార్థుల ర్యాలీలోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు అల్లర్లకు కారణమయ్యారని పోలీసులు చెబుతున్నారు. జంతర్ మంతర్ కు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో  పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో బస్సులకు నిప్పు పెట్టారు. అల్లరి మూకలను అదుపుకు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్  షెల్స్ ప్రయోగించారు. ఘర్షణల్లో 35మంది  విద్యార్థులు, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. 

జామియా యూనివర్శిటీ లోపలికి ప్రవేశించి 50 నుంచి 100 మంది దాకా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగానే నిరసన తెలిపినట్టు స్పష్టం చేశారు. వర్సిటీ ప్రాంగణంలోకి  పోలీసులు అనుమతి లేకుండా, బలవంతంగా ప్రవేశించారని ఆరోపించారు. విద్యార్థులను, లెక్చరర్లను కొట్టి క్యాంపస్‌ నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారని తెలిపారు. నిరసనలు అలీగఢ్ ముస్లిం వర్శిటీకి కూడా పాకాయి. అప్రమత్తమైన వర్శిటీ అధికారులు జనవరి 5వరకు విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.  
Read More : పౌరసత్వ బిల్లు: ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దాడి

Citizenship Act
Jamia University
Closed
Delhi News

మరిన్ని వార్తలు