ఏపీలో పెరిగిన పోలింగ్‌ శాతం : మహిళలే అధికంగా ఓటు వేశారు

Submitted on 14 April 2019
Increased polling percentage in AP

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గతేడాది కంటే పోలింగ్‌ శాతం విపరీతంగా పెరిగింది. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ....ఓటింగ్‌ పర్సంటేజ్‌ పెరిగింది. ఓటర్లలో చైతన్యం రావడమే కారణమా? పురుషులతో పోటీ పడి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారా ? ఏపీలో పోలింగ్‌ శాతం పెరగడం ఆంతర్యమేంటీ ?
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో...గతేడాది కంటే ఈ సారి పోలింగ్‌ శాతం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రైవేటు,ప్రభుత్వ ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు... సొంత ప్రాంతాలకు వెళ్లారు. తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి...ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యత ఏంటో చాటి చెప్పారు. కొన్ని లక్షల మంది హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలుంటే...101 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఓటు వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళల సంఖ్య 1.37 శాతం పెరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే.. అప్పటితో పోల్చితే ఇప్పుడు 13.75 లక్షల మంది మహిళలు అదనంగా ఓటేశారన్నమాట.  ఇక పురుష ఓటర్లతో పోల్చితే.. దాదాపు 2 లక్షల 40వేల మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. 

గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో...పురుషుల ఓటింగ్‌ శాతం 1.1 పెరిగింది. 2014లో 78.41 శాతం పోలింగ్ నమోదైతే...ప్రస్తుత ఎన్నికల్లో 79.64 శాతానికి పెరిగింది. అర్ధరాత్రి దాటి తర్వాత కూడా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం...పోలింగ్‌ పర్సేంటేజ్‌ పెరగడాన్ని రెండు పార్టీలు స్వాగతిస్తున్నాయి. భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో...తమకే లాభిస్తుందని అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు లెక్కలు వేసుకుంటున్నాయి. 

ప్రధానంగా మహిళా ఓట్లు ఎక్కువగా పడడం తమకే అనుకూలమని టీడీపీ నేతలు ప్రకటించుకుంటుంటే.. జగన్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే.. ఎక్కువమంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారంటోంది వైసీపీ. ఈ రెండు పార్టీల్లో ఎవరి అంచనాలను మహిళలు నిలబెడతారో.. మే 23న తేలిపోనుంది. 
 

Increase
polling percentage
AP
Woman
Voting

మరిన్ని వార్తలు